హైదరాబాద్ : రైతుబంధు పధకం కింద నిధుల పంపిణీ కార్యక్రమం సజావుగా సాగుతున్నట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నింరజన్‌రెడ్డి తెలిపారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ రైతుబంధు పథకం కింద శుక్రవారం 5,49,891మంది రైతుల ఖాతాలకు రూ.687.89కోట్లు జమ చేసినట్టు తెలిపారు. పెట్టుబడి కోసం ఒకనాడు చేయిచాచిన రైతులు నేడు ప్రభుత్వ సాయంతో ధైర్యంగా వ్యవసాయం చేయగలుగుతున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏం చేసినా దానిని విమర్శించడమే విపక్షాలు పనిగా పెట్టుకున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రైతుబంధు, రైతుబీమా, కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ పథకాలు ఏవీ లేవని, ఈ పథకాలు ఏవీ కేసీఆర్ ఎన్నికలలో హామీ ఇవ్వలేవని, బీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో పెట్టలేదన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన ఆసరా ఫించను వృద్ధులకు రూ.200, దివ్యాంగులకు రూ.500 మాత్రమే ఉండేదన్నారు. కేసీఆర్ పెద్ద మనసుతో ఫించన్లను రూ.2016, రూ.3016కు పెంచారన్నారు. గురుకులాలతో విద్యారంగంలో, వైద్యకళాశాలలతో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులకు కేసీఆర్ శ్రీకారం చుట్టారని తెలిపారు .దేశంలో రైతుకు చేయూతనిచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అన్నారు. పనిచేసిన ప్రభుత్వానికి ప్రజల ఆదరణ ఉంటుందని, అబద్దపు ప్రచారాలతో ప్రజల దృష్టి మళ్లించావని కోవడం అత్యాశ అవుతుందన్నారు. కేసీఆర్ నాయకత్వం మీద ప్రజలకు అపార విశ్వాసం ఉందని వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.