మాస్కో : నల్ల సముద్రంలో రష్యాకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. శుక్రవారం ఉదయం ఉక్రెయిన్‌కు చెందిన కిల్లర్ డ్రోన్ చేసిన దాడిలో రష్యా వాణిజ్య పోర్టు నోవోరోసిస్క్‌లో నౌకాదళానికి చెందిన ల్యాండింగ్ షిప్ ఒలెనోగోర్స్కీ గోర్న్యాక్ తీవ్రంగా దెబ్బతింది. దాడి తీవ్రతకు ఆ నౌక ఓ వైపు ఒరిగిపోయింది. నౌకాదళంతో సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించామని ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీసెస్ విభాగం వర్గాలు వెల్లడించాయి. ఈ కిల్లర్ సముద్ర డ్రోన్‌లో 450 కిలోల పేలుడు పదార్థాన్ని అమర్చి ‘ఒలెనోగోర్స్కీ’పై దాడి చేసినట్లు తెలిపాయి. ఈ దాడి సమయంలో యుద్ధనౌకలో 100 మంది సిబ్బంది ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దాడి దెబ్బకు రష్యా నౌక తీవ్రంగా దెబ్బతింది. దీంతో ఇది పనిచేయలేని స్థితికి చేరింది అని ఉక్రెయిన్ భద్రతా వర్గాలు వెల్లడించాయి.
సంబంధించిన వీడియోను ఉక్రెయిన్ వార్తా సంస్థలు సోషల్ మీడియా ఖాతాల్లో ఉంచాయి. దీనిలో ఓ చిన్న పడవ భారీ యుద్ధనౌక వైపు దూసుకెళ్లి ఢీకొన్న దృశ్యాలున్నాయి. సెయింట్ పీటర్స్‌బర్గ్ నౌకాశ్రయం తర్వాత రష్యాలో రెండో అతిపెద్ద వాణిజ్య రేవు నోవోరోసిస్క్. ప్రపంచ చమురు మార్కెట్‌లోని 2 శాతానికి సమానమైన 18 లక్షల పీపాల క్రూడ్ ఈ నౌకాశ్రయం నుంచే ఎగుమతవుతుంది. ఈ నౌకాశ్రయంపై జరిగే దాడులను ఎదుర్కొనేందుకు రష్యా రెండు యుద్ధ నౌకలను మోహరించింది. వీటిల్లో ఒలెనోగోర్స్కీ, సువోరోవెట్స్ అనే నౌక ఉన్నట్లు భావిస్తున్నారు. గాల్లో దూసుకొచ్చే ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చడం దీని పని అని నిపుణులు పేర్కొంటున్నారు.