రాష్ట్రంలో రైతాంగానికి మూడు ఎకరాల వరకు రైతు భరోసా నిధులను బుధవారం ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 9,56,422 మంది రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.1,230.98 కోట్లు విడుదల అయ్యాయి. అంతే కాకుండా రెండు ఎకరాలలోపు ఉన్న రైతుల రికార్డులను అప్‌డేట్ చేసి మరో 56,898 మంది రైతుల ఖాతాలలో రూ.38.34 కోట్లు జమచేసింది. దీంతో మొత్తంగా మూడు విడుతలు కలిపి 44,82,265 మంది రైతులకు ఉన్న దాదాపు 58.13 లక్షల ఎకరాలకు సంబంధించి రూ.3487.82 కోటు వారివారి బ్యాంకుల ఖాతాలకు ప్రభుత్వం అందజేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా జనవరి 26వ తేదీన రైతు బరోసాను ప్రారంభించి మొదటి విడతలో ఒక ఎకరం వరకు ఉన్న 17.03 లక్షల మంది రైతులకు సంబంధించిన
9.29 లక్షల సాగుభూములకు రూ.557.54 కోట్లు ఇచ్చింది. రెండో విడతలో 13.23 లక్షల మంది రైతులకు ఉన్నటువంటి 18.19 లక్షల ఎకరాలకు రూ.1,091.95 కోట్లు, మూడో విడతలో 10.13 లక్షల మంది రైతులకు ఉన్న 21.12 లక్షల ఎకరాల భూములకు రూ.1,269.32 కోట్లు నిధులు వారివారి ఖాతాల్లో జమ చేసింది. ఇప్పటి వరకు రైతు బరోసా కింద కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం విడుదల చేసిన నిధులను రైతన్నలు వారి వ్యవసాయ పెట్టబడుల అవసరాలను వినియోగించుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. మిగతా వారందరికి త్వరలోనే రైతు బరోసా నిధులు అందిస్తామని వెల్లడించారు.