రైతుబంధు ఉత్సవాలను పొడిగిస్తూ టిఆర్‌ఎస్ శ్రేణులకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ పిలుపు
కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని సూచన
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో జరుగుతున్న రైతుబంధు సంబురాలను సంక్రాంతి పండుగ వరకు కొనసాగించాలని టిఆర్‌స్ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. రైతుబంధు కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రూ. 50వేల (10వ తేదీ నాటికి) కోట్లు జమ అవుతున్న సందర్భంగా ఈ సంబురాలను ఘనంగా నిర్వహించాలని తలపెట్టింది. ఇందులో భాగంగా ప్రతి గ్రామం, రైతుల ఇళ్ల ముందు ప్రత్యేకంగా వేడుకలను నిర్వహించాలని పార్టీ శ్రేణులను పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఈ నెల మూడవ తేదీ నుంచి రైతుబంధు ఉత్సవాలు అట్టహాసంగా మొదలయ్యాయి. ఇవి ఈ నెల 10వ తేదీ నాటితో ముగియాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో పదవ తేదీ వరకు వరకు అనేక ఆంక్షలు అమలులో ఉన్నాయి.
ముఖ్యంగా కొవిడ్ నిబంధనల మేరకు ర్యాలీలకు, ఊరేగింపు అనుమతి లేని నేపథ్యంలో రైతు బంధు ఉత్సవాలను మరో వారం రోజుల పాటు పొడగించాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహాక అధ్యక్షుడు, రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉత్సవాలను కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ సంక్రాంతి పండుగ వరకు రైతు బంధు ఉత్సవాలు జరుపు కోవాలని ఆయన సూచించారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ రైతుబంధు ఉత్సవాలను నిర్వహించాలని ఈ సందర్భందా పార్టీ శ్రేణులకు మరోసారి కెటిఆర్ విజ్ఞప్తి చేశారు.