Monday, March 24, 2025

నెలాఖరులోగా ఐదెకరాల వరకు రైతు భరోసా

- Advertisement -
- Advertisement -

అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి
తుమ్మల రూ.2లక్షలకు మించి
ఉన్న రుణాలను మాఫీ చేయలేదని
నిరసిస్తూ బిఆర్‌ఎస్ నేతల వాకౌట్
అసెంబ్లీ సాక్షిగా రుణమాఫీపై
చేతులెత్తేసిన సర్కార్ : హరీశ్

మన తెలంగాణ/హైదరాబాద్: ఐదెకరాల వరకు రైతు భరోసాను ఈ నెలాఖరులోగా వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తు మ్మల నాగేశ్వరరావు శాసనసభలో శనివారం రాత్రి ప్రకటించారు. ఇప్పటివరకు మూడెకరాల వరకు రైతు భరోసా రైతుల ఖాతాలో జమ చేయ గా మూడు నుంచి ఐదెకరాల మధ్య భూమి కలిగిన వారికి నెలాఖరులోగా రై తుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి వివరించారు. అయితే ఈ సందర్భంగా ప్రభుత్వ గతంలో ప్రకటించిన విధంగా రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ ఇప్పటికే చేశామని పేర్కొన్నారు. ఆ పైన ఉన్నవాటికి చేయడం లేదని, అది తమ హామీ కాదని మంత్రి స్పష్టం చేశారు.

ఇప్పటివరకు రూ. 2 లక్షలలోపు రుణం ఉన్న 25 లక్షల రైతుల కుటుంబాలకు రూ.20,616 కోట్లు జమ చేశామన్నారు. రుణమాఫీపై మంత్రి చేసిన ప్రకటనను తప్పుపడుతూ బిఆర్‌ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకు ముందు మంత్రి ప్రకటనతో బిఆర్‌ఎస్ సభ్యుడు హరీశ్‌రావు మాట్లాడుతూ రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ.2లక్షలు ఉన్న రుణానికి ఆ పైనున్న వడ్డీని చెల్లించే రైతులకు ఈ పథకాన్ని వర్తిస్తామని ప్రక టించారని మరి వారి సంగతేంటి? అని హరీశ్‌రావు నిలదీశారు. తాము ఎన్నికల్లో హామీ ఇచ్చింది రెండు లక్షల రుణానికి మాత్రమే మాఫీ చేస్తా మని చెప్పామని, దానికి కట్టుబడే చేశామన్నారు. ఆ పైనున్న వాటికి చేయడం మా హామీ కాదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

అసెంబ్లీ సాక్షిగా రుణమాఫీపై చేతులెత్తేసిన సర్కార్: హరీశ్ రావు

వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటనతో రుణమాఫీ కథ ముగించే కుట్ర చేస్తున్నారని స్పష్టమవుతున్నదని హరీశ్‌రావు విమర్శించారు. రెండు లక్షల పైన రుణం ఉండి మాఫీ కాని రైతుల పరిస్థితి ఏమిటని, నమ్మి ఓటేసిన పాపానికి నయవంచన చేసింది కాంగ్రెస్ సర్కారని ధ్వజమెత్తారు. మంత్రి ప్రకటనకు, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి ఎలాంటి పొంతన లేదని, ఇలాంటి అసంబద్ధ ప్రకటన పట్ల సిఎం రేవంత్ రెడ్డి యావత్ తెలంగాణ రైతులకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులందరికీ రుణమాఫీ చేసి తీరాలని డిమాండ్ చేశారు.

రైతులను దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి ని ప్రజాక్షేత్రంలో బిఆర్‌ఎస్ నిలదీస్తూనే ఉంటుంది. అడుగడుగునా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూనే ఉంటుంది. రుణమాఫీ హామీ అమలును ప్రణాళిక ప్రకారం అటకెక్కించే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఇలా ఉండగా, సభలో శనివారం పశుసంవర్థక, మత్సపరిశ్రమ, కార్మిక మరియు ఉపాధి కల్పన, వ్యవసాయ, మార్కెటింగ్, సహకారం, చేనేత, విద్యా వైద్య, కుటుంబసంక్షేమం, రవాణా, బిసి సంక్షేమం తదితర శాఖలకు చెందిన పద్దులకు సభ ఆమోదం తెలిపింది. అనంతరం సభనను సోమవారం ఉదయం 10 గంటలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వాయిదా వేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News