Monday, January 20, 2025

రాష్ట్రమంతటా ఇక క్రియాశీలకం కానున్న 2061 రైతువేదికలు

- Advertisement -
- Advertisement -

వ్యవసాయ అనుబంధ రంగాల సేవలు అక్కడినుంచే
గ్రామీణ కీలక శాఖల అధికారులతో సమన్వయం
విస్తరణ అధికారులకు టైంటేబుల్ ఖరారు
ప్రతిరోజు సాయంత్రం 25గంటలు అక్కడే
అవగాహన సదస్సులతో రైతుచైతన్య కార్యక్రమాలు
536 మండలాల్లో యాంత్రీకరణ కేంద్రాలు

Rythu vedika scheme

మనతెలంగాణ/హైదరాబాద్:  వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న సిఎం కేసిఆర్ సర్కారు ఎంతో దూరదృష్టితో నిర్మించిన రైతువేదికలు ఇక రాష్ట్రమంతటా ఈ వానాకాలం పంటల సీజన్ నుంచే క్రియాశీలకం కాబోతున్నాయి. ప్రభుత్వం అందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేసి అన్ని జిల్లాలకు అందజేసింది. వ్యవసాయంతోపాటు , ఉద్యాన, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ తదతర వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన కార్యక్రమాలన్నింటికీ రైతువేదికలు అత్యంత కీలకం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రూ.573కోట్ల వ్యయంతో ఈ వేదికలను నిర్మించింది. ఒక్కో రైతు వేదిక నిర్మాణానికి ప్రభుత్వం రూ.22లక్షలు ఖర్చు చేసి 2వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో వీటి నిర్మాణాలు పూర్తి చేసింది. ముఖ్యమంత్రి కేసిఆర్ 2019లో వీటికి శంకుస్థాపన చేసి యుద్ద ప్రాతిపదికన వీటిని పూర్తి చేయించారు.

ఈ వానాకాలపు పంటల సాగు సీజన్ నుంచి రాష్ట్రమంతటా 2061 రైతు వేదికలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో కోటి 50లక్షల ఎకరాల సాగుభూమిలో వివిధ రకాల పంటల సాగుకు అనువుగా రైతువేదికల ద్వారా ప్రభుత్వం దిశానిర్దేశం చేయనుంది. తెలంగాణ రాష్ట్ర భౌగొళిక పరిస్థితులు , వాతావరణం, వర్షపాతం , నేలల స్వభావం ఆధారంగా ప్రభుత్వం రాష్ట్రాన్ని మూడు జోన్లకింద ఉత్తర తెలంగాణ, మధ్యతెలంగాణ, దక్షిణ తెలంగాణ ప్రాంతాలుగా విభజించింది. తెలంగాణ రాష్ట్ర వార్షిక సాధారణ వర్షపాతం 905.3 మి.మి కాగా , ఆయా జోన్ల పరిస్థితులను బట్టి వర్షాపాతంలో వస్తున్న మార్పులకు తగ్గట్టుగా, గరిష్టంగా 29నుండి 34డిగ్రీలు , కనిష్టంగా 13నుండి 27డిగ్రీలు ఉష్ణోగ్రతలు దృష్టిలో ఉంచుకుని పంటల సాగు ప్రణాళికలను వ్యవసాయశాఖ సిద్దం చేస్తోంది. ప్రధానంగా రాష్టంలో ఉన్న ఎర్రగరప నేలలు , ఇసుక నేలలు, బంకమన్నుతో కూడిన సారవంతమైన నేలలు , నల్లరేగడి నేలలను గుర్తించి గ్రామాల వారీగా సాగు ప్రణాళికలను రూపొందిస్తోంది.

వ్యవసాయం ద్వారా రాష్ట్రంలో రైతులకు లాభాలను అందించటమే లక్షంగా ప్రభుత్వం ఈ ప్రణాళికలను సిద్దం చేయిస్తోంది. రాష్ట్రంలో ఈ వానాకాలానికి సంబంధించి కోటి 42లక్షల ఎకకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రాధమికంగా నిర్ణయం తీసుకుంది. అందులో ప్రధాన పంటలుగా పత్తిసాగు 75లక్షల ఎకరాలు , వరి సాగు 50లక్షల ఎకరాలు, కంది 15లక్షల ఎకరాల్లో సాగు చేయించాలని లక్షంగా పెట్టుకుంది. ఈ లక్ష సాధనకు క్షేత్ర స్థాయిలో రైతువేదికలనే కీలకంగా వేదికలుగా ఎంచుకుంది. గ్రామ స్థాయిలో నేలల స్వభావం , నీటి వసతులు ఆధారంగా చేసుకుని ప్రభుత్వ సాగు లక్ష్యాలకు అనుగుణంగా రైతులను ఒప్పించి గ్రామ స్థాయి ,మండల స్థాయి , జిల్లా స్థాయి , రాష్ట్ర స్థాయి సాగు ప్రణాళికలను రూపొందిస్తున్నారు.

Rythu vedika scheme
శాఖల సమన్వయంతో వేదికలకు కొత్త రూపు:
గ్రామీణ జీవన విధానంతో ముడిపడ్డ వ్యవసాయరంగంలో ప్రభుత్వం ఎంచుకున్న లక్ష్యాల సాధనకు ఆయా శాఖల అధికారుల సమన్వయం అత్యంత కీలకం కానుంది. పంటల సాగులో వ్యవసాయశాఖతోపాటు ఉద్యాన శాఖ, పశుసంవదర్దక, మత్స, పట్టు పరిశ్రమ శాఖలు , నీటి పారుదల శాఖ, విద్యుత్ శాఖ , మార్కెటింగ్ తదితర శాఖలకు చెందిన అధికారులను సమన్వయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ శాఖలకు చెందిన క్షేత్ర స్థాయి అధికారులు రైతువేదికలను కేంద్ర బింధువుగా చేసుకుని తరుచూ రైతులతో సమావేశం అయ్యేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. రైతుల పొలాల్లో భూసార పరీక్షల ప్రాధాన్యత పట్ల రైతుల్లో అవగాహన పెంచనుంది. పంటసాగుకు అనుగుణంగా నేల తయారీ మొదలుకుని నేల స్వభావం , నీటివనరుల లభ్యతకు తగ్గట్టుగా పంటలను ఎంపిక చేసుకునేవిధంగా రైతులను సిద్దం చేయనున్నారు. కల్తీ ,నాశిరకం విత్తనాలు , ఎరువుల గుర్తింపు, నాణ్యమైన అధికోత్పత్తులను ఇచ్చే విత్తనం ఎంపిక మొదలుకొని , నేలలో సేంద్రీయ ఎరువులు ద్వారా భూసారం పెంపుదల వరకూ రైతుల్లో అవగాహన కల్పించనున్నారు. పంటలకు నీటితడులను ఎప్పుడు, ఎన్ని ఎలా అందించాలి, చీడ నివారణకు సంబంధించిన సస్యరక్షణ చర్యలు తదితర అంశాలను పక్కా ప్రణాళికబద్డంగా అమలు చేయించనున్నారు. ప్రధాన పంటలో అంతర పంటల సాగు ఎంపిక , వరికి బదులు ప్రత్యామ్నాయ లాభసాటి పంటలు ,వాటి రకాలు ,పంట దిగుబడి , మార్కెట్‌లో పంట విక్రయానికి సంభందించిన డిమాండ్ , ప్రభుత్వం అమలు చేస్తున్న కనీస మద్దతు ధరలు తదితర వాటిని రైతు వేదికల ద్వారానే అవగాహన కల్పిచనున్నారు. ఇందుకోసం వ్యవసాయ విస్తరణ అధికారికి చెందిన క్లస్టర్ పరిధిలోని రైతులతో సదస్సులు , సమావేశాలు , చర్చాగోష్టి కార్యక్రమాలను అమలు చేయించనున్నారు.

Rythu vedika scheme
వేదికలకు టైంటేబుల్ ఖరారు :
క్షేత్ర స్థాయిలో వ్యవసాయ అనుబంధ శాఖలకు చెందిన అధికారులు రైతులకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం నిర్దుష్ట సమయపాలనతో కూడిన టైంటేల్‌ను ఖరారు చేసింది. వ్యవసాయ విస్తరణ అధికారి ప్రతిరోజు రైతులకు అందుబాటులో ఉండాలని అదేశాలు జారీ చేసింది. తాను విధులు నిర్వహించే క్లస్టర్ పరిధిలోని రైతు వేదిక కార్యాలయంలో ప్రతిరోజు మధ్యాహ్నం 2గంటల నుండి సాయంత్రం 5గంటల వరకూ రైతులకు అందుబాటులో ఉండాలని ఆదేశాలిచ్చింది. ఏ క్లస్టర్‌లో అయినా ఎఈఓ పోస్టు ఖాళీగా ఉంటే అక్కడ తక్షణం ఖాళీలు బర్తీ చేయాలని , అవసరమైతే తాత్కాలిక ప్రాతిపదికన విఈవో పోస్టును భర్తీ చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది.
గ్రామీణ మండలాలో కష్టమ్ హైరింగ్ సెంటర్లు :
వ్యవసాయరంగంలో యాంత్రీకరణను ప్రొత్సహిస్తూ ప్రభుత్వం రాష్ట్రలోని 536గ్రామీణ మండలాల్లో కస్టమ్స్ హైరింగ్ సెంటర్లు( సిహెచ్‌సి) ఏర్పాటు చేస్తోంది. యంత్రాలను తక్కువ ధరకే రైతులకు అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకురానుంది. రాష్ట్రంలో మొత్తం 60.95లక్షల మంది రైతులు ఉండగా అందులో అత్యధిక శాతం సన్న చిన్నకారు రైతులే ఉన్నారు. ఇందులో 3ఎకరాల్లోపు పొలం ఉన్న రైతులు 44.22లక్షల మంది ఉండగా, 3నుంచి5ఎకరాల్లోపు రైతులు 11.08లక్షల మంది ఉన్నారు. 5నుంచి10 ఎకరాల్లోపు రైతులు 4.65లక్షల మంది ఉన్నారు. సన్న చిన్న కారు రైతులకు యంత్రాల అవసరాలను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం సిహెచ్‌సిలను ఏర్పాటు చేస్తోంది. మహిళా సంఘాలకు వీటి నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తోంది. ఒక్కొ సెంటర్‌కు గరిష్టంగా రూ.30లక్షల విలువైన యంత్రాలను ప్రభుత్వం సమకూరుస్తోంది. ఇందులో 25శాతం సబ్సిడి ఇచ్చి మిగిలిన మొత్తాన్ని స్త్రీనిధి బ్యాంకుల ద్వారా రుణంగా సమకూర్చుతోంది. రైతు వేదికలను సిహెచ్‌సిలకు అనుసంధానం చేయనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News