Wednesday, January 22, 2025

రైతు బంధు, రైతు బీమా పేరుతో కుంభకోణం

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: నకిలీ పత్రాలు సృష్టించి కోట్లాది రూపాయలు స్వాహా చేసిన ఇద్దరు నిందితులను సైబరాబాద్ ఈఓడబ్లూ పోలీసులు అరెస్టు చేశారు. రెండు మొబైల్ ఫోన్లు, బ్యాంక్ డెబిట్ కార్డులు 7, నకిలీ డెత్ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి అవినాష్ మహంతి వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా, కొందుర్గు మండలం, అగ్రియాల్ క్లస్టర్‌లో గోరేటి శ్రీశైలం అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్‌గా 2017 నుంచి పని చేస్తున్నాడు, ఓదేలా వీరస్వామి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గోరేటి శ్రీశైలం ఎఈఓగా పనిచేస్తుండడంతో రైతుబంధు, రైతు బీమా గురించి పూర్తి వివరాలు తెలియడంతో మృతి చెందిన, అర్హతలేని రైతుల వివరాలు తెలుసుకున్నాడు. అలాగే 60ఏళ్ల దాటిన వారి వివరాలు తీసుకుని నకిలీ డెత్ సర్టిఫికెట్, నకిలీ ఆధార్‌కార్డు తీసుకుని రైతు బీమా డబ్బుల కోసం ఎల్‌ఐసికి పంపించేవాడు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం డ్రైవర్ వీరస్వామి బ్యాంక్ ఖాతాలు, సిమ్‌లను ఇవ్వడంతో బీమా డబ్బులు పడగానే బ్యాంక్ నుంచి డ్రా చేసేవాడు.

ఇలా 20 మంది రైతుల బీమా డబ్బులను తీసుకున్నాడు. రైతుల బీమా డబ్బులు తీసుకునేందుకు ఎఈఓ తొమ్మిది బ్యాంక్ ఖాతాలను ఉపయోగించాడు. ఈ నేపథ్యంలోనే రైతు బీమా డబ్బులు ఎల్‌ఐసి నుంచి కోటి రూపాయలు డ్రా చేశాడు. ముందుగానే చేసుకున్న ఒప్పందం మేరకు ఎల్‌ఐసి అధికారుల ఫీల్డ్ వెరిఫికేషన్ లేకపోవడంతో ఎఈఓ దానిని ఉపయోగించుకుని డబ్బులు స్వాహా చేశాడు. రైతుబంధు పేరుతో 130 మంది పేరిట నిధులు మళ్లించాడు. రైతుల పట్టాదార్ పాస్‌బుక్ మొదటి పేజీని తీసుకుని దానిని ఎడిట్ చేసేవాడు. రైతు బంధు పడేవిధంగా దానికి తన వద్ద ఉన్న బ్యాంక్ ఖాతా నంబర్‌ను ఎంటర్ చేసేవాడు. ఇలా 130మంది రైతుల రైతు బంధు డబ్బులను తీసుకున్నాడు. రెండు స్కాంలను కలిసి రూ.2 కోట్లు కోట్టేశాడు. ఈ వ్యవహారం మొత్తం ఎఈఓ భార్యకు కూడా తెలుసని, ఆమెపై కూడా కేసు నమోదు చేస్తామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి అన్నారు. ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, ఎస్సై అనిల్‌కుమార్ తదితరులు కేసు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. నిందితులపై 409, 420,467,468,471,477ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

కొట్టేసిన సొమ్ముతో…
రైతుల పేరుతో కొట్టేసిన నిధులను ఎఈఓ కొందుర్గులో 2.35 ఎకరాలు, తుమ్మలపల్లి గ్రామంలో 8.20 ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. రైతు బీమా డబ్బులను తన బ్యాంకు ఖాతా, భార్య బ్యాంక్ ఖాతాకు మళ్లించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News