Thursday, December 19, 2024

సాగు భూములకే రైతు భరోసా

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : గత ప్రభుత్వం మాదిరి అబద్ధాల బడ్జెట్ ప్రవేశపెట్టకుండా వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో సిఎం రేవంత్‌రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, గత ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారు. అబద్దాల ప్రాతిపదికన బడ్జెట్ పెట్టదలుచుకోలేదని సిఎం స్పష్టం చేశారు. వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్‌ను రూపొందించామని తెలిపారు. అబద్ధాలు చెపితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి సంవత్సరం అంతా అబద్ధాలు చెప్పాల్సి ఉంటుందని పే ర్కొన్నారు. పదేళ్లు అయినా కెసిఆర్‌కు బడ్జెట్ అంచనా వేయడం రాలేదని విమర్శించారు.

వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించిన మంత్రి భట్టి విక్రమార్కను సిఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. ఆర్థిక మంత్రి పూర్తిగా అధ్యయనం చేసిన త ర్వాతనే మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని తెలిపారు. రైతు రుణమాఫీ చేస్తామని ఈ సందర్భంగా సిఎం పునరుద్ఘాటించారు. మిత్తి కట్టలేకనే రైతులు అవమానంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. కమీషన్ల కోసం టెండర్లు పిలిస్తే గత ప్రభుత్వం లాగే అవుతుందని, రుణమాఫీ బరాబర్ రద్దు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను తప్పకుండా రాబడతామని చెప్పారు. కేంద్రాన్ని అదనంగా అడిగి కూడా నిధులు తెచ్చుకుంటామని స్పష్టం చేశారు.

అర్హులైన రైతులకే రైతుబంధు
రాష్ట్రంలో అర్హులైన రైతులకే రైతుబంధు అందేలా చూస్తామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. అనర్హులకు రైతు భరోసా ఇవ్వబోమని.. వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే పెట్టుబడి సహాయం అందిస్తామని స్పష్టం చేశారు. హైవే భూములకు, వెంచర్లు వేసి ఇళ్లు నిర్మించున్న భూములకు రైతుబంధు ఇవ్వబోమని చెప్పారు.
అవినీతిపై విచారణ
గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై అన్ని విధాలుగా విచారణ చేపడతామని సిఎం పేర్కొన్నారు. అమరవీరుల స్థూపం, అంబేడ్కర్ విగ్రహం, సచివాలయం నిర్మాణాలపై విచారణ జరిపిస్తామని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిబాటుపై విజిలెన్స్ విచారణలో ప్రాథమికంగా చర్యలు తీసుకున్నామని, జ్యుడిషియల్ విచారణలో అసలు విషయాలు తెలుస్తాయని చెప్పారు. జ్యూడీషియల్ విచారణ తర్వాతనే ఈ విషయంపై ముందుకెళతామని రేవంత్ రెడ్డి చెప్పారు. నిధుల కేటాయింపు, వ్యయాలపై కూడా విచారణ చేస్తామని పేర్కొన్నారు.

ప్రతిపక్షాలనూ మేడిగడ్డకు తీసుకెళతాం
మేడిగడ్డ ప్రాజెక్టును చూసేందుకు వెళ్దామని ఎంఎల్‌ఎలందరినీ ఆహ్వానించానని, తమ ఎంఎల్‌ఎలనే కాదు, ప్రతిపక్షాలనూ మేడిగడ్డకు తీసుకెళతామని సిఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 13వ తేదీన బిఆర్‌ఎస్ వాళ్లకు సభ ఉంటే వేరే తేదీ చెప్పినా తాము ఆలోచిస్తామని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఒకరోజు ముందు లేదా వెనుక వెళదామని చెప్పినా, అందుకు తాము సిద్ధం అని ప్రకటించారు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. ప్రాజెక్టులపై న్యాయ విచారణ తర్వాతే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
తెలంగాణ భాష ఇలాగే ఉంటుంది
అసెంబ్లీ ప్రొసీజర్ అంతా స్పీకర్ చూస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ భాష ఇలాగే ఉంటుందని, ఎంఎల్‌సిలకు క్షమాపణ చెప్పే అంశం సభా అధికారులు చూసుకుంటారని అన్నారు. అసెంబ్లీలో తాను తెలంగాణ భాషనే మాట్లాడుతున్నానన్నారు. బిఎసి సమావేశానికి బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్‌రావును అనుమతించకపోవడంపై సిఎం స్పందించారు. 2014లో తాను, ఎర్రబెల్లి దయాకర్‌రావు టిడిపి పార్టీ తరపున బిఎసి సభ్యులుగా పార్టీ నిర్ణయించిందని, కానీ అప్పటి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్ రావు తనను బిఎసి సమావేశానికి రానివ్వలేదని గుర్తు చేశారు. శాసనసభ సమావేశాలు పొడిగింపు తన చేతిలో లేదని, ఈ విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని వివరణ ఇచ్చారు.

ఎంఎల్‌ఎల చేరిక విషయం జగ్గారెడ్డినే అడగండి
బిఆర్‌ఎస్‌కు చెందిన 20 మంది ఎంఎల్‌ఎలు కాంగ్రెస్‌లోకి వస్తారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అంటున్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు సిఎం స్పందిస్తూ ఆ విషయం జగ్గారెడ్డినే అడగాలని సూచించారు.తనను కలిసిన బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలను ఆ పార్టీ అగ్రనేతలు అవమానిస్తున్నారని సిఎం అన్నారు. ఇతర పార్టీ ఎంఎల్‌ఎలు తమ పార్టీలోకి వచ్చే అంశం తన దృష్టిలో లేదని, ఎవరైనా వచ్చేందుకు రెడీగా ఉంటే.. వారి విషయంలో తమ పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. తమ పాలన నచ్చి ప్రతిపక్ష ఎంఎల్‌ఎలు ముందుకు వస్తే తమ పార్టీలో చర్చించి కలుపుకుని పోతామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News