రైతుబంధుకు ఐదేళ్లు పూర్తి
రైతులఖాతాలకు రూ.65,500కోట్లు
ఏటా 70లక్షల మందికి లబ్ధి: చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగంలో ఒక విన్నూత్నమైన, విప్లవాత్మకమైన పథకం ‘ రైతుబంధు ‘ తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టి బుధావారం నాటితో 5 సంవత్సరాలు పూర్తయ్యిందని రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ సాధనకోసం కొట్లాడినప్పుడు తెలంగాణ నీటివసతులు, వ్యవసాయరంగం గురించిన బాధలు తెలిసిన నాటి తెలంగాణ ఉద్యమ నేత, రాష్ట్ర సాధకులు, నేటి ముఖ్యమంత్రి కె. సి. ఆర్. వ్యవసాయరంగానికి అత్యంత ప్రాముఖ్యతనిచ్చారని తెలిపారు. రైతుల ఆత్మహత్యలను లేని రాష్ట్రంగా చేయాలని, నీటి వసతిని ప్రతి ఎకరానికి ఇవ్వాలని, వ్యవసాయరంగానికి 24గంటల ఉచిత కరెంటు ఇవ్వాలని కలలు కని వాటిని సాకారం చేసారన్నారు.
అందుకే 2014 లో తెలంగాణ రాగానే మొదటగా చెరువులు బాగు చేసుకొని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి, కొత్త ప్రాజెక్టులు త్వరితగతిన నిర్మించి వారికి పెట్టుబడి సాయం అందిస్తే వ్యవసాయాన్ని పండుగ చేయవచ్చనే ఉద్దేశ్యంతో ‘ రైతుబంధు‘ పథకం ద్వారా పంట పెట్టుబడిని 2018లో మొదలుపెట్టడం జరిగిందన్నారు. ఎకరానికి సంవత్సరానికి రూ.10000 చొప్పున 70 లక్షల మంది రైతులకు 10 విడుతల్లో ఇప్పటివరకూ 65,500 కోట్లు అందించడం జరిగిందని వెల్లడించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే మొదలుపెట్టిన ఈ పథకాన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రభావితంచేసే పథకాలలో ఇదొక్కటని యుఎన్‌వో కీర్తించిందన్నారు. భారత వ్యవసాయరంగానికి పితామహుడైన స్వామినాథన్ మెచ్చుకోవడం, ప్రముఖ వ్యవసాయ ఆర్థికవేత్త అశోక్ గులాటి లాంటి వాళ్ళు బాగుందని చెప్పడం జరిగిందన్నారు. అందుకే తెలంగాణ వ్యవసాయరంగం భారతదేశానికి తలమానికంగా తయారయ్యిందని తెలిపారు.తెలంగాణ ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా మారిందన్నారు, పంట విస్తీర్ణంలో 2014-15లో 131.34 లక్షల నుండి 2022-23 నాటికి 209 లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు.
వరి సాగుబడిలో 2014-15 లో 15వ స్థానం నుండి నేడు 2వ స్థానానికి పెరిగి, దిగుబడిలో ప్రధమ స్థానానికి చేరిందన్నారు. ప్రత్తి సాగులో దేశంలోనే 2వ స్థానంలో, మిర్చి సాగులో ప్రథమస్థానంలో నిలిచిందని తెలిపారు. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా 7000 పైగా వరి ధాన్య సేకరణ కేంద్రాలను ఏర్పాటుచేసి మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే. అని వెల్లడించారు. ‘రైతుబంధు‘ పథకం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తరువాత కేంద్ర ప్రభుత్వం తోపాటుగా వివిధ రాష్ట్రాలు పేరు మార్చి కొద్దిమేరకు అమలు చేశారు అంటే అది మనకు గర్వకారణం అన్నారు. ఇంతటి అద్భుతమైన పథకాన్ని రాష్ట్ర రైతాంగానికి అందించిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు యావత్ తెలంగాణా రైతాంగం కృతఙ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నారని తెలంగాణ రైతుబంధు సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.