ఓన్స్, నోరి ముందుకు
లండన్ : ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో 16వ సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా), ఎలినా రిబకినా (కజకిస్థాన్) సెమీ ఫైనల్‌కు చేరుకున్నారు. మరోవైపు మూడో సీడ్ ఓన్స్ జబియుర్ (ట్యూనీషియా), తొమ్మిదో సీడ్ కామెరూన్ నోరి (బ్రిటన్) కూడా క్వార్టర్ ఫైనల్ పోటీల్లో విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో బ్రిటన్ ఆటగాడు నోరి 36, 75, 26, 63, 75 తేడాతో జయకేతనం ఎగుర వేశాడు. ఐదు సెట్ల మారథాన్ సమరంలో నోరి బెల్జియం ఆటగాడు డేవిడ్ గోఫిన్‌ను ఓడించాడు. ఇద్దరు సర్వం ఒడ్డి పోరాడడంతో మ్యాచ్ యుద్ధాన్ని తలపించింది. చివరికి విజయం మాత్రం నోరినే వరించింది. ఇక మహిళల విభాగంలో ఓన్స్ కూడా చెమటోడ్చి నెగ్గింది. చెక్ క్రీడాకారిణి మారిబౌజ్‌కొవాతో జరిగిన పోరులో ఓన్స్ 36, 61, 61తో జయకేతనం ఎగుర వేసింది.
అలవోకగా..
మరోవైపు బుధవారం జరిగిన మహిళల క్వార్టర్ ఫైనల్ పోరులో హలెప్ అలవోక విజయాన్ని అం దుకుంది. అమెరికా క్రీడాకారిణి అనిసిమోవాతో జరిగిన మ్యాచ్‌లో హలెప్ 62, 64తో విజయం సాధించింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన హలెప్ వరుసగా రెండు సెట్లు గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లింది. అయితే మరో క్వార్టర్ ఫైనల్ పోరు లో రిబకినా చెమటోడ్చి నెగ్గింది. ఆస్ట్రేలియాకు చెందిన అజ్లా టొమిజానొవిక్‌తో జరిగిన మ్యాచ్‌లో రిబకినా 46, 62,63తో విజయం సాధించింది. తొలి సెట్‌లో రిబకినాకు చుక్కెదురైంది. అయితే తర్వాత పుంజుకున్న రిబకినా వరుసగా రెండు సెట్లు గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.