పెద్ద ఎత్తున దేశం వదిలి వెళ్తున్న ప్రజలు
విమానాల టికెట్లన్నీ క్షణాల్లో బుక్
మాస్కో: ఉక్రెయిన్‌పై సాగుతున్న దాడిలో మరింత పట్టు బిగించే క్రమంలో 3 లక్షల మందితో పాక్షిక సైనిక సమీకరణ చేపడుతున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం కీలక ప్రకటన చేయడం తెలిసిందే. అయితే పుతిన్ ప్రకటన రష్యన్ల గుండెల్లో గుబులు రేసింది. ఏ క్షణాన యుద్ధ విధుల్లో చేరాలని ఆదేశాలు వస్తాయోనని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆ ప్రమాదంనుంచి తప్పించుకోవడానికి పెద్ద ఎత్తున ప్రజలు దేశం విడిచి వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. గతంలో ఆర్మీలో కొంతకాలం పని చేసి ప్రస్తుతం రిజర్వ్‌గా ఉన్న 35 ఏళ్లలోపు పురుషులను ఈ సైనిక సమీకరణకు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది రిజర్విస్ట్‌లకు నోటీసులు అందాయని తెలుస్తోంది. వారిని వైద్య పరీక్షలు చేయించుకోవలసిందిగా ఆర్మీ అధికారలునుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. సైన్యంలో చేరడానికి భయపడి వీరిలో చాలా మంది దేశం విడిచి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తున్పారు. దీంతో ఇప్పుడు ‘ హౌ టు లీవ్ రష్యా’అనేది గూగుల్ సెర్చ్‌లో ట్రెండ్ అవుతోంది. మరో వైపు రష్యానుంచి వెళ్లే విమానాలన్నీ నిండిపోతున్నాయి.
రస్యాకు సమీపంలో ఉన్న ఆర్మేనియా, జార్జియా, అజర్‌బైజాన్, కజకిస్థాన్‌తో పాటుగా టర్కీ లాంటి దేశాల్లోని నగరాలకు వెళ్లే విమానాల్లో టికెట్లు బుధవారం క్షణాల్లో అమ్ముడైపోయాయి. మాస్కోనుంచి వేరే దేశాలకు వెళ్లే దాదాపు అన్ని విమానాల్ల్లో శనివారం వరకు టికెట్లన్నీ బుక్ అయ్యాయి. ఈ క్రమంలో టికెట్ల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. విమానాలను ట్రాక్ చేసే ‘ఫ్లైట్ రాడార్ 24’ డేటాను చూస్తే రష్యానుంచి బయటికి వెళ్లే విమానాల రద్దీ స్పష్టంగా అర్థమవుతుంది.
టికెట్ల విక్రయాలు బంద్
మరో వైపు రష్యాలో 18 ఏళ్లనుంచి 65 ఏళ్ల లోపు పురుషులకు విమాన టికెట్లు విక్రయించడం లేదని పలు స్థానిక మీడియా సంస్థలు తెలిపాయి. సైనిక సమీకరణ నేపథ్యంలో తమపై మార్షల్ చట్టం ప్రయోగిస్తారేమోనన్న భయంతో రష్యా విమానయాన సంస్థలు పురుషులకు టికెట్లు విక్రయించట్లేదని సదరు కథనాలు తెలిపాయి. విదేశాలకు వెళ్లేందుకు రష్యా రక్షణ శాఖ అనుమతి ఉన్న పురుషులకు మాత్రమే ఎయిర్ లైన్స్ టికెట్లు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ సైనిక సమీకరణలో భాగంగా జైళ్లలో ఉన్న ఖైదీలను కూడా యుద్ధ విధుల్లోకి తీసుకోవాలని రష్యా యోచిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఆరునెలల తరాత అధ్యక్షుడి క్షమాభిక్షతో పాటుగా నెలకు లక్ష రూబుల్స్(1,400పౌండ్లు ) ఇస్తామన్న హామీతో వీరిని యుద్ధ విధుల్లోకి చేర్చుకుంటున్నట్లు ‘ ది గార్డియన్’ పత్రిక తెలిపింది. కిరాయి హత్యలు చేసే వాగ్నర్ గ్రూపు ఆధ్వర్యంలో ఈ రిక్రూట్‌మెంట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇలా రిక్రూట్ చేసుకునే వారిలో సీరియల్ కిల్లర్స్‌తో పాటుగా నరమాంస భక్షకులు కూడా ఉన్నారని ‘డైలీ బీస్ట్’ అనే మరో పత్రిక తెలిపింది.