తొలిరోజు 642కోట్లు ఖాతాలకు జమ
వ్యవసాయ కుటుంబాల్లో పండుగ వాతావరణం
శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్: తెల్లారగానే సెల్‌పోన్లలో గంట గణగణ మోగింది. రైతు బంధు పథకం కింద బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ అయినట్టు రైతులకు సమాచారం చేరిపోయింది. వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్న లక్షలాది మంది రైతుల ముఖాల్లో చిరునవ్వులు విరబూశాయి.వ్యవసాయ కుటుంబాల్లో పండుగ వాతావరణం పుట్టుకొచ్చింది. రైతులు తమ కుటుంబసభ్యులతో పాటు సంబరాల్లో మునిగిపోయాయి. ముఖ్యమంత్రి కేసిఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ గ్రామాల్లో సిఎం చిత్ర పటాలకు క్షీరాభిషేకాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి రైతుబంధు పధకం ద్వారా రైతుల ఖాతాలకు నిధుల జమకు శ్రీకారం చుట్టింది. తొలిరోజు రూ.645.52కోట్లు జమ చేసింది. ఈ నిధులన్ని క్షణాల్లో రాష్ట్రంలోని 22,55,081మంది రైతుల బ్యాంకు ఖాతాలకు చేరిపోయాయి. తొలిరోజు గుటం విస్తీర్ణం నుంచి ఎకరం విస్తీర్ణం వరకూ భూములు ఉన్న రైతుల ఖాతాలకు నిధులు పంపిణీ చేసింది.
రాష్ట్రంలో 202324ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం 11వ విడుత రైతుబంధు పధకం నిధులు విడుదల చేసింది. వానాకాలపు సీజన్‌కు సబంధించి మొత్తం 70లక్షల మంది రైతులకు నిధులు అందనున్నాయి. ఈ నెల 26నుంచి రైతు బంధు నిధులు పంపిణీ చేయనున్నట్టు ముఖ్యమంత్రి కేసిఆర్ చేసిన ప్రకటన మేరకు రాష్ట్ర ఆర్ధిక వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు , ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్టారావు గత వారం రోజుల నుంచే నిధుల సమీకరణపై ప్రత్యేక శ్రద్ద చూపుతూ వచ్చారు. సిఎం నిర్ణయం మేరకు సోమవారం రైతుల ఖాతాలకు నిధులు జమ అయ్యేలా చర్యలు చేపట్టి రైతుబంధు నిధుల పంపిణీ అమలుకు మార్గం సుగమమం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పధకం అమలకు ఈ సీజన్‌లో మొత్తం రూ.7720.29కోట్లు విడుదల చేసింది. ఎకరం విస్తీర్ణంతో మైదలు పెట్టిన నిధుల జమను రోజు వారీగా ఎకరం చొప్పున పెంచుకుంటూ రానున్నారు. ఎకరానికి రూ.5వేలు చొప్పున ఈ పధకం ద్వారా రైతులకు నిధులు అందనున్నాయి.
ఈ సీజన్‌లో కోటి 54లక్షల ఎకరాలకు ఈ పధకాన్ని వర్తింప చేయనున్నారు.తద్వారా వానాకాల పంటల సాగుకు సంబంధించి పెట్టుబడి సాయంగా రాష్ట్రంలోని 70లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర నుంది. గత యాసంగి సీజన్‌తో పోల్చితే ఈ సారి ఈ పథకం కింద 5లక్షల మంది కొత్త రైతులు రైతుబంధు సాయాన్ని అందుకోబోతున్నారు. కొత్త రైతుల చేరికతో రా్రష్ట్ర ప్రభుత్వ ఖజానాపైన సుమారు రూ.300కోట్లు మేరకు అదనపు భారం పడనుంది. 11వ సీజన్ రైతుబంధు నిధులతో కలిపి ఇప్పటివరకూ ఈ పథకం ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలకు మొత్తం రూ.72,910కోట్లు జమ కానుంది. ముఖ్యమంత్రి కేసిఆర్ నిర్ణయం మేరకు రా్రష్ట్రంలో పోడు రైతులకు కూడా ఈ సారి రైతుబంధు పధకం అమలు కానుంది. రాష్ట్రంలో నాలుగు లక్షల ఎకరాల పోడు భూములకు సంబంధించిన సుమారు 1.5లక్షల మంది పోడు రైతులకు తొలిసారి రైతుబంధు పధకం ద్వారా లబ్ధి చేకూరనుంది.
రైతుబంధు పండుగ మొదలైంది:మంత్రి హరీశ్
రాష్ట్రమంతటా రైతుబందు పండుగ మొదలైందని రాష్ట్ర అర్ధిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్ రావు అన్నారు. రైతుబందు పథకం 11వ విడుత నిధుల జమ ప్రారంభం సందర్భంగా మంత్రి హరీశ్ రావు రైతుకుటుంబాలకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఒక్క రోజే రైతుల ఖాతాలకు రూ.645.52కోట్లు జమ చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో రైతుల అభ్యున్నతి , వ్యవసాయ కుంటుబాల శ్రేయస్సే ముఖ్యమంత్రి కేసిఆర్ లక్షం అని పేర్కొన్నారు.
సిఎంకు ధన్యవాదాలు :మంత్రి నిరంజన్‌రెడ్డి
ఇచ్చిన మాట మేరకు రైతుబంధు పధకానికి నిధులు సమకూర్చిన ముఖ్యమంత్రి కేసిఆర్‌కు, ఆర్దికశాఖ మంత్ర హరీశ్ రావుకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. పొలం విస్తీర్ణం ఆధారంగా రోజుకు ఎకరం చొప్పున పెంచుకుంటూ ప్రతిరోజు రైతుల ఖాతాలకు ప్రభుత్వం నిధులు జమ చేస్తుందని తెలిపారు. రైతులు వ్యవసాయశాఖ ద్వారా అందుతున్న సూచనలు సలహాలు పాటించాలని మంత్రి నిరంజన్‌రెడ్డి రైతులకు విజ్ణప్తి చేశారు.