సంఘీభావంగా కుతుబ్‌మీనార్‌పై రంగురంగుల కాంతులు
న్యూఢిల్లీ : రువాండా మారణహోమ 30 వ వార్షిక సంతాపదినం సందర్భంగా రువాండా ప్రజలకు సంఘీభావం తెలియజేస్తూ దక్షిణ ఢిల్లీలోని కుతుబ్‌మీనార్ స్థూపాన్ని ఆదివారం రాత్రి రంగురంగుల దీపాలతో కేంద్ర ప్రభుత్వం అలంకరించింది. యునెస్కో గుర్తించిన చారిత్రక చిహ్నమైన కుతుబ్‌మీనార్‌పై రువాండా పతాకం రంగురంగులతో కనులవిందు చేసింది. టుట్సీకి వ్యతిరేకంగా రువాండా మారణహోమం 1994 ఏప్రిల్ 7 జులై మధ్య జరిగింది.
దాదాపు వంద రోజుల కాలంలో 8 లక్షల వరకు టుట్సీ మరణాలు సంభవించాయి. రువాండా రాజధాని కిగాలిలో భారతదేశం తరఫున ఆర్థిక సంబంధాల సెక్రటరీ డమ్ము రవి సంతాపాన్ని తెలియజేశారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్ పోస్ట్ ద్వారా తెలియజేశారు. గతరాత్రి రంగుల కాంతులతో ప్రకాశించే కుతుబ్‌మీనార్ ఫోటోను కూడా ఆయన షేర్ చేశారు. 2017 ఫిబ్రవరిలో అప్పటి భారత ఉపాధ్యక్షుడు హమీద్ అన్సారీ రువాండా పర్యటన సందర్భంగా మారణహోమ బాధితులకు నివాళులు అర్పించారు.