మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఫలితంగా పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించడంతో రష్యా ప్రజలు ధరల పెరుగుదలను ఎదుర్కొంటున్నారు. విదేశీ ప్రయాణాలు కూడా తగ్గిపోయాయి. రష్యా కరెన్సీ రూబుల్ విలువ కూడా సన్నగిల్లింది. అమెరికా డాలర్‌కు మారుగా రష్యా కరెన్సీ 30 శాతం పతనమయింది. స్విఫ్ట్ అంతర్జాతీయ పేమెంట్ సిస్టం నుంచి రష్యా బ్యాంకులను బ్లాక్ చేయాలని కొన్ని పాశ్చాత్య దేశాలు నిర్ణయించాయి. రష్యా బ్యాంకుల్లో ఒకటైన విటిబి ఆంక్షలను ఎదుర్కొంటున్నందున ఆపిల్ పే, గూగుల్ పే, శాంసంగ్ పే వంటి యాప్స్ ద్వారా చేసే చెల్లింపులు సమస్యలు ఎదుర్కొనవచ్చని మాస్కోకు చెందిన ప్రజా రవాణా హెచ్చరించింది. దాంతో ప్రజలు బ్యాంకులు, ఏటిఎంల వద్ద సోమవారం క్యూ కట్టారు.
రష్యా రూబుల్ విలువ తగ్గడం అంటే రష్యా సగటు వ్యక్తి జీవన ప్రమాణం కూడా తగ్గిందని అర్థం. రష్యన్లు ఇప్పటికీ దిగుమతి చేసుకున్న వస్తువుల పట్ల మక్కువ చూపుతున్నారు. వాటి ధరలు పెరుగవచ్చని భావిస్తున్నారు. రూబుల్ విలువ పడిపోయినందున రష్యన్లకు విదేశీ ప్రయాణాలు కూడా బహు ఖరీదైనవిగా మారిపోయాయి. ఇదివరలో 1990 దశకంలో రూబుల్ విలువ భారీగా పతనమయింది. 1998లో అయితే ఆర్థిక సంక్షోభం కూడా వచ్చింది. ఇక 2014లో ఆయిల్ ధరలు పడిపోయినందున, ఉక్రెయిన్‌కు చెందిన క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా స్వాధీనం చేసుకోవడంతో రష్యాపై ఆంక్షలు అమలయ్యాయి. దాంతో రూబుల్ విలువ మరింత పతనమయింది.
రష్యా కరెన్సీ నిల్వలను స్తంభింపచేయాలని పాశ్చాత్య దేశాలు ఆదివారం నిర్ణయం తీసుకోవడంతో దేశ ఆర్థిక స్థిరత్వం దెబ్బతినకుండా రష్యా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రష్యా సెంట్రల్ బ్యాంకు బెంచ్‌మార్క్ రేటును 8.5 శాతం నుంచి 20 శాతానికి పెంచింది. శుక్రవారం అమెరికా డాలరుకు మారుగా రష్యా రూబుల్ 84 ఉండగా అది సోమవారం 105.27కు పెరిగిపోయింది. డాలరుకు మారుగా రష్యా కరెన్సీ అత్యల్ప స్థాయికి పతనం కావడం చరిత్రలో ఇదేనని చెప్పాలి.