Saturday, November 16, 2024

నేటి నుంచి ఊరూరా సంబురాలు

- Advertisement -
- Advertisement -

Rythu bandhu celebrations till 10th Jan

రూ.50వేల కోట్ల పెట్టుబడి సాయం నేపథ్యంలో టిఆర్‌ఎస్ వేడుకలు

శాసనసభ్యులు, పార్టీ శ్రేణులు ముందుండి నడిపించాలి
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆడపడచులకు ముగ్గుల పోటీలు, విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, పెయింటింగ్ కాంపిటీషన్లు
రైతు వేదికల వద్దకు ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ఊరేగింపు
ప్రభుత్వ రైతు సంక్షేమ కార్యక్రమాలతో కూడిన కరపత్రాల పంపిణీ
పండుగ వాతావరణంలో 10వ తేదీన ఘనంగా ముగింపు సంబురాలు
టిఆర్‌ఎస్ శ్రేణులకు టెలికాన్ఫరెన్స్ ద్వారా మంత్రి కెటిఆర్ దిశానిర్దేశం

మన తెలంగాణ/హైదరాబాద్: నేటి నుంచి వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తం రైతుబంధు సంబురాలను ఘనంగా నిర్వహించాలని టిఆర్‌ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ పథకింద రైతుల ఖాతాల్లోకి రూ.50వేల కోట్ల చేరుకున్న సందర్భంగా వేడుకలను జరపాలని తలపెట్టింది. రైతుబంధు కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి మొదలుకుని ఈ నెల 10వ తేదీ వరకు మొత్తంగా ఈ నిధులు (రూ. 50వేల కోట్ల) రైతుల ఖాతాల్లోకి చేరబోతున్నాయి. ఇది రైతుల్లో ఎనలేని సంతోషాన్ని కలిగిస్తుండగా, రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఒక గొప్ప ఊతంగా మారింది. ఈ నేపథ్యంలో రైతుబంధు సంబురాలను గ్రామ గ్రామాన అత్యంత వైభవంగా నిర్వహించాలని అధికార పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం పార్టీ శ్రేణులతో ఇదే అంశంపై టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ పెసిడెంట్, మంత్రి కెటిఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన టెలికాన్ఫరెన్స్‌లో పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగా ఎవరు ఆలోచించిన దాఖలాలు లేవన్నారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గానీ, ప్రధానమంత్రి కాని చరిత్రలో ఆలోచించని రీతిలో రైతుల గురించి ముఖ్యమంత్రి కెసిఆర్ చాలా ఆలోచించి తీసుకున్న గొప్ప కార్యక్రమమే రైతు బంధు అని అన్నారు. రైతుల ఖాతాల్లోకి రూ. 50వేల కోట్లు వేసిన దాఖలాలు దేశ చరిత్రలో ఎప్పుడు లేదన్నారు. ఇదొక అద్భుతమైన, అసాధారమైన సందర్భమని కెటిఆర్ అభివర్ణించారు. ఇలాంటి చారిత్రక సందర్భాన్ని టిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులుగా మనమంతా వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాలేశ్వరం ప్రాజెక్టును రికార్డు స్థాయిలో గడువుకుంటే ముందుగానే పూర్తి చేసిన ఘనత సిఎం కెసిఆర్‌ది అని అన్నారు. సాగునీటి, తాగునీటి రంగానికి కెసిఆర్ ఇచ్చిన ప్రాధాన్యతకు ఇది నిదర్శనమన్నారు. ఈ నిర్ణయం కారణంగానే రాష్ట్రంలో వ్యవసాయ రంగం కళకళలాడుతోందన్నారు. ఇలాంటి వేడుకలను అమితమైన సంతోషాలతో జరుపుకోవాల్సిన తరుణంలో మళ్లీ కరోనా…ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం విధించిన పరిమితులను దృష్టిలో పెట్టుకుని రైతుబంధు సంబురాలు నిర్వహించాలని మంత్రి కెటిఆర్ సూచించారు. ఇందులో శాసనసభ్యులు ముందుండి నియోజకవర్గ పార్టీ శ్రేణులు అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని కెటిఆర్ ఆదేశించారు. రైతుబంధు సంబరాల్లో స్థానికంగా ఎవరికైనా మరిన్ని మంచి ఆలోచనలు వస్తే వాటిని కూడా స్వీకరించాలన్నారు.

ముఖ్యంగా రానున్న సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఇంటి ముందు రైతుబంధు సంబంధిత ముగ్గులను వేసేలా మహిళా లోకాన్ని కలుపుకొని పోయేలా కార్యక్రమాలు నిర్వహించాలని కెటిఆర్ సూచించారు. విద్యార్థుల్లో రైతుబంధుపైన ఉపన్యాస, వ్యాసరచన, పెయింటింగ్ పోటీలు నిర్వహించాలన్నారు. ఈ రెండు కార్యక్రమాలు చేపడుతే మహిళా లోకంతో పాటు భవిష్యత్ తరానికి కూడా రైతుబంధు గురించిన మరింత అవగాహన కలుగుతుందన్నారు. అలాగే ప్రతి గ్రామంలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు ఊరేగింపులతో మొదలుపెట్టి రాష్ట్రంలో ఉన్న రెండు వేల ఆరు వందలకుపైగా రైతు వేదికల వద్ద పండగ వాతావరణంలో ఈ నెల 10వ తేదీన ఘనంగా ముగింపు సంబరాలు జరపాలని కెటిఆర్ సూచించారు. వారం రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వినూత్నంగా చేపట్టాలన్నారు. ఈ సంబరాలకు స్థానికంగా ఉన్న పత్రికలు, స్థానిక టివి ఛానల్, సామాజిక మాధ్యమాల్లో సరైన ప్రచారం వచ్చేలా సమన్వయం చేసుకోవాలన్నారు. ఆయా నియోజకవర్గాల్లో రైతులకు అందిన నిధుల వివరాలతో పాటు ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేయాలన్నారు. దీనిపై స్థానిక ప్రజలు అందరికీ సమాచారం చేరేలా శాసనసభ్యులు సవివరమైన ఒక లేఖను రాస్తే బాగుంటుందని ఈ సందర్భంగా కెటిఆర్ సూచించారు.

ఈ సంబురాలకు సంబంధించి కావాల్సినన ఎలాంటి సమాచారాన్ని అయినా తమ శాఖ శాసనసభ్యులకు, ఇతర ప్రజాప్రతినిధులకు అందించేందుకు సిద్ధంగా ఉందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. వ్యవసాయ శాఖ తరఫున కూడా అవసరమైన ప్రచార, సమాచార సామాగ్రిని సిద్ధం చేస్తున్నామన్నారు. 63 లక్షల రాష్ట్ర రైతులకు రైతుబంధు అందిస్తున్న అపురూప కార్యక్రమం భారత దేశంలోనే కాదు ప్రపంచంలోని ఏ దేశంలో లేదనడం అతిశయోక్తి కాదన్నారు. సాగు వైపు కొత్త తరాన్ని మళ్లించేందుకు ఆలోచించే ప్రతి ప్రభుత్వం రైతు బంధు లాంటి కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంటుందన్నారు. అలాంటి ప్రయత్నాలకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు రైతుబంధు ఒక స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఏకకాలంలో అత్యధిక మందికి ఉపాధి ఇవ్వగలిగే వ్యవసాయ రంగాన్ని ఎంత పటిష్టం చేస్తే అంత మంచిదని సిఎం కెసిఆర్ ఎంతో దూరదృష్టి, దార్శనికతతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఇది అద్భుతమైన విజయాన్ని సాధించిన నేపథ్యంలో మనమంతా సంతోషంతో వేడుకలు జరుపుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో పార్టీకి చెందిన శాసనసభ్యులు, ఎంపిలు, ఎంఎల్‌సిలు, జడ్‌పి చైర్మన్లు, రైతుబంధు అధ్యక్షులు, డిసిఎంఎస్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News