Friday, January 10, 2025

సంక్రాంతికి భరోసా

- Advertisement -
- Advertisement -

 అసెంబ్లీ సమావేశాల్లో రైతుభరోసా
విధివిధానాలపై చర్చ రుణమాఫీ
తరహాలోనే అన్నదాతల ఖాతాల్లో
పెట్టుబడి జమ తక్కువ సమయంలో
రూ.21వేల కోట్ల రుణమాఫీ
దేశంలోనే రికార్డు బిఆర్‌ఎస్
చేసిన అప్పులకు ప్రతి నెల
రూ. 6500 కోట్ల వడ్డీ చెల్లిస్తున్నాం
రైతులు సన్న వడ్లే పండించండి..
వాటినే బియ్యంగా మార్చి
రేషన్ కార్డుదారులకు అందిస్తాం
సన్న వడ్లకు రూ.500 బోనస్
నిరంతర ప్రక్రియ కిషన్‌రెడ్డికి
తెలంగాణ గురించి మాట్లాడే అర్హతే
లేదు ప్రధాని మోడీ హామీలు..
మా హామీలపై చర్చకు సిద్ధమా?
రైతు పండుగ సభను విజయవంతం
చేసిన కర్షక లోకానికి కృతజ్ఞతలు
మీడియా సమావేశంలో
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

సంక్రాంతి పండుగ తరువాత రైతుల ఖాతాల్లో రైతుభరోసా జమ చేస్తాం. ఇందిరమ్మ రాజ్యంలో సోనియమ్మ గ్యారెంటీ అమలై తీరుతుంది. బిఆర్‌ఎస్, బిజెపిరూపంలోని మారీచుల మాటలు రైతులు నమ్మొద్దు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం భారీగా చేసిన అప్పును చూసి అధైర్యపడకుండా పాలన సాగిస్తున్నాం.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రైతులకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి శుభవార్త చెప్పారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా సొమ్ము జమ చేస్తామని సిఎం ప్రకటించారు. రైతు భరోసాపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ వేశామని చెప్పారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలలో రైతు భరోసాకు సంబంధించిన విధి విధానాలపై చర్చించి, సంక్రాంతి పండగకి రైతు భరోసా అమలు చేస్తామని గ్యారంటీ ఇస్తున్నానని వెల్లడించారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా వేస్తామని ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మంత్రులు దామోదరం రాజనరసింహ, పొంగులేని శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావు, సిఎం సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, ఎంఎల్‌ఎలు దానం నాగేందర్, కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, మందుల సామేలు, శ్రీగణేష్, యెన్నం శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, ఇందిరమ్మ రాజ్యంలో సోనియమ్మ గ్యారెంటీ అమలు అయి తీరుతుందని స్పష్టం చేశారు. ఎలాంటి మారిషులు వచ్చి అబద్దాలు చెప్పినా రైతులు నమ్మొద్దని, సోనియా గ్యారంటీగా నేను చెపుతున్నా సంక్రాంతి తర్వాత రైతు భరోసా పడుతుందని ప్రకటించారు. రూ.2 లక్షల రైతు రుణమాఫీ ఎలా పూర్తి చేశామో.. రైతు భరోసా కూడా అదేవిధంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. 25 రోజుల్లో 22,22,067 మంది రైతులకు 17,869 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని తెలిపారు. మహబూబ్‌నగర్‌లో 2,747 కోట్ల రూపాయల రుణమాఫీని నాలుగో విడతగా చేశామని, మొత్తంగా 25,35,964 మంది రైతులకు 20,616 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని వెల్లడించారు.

2018 నుంచి 2023 వరకు ఐదేళ్లలో తీసుకున్న రుణాలన్నీ ఏకకాలంలో తీర్చినట్లు వివరించారు. బిఆర్‌ఎస్ హయాంలో రెండు సార్లు కూడా లక్ష రూపాయల రుణమాఫీ సరిగా చేయలేదని విమర్శించారు. ఏక మొత్తంలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి నాలుగు విడతల్లో చేశారని చెప్పారు. ఎన్నికల సమయంలో ఔటర్ రింగ్ రోడ్డును అమ్మి రూ.11 వేల కోట్ల రుణమాఫీ మాత్రమే చేశారని, నాలుగున్నరేళ్లు రుణమాఫీ చేయకపోవడం వల్ల వడ్డీ కింద రైతులు రూ.8578.97 వేల కోట్ల చెల్లించాల్సి వచ్చిందని అన్నారు. బిఆర్‌ఎస్ రెండోసారి చేసిన రుణమాఫీ కేవలం రూ.3,331 కోట్ల మాత్రమే అని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ ఎలాంటిదో రైతులకు తెలుసు అని విమర్శించారు. కాంగ్రెస్ రుణమాఫీతో రైతులు ఆనందంగా ఉన్నారని చెప్పారు.

దేశంలోనే ఇది గొప్ప రికార్డు

స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు 29 రాష్ట్రాల్లో ఎక్కడా ఇంత తక్కువ సమయంలో రూ.20,616 కోట్ల రుణమాఫీ చేయలేదని, దేశంలోనే ఇది గొప్ప రికార్డు అని సిఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ చేశామని చెప్పారు. ఖాతాల్లో పొరపాట్ల వల్ల ఆగిపోయిన వారికి శనివారం రుణమాఫీ చేశామని తెలిపారు. ఏమైనా మానవ తప్పిదాలతో జరగకపోతే మళ్లీ సరిదిద్దుతామని పేర్కొన్నారు. ఖాతాల్లో తప్పులు సరిదిద్దుకుని అధికారులకు చెప్తే రుణమాఫీ పూర్తవుతుందని వెల్లడించారు. రేషన్‌కార్డు లేని వారికి కూడా రుణమాఫీ చేశామని అన్నారు. రుణమాఫీకి రేషన్ కార్డుకు సంబంధం లేదని స్పష్టం చేశారు. మొదట్లో బ్యాంకు అధికారులు రుణమాఫీపై సరైన సమాచారం ఇవ్వలేదని, బ్యాంకుల్లోని మొత్తం పాతబకాయిలు కలిపి రూ.33 వేల కోట్లుగా లెక్క చెప్పారని,తప్పుడు సమాచారం ఇస్తే శిక్షలు తప్పవని చెప్పడంతో బ్యాంకులు వివరాలు సరిచేసి ఇచ్చాయని తెలిపారు. తర్వాత కటాఫ్ తేదీ ప్రకారం రైతుల రుణాలను గుర్తించి మొత్తం రుణమాఫీ చేశామని తెలిపారు.

రూ.7 లక్షల అప్పులతో కెసిఆర్ మాకు రాష్ట్రాన్ని అప్పగించారు

తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ ప్రభుత్వం అప్పుల్లో ముంచిందని సిఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెంత్తారు. రూ. 16 వేల కోట్ల మిగులుతో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్‌కు అందిస్తే, పదేళ్ల తర్వాత రూ.7 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని తమకు అప్పగించారని సిఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం ఇంత అప్పుల్లో ఉందని కెసిఆర్, హరీష్‌రావు సహా గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్, అధికారులు ఎవరూ చెప్పలేదని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్ర ఆస్తులు -అప్పులపై శ్వేతపత్రం విడుదల చేశామని అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై ప్రతి నెలా రూ.6,500 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నామని చెప్పారు. భారీగా ఉన్న అప్పు చూసి కూడా అధైర్యపడకుండా పాలన సాగిస్తున్నామని అన్నారు.వాస్తవాల ప్రాతిపదికన తమ ప్రభుత్వం భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటోందని తెలిపారు. కెసిఆర్ బకాయి పెట్టిన రూ.7,625 కోట్ల రైతుబంధు నిధులు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లించామని వెల్లడించారు. 2023 వానాకాలంలో రైతు బంధును కెసిఆర్ ప్రభుత్వం ఎందుకు వేయలేదని ప్రశ్నించారు.

రైతులను రాజు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుంది

రైతులను రాజు చేయాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తుందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. నెహ్రూ నుంచి వైఎస్‌ఆర్ సహా నేటి వరకు రైతులే తమ ప్రధాన ఎజెండా అని, రైతులకు తొలిప్రాధాన్యం ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీనే అని పేర్కొన్నారు. రుణమాఫీ విషయంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులను పదేళ్లపాటు మోసం చేసిందని రేవంత్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలాదిగజారిందో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. మిగతా 9 ఏళ్లు కూడా అన్ని కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహిస్తామనే నమ్మకం కలిగిందనిధీమా వ్యక్తం చేశారు.

బిఆర్‌ఎస్, బిజెపి రూపంలో వచ్చే మారీచులను రైతులు నమ్మొద్దు

రైతులు సన్న వడ్లు పండించాలని సిఎం రేవంత్‌రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. రేషన్ కార్డులపై సన్న బియ్యం ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. సన్నాలకు రూ. 500 బోనస్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్, బిజెపి రూపంలో వచ్చే మారీచులను రైతులు నమ్మొద్దని కోరారు. విశ్వామిత్రుడు యాగం చేస్తుంటే మారీచులు వచ్చి యాగాన్ని భగ్నం చేసేందుకు ప్రత్నించేవారని, అదేవిధంగా రైతులను గందరగోళానికి గురి చేసే విధంగా మాట్లాడే ప్రతిపక్షాల మాటలను నమ్మొదని అన్నారు. ఇచ్చిన గ్యారెంటీలను అధైర్యపడకుండా అమలు చేస్తామని వెల్లడించారు. బిపిటి, హెచ్‌ఎంటీ, తెలంగాణ సోనా వేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సోనా,బిటిపి,హెచ్‌ఎంటి లాంటి వంగడాలు వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుందని, తెలంగాణ ప్రజలు ఎక్కువగా తినే బియ్యం కూడా ఇవే అని పేర్కొన్నారు.

తెలంగాణ భూముల్లో పండే ధాన్యాన్నేపేదలకు రేషన్ దుకాణాల్లో ఇవ్వాలని అనుకుంటున్నామని అన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో సన్నబియ్యంతోనే భోజనం వడ్డించేలా ఆదేశాలు ఇచ్చామని, సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు సన్న బియ్యంతో భోజనం పెడతామని చెప్పారు. తమ ప్రభుత్వం రైతుల కోసం పని చేస్తుందని, రాజకీయాలకు అతీతంగా రైతులకు దగ్గరగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. సన్న వడ్లకు 500 రూపాయల బోనస్‌పై కొందరు అపోహలు సృష్టించారని మండిపడ్డారు. వచ్చే సీజన్ కూడా 500 రూపాయల బోనస్ కొనసాగుతుందని తెలిపారు. వరి కొనుగోలు కేంద్రాలను మూసి వేస్తామని, వరి వేసుకుంటే ఉరేనని గతంలో కెసిఆర్ అన్నారని గుర్తు చేశారు. తయ ప్రభుత్వం మాత్రం సన్న వడ్లు పండించండి.. బోనస్ ఇస్తామని చెపుతోందని పేర్కొన్నారు. ఇప్పటివరకు 31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తమ ప్రభుత్వం సేకరించిందని వెల్లడించారు.

మోదీ ఇచ్చిన హామీలపై, మేము ఇచ్చిన హామీలపై చర్చకు సిద్ధం

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గుజరాత్ గులాము అని సిఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. కిషన్ రెడ్డికి తెలంగాణతో ఏం సంబంధం..? అని అడిగారు. ఆయనకు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలపై, తాము ఇచ్చిన హామీలపై చర్చకు సిద్ధమని సిఎం రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. చర్చకు ఎక్కడికి రావాలో చెబితే తమ మంత్రులు వస్తారని చెప్పారు. గుజరాత్‌లో మధ్య నిషేధం ఉందని బిజెపి చెబుతోందని, కావాలంటే అక్కడ ఏ బ్రాండ్‌లు దొరుకుతాయే తీసుకెళ్లి చూపిస్తానని పేర్కొన్నారు.

రైతు పండుగ సభను విజయవంతం చేసిన రైతాంగానికి కృతజ్ఞతలు

పాలమూరులో జరిగిన రైతు పండుగలో వేలాది మంది రైతులు పాల్గొని ఆశ్వీరాదం ఇచ్చారని, రైతుల ఆశ్వీరాదం ప్రభుత్వానికి గొప్ప శక్తిని ఇచ్చిందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 568 రైతు వేదికల నుంచి లక్షలాది మంది రైతులు రైతు పండుగలో పాల్గొన్నారని అన్నారు. రైతు పండుగ సభను విజయవంతంగా చేసిన రైతాంగానికి సిఎం కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News