Monday, December 23, 2024

రైతు బంధువులు అదనంగా 5 లక్షలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు రైతుబంధు నిధులు అందనున్నాయి. నేటి నుండి రైతుల ఖాతాలో ఈ నిధులు జమకానున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు . కొత్తగా 5 లక్షల మంది రైతులు లబ్దిపొందనున్నారని, మొదటిసారిగా లక్షా 50 వేల మంది పోడు రైతులకు చెందిన సుమారు 4 లక్షల ఎకరాలకు రైతుబంధు నిధులు అందనున్నాయని ఆయన తెలిపారు. ఈ వానాకాలం సీజన్ లో రైతుల ఖాతాలలో మొత్తం రూ.7720.29 కోట్లు జమకానున్నాయన్నారు. దీంతో గతంలోకన్నా ప్రభుత్వంపై సుమారు రూ.300 కోట్ల అదనపు భారం పడనుందని తెలిపారు. వానాకాలం రైతుబంధు నిధులు విడుదల చేయనున్న నేపథ్యంలో రైతుల తరఫున ఆయన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

11వ విడతతో రైతుల ఖాతాలలో రూ.72,910 కోట్లకు రైతుబంధు నిధులు చేరనున్నాయన్నారు. ఒక కోటి 54 లక్షల ఎకరాలకు సాయం అందనుందని తెలిపారు. 10 వ విడత వరకు రూ.65,190 కోట్లు జమ అయ్యిందని, ఎప్పటి మాదిరిగానే ఎకరాల వారీగా రైతుల ఖాతాల్లోకి నిధులు రానున్నాయన్నారు. ఈ సారి కొత్తగా మొదటిసారి రైతుబంధు సాయం తీసుకోనున్న రైతులు స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను బ్యాంకు అకౌంటు వివరాలతో సంప్రదించాలని సూచించారు. దేశంలో ఏడాదికి రెండు సార్లు ఎకరాకు రూ.10 వేలు సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన పేర్కొన్నారు.

రైతుల పట్ల, వ్యవసాయం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఉన్న ఆప్యాయతకు రైతుబంధు, రైతుభీమా, 24 గంటల ఉచిత కరంటు, సాగునీటి సరఫరా నిదర్శనాలని చెప్పారు. కాళేశ్వరంతో ఒక్క ఎకరా సాగులోకి రాలేదని విషం కక్కిన విపక్షాలు తమిళనాడు, కర్ణాటక, కేరళలు బియ్యం సరఫరా చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి రాసిన లేఖలు చూసి కళ్లు తెరవాలన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, కాళేశ్వరం నిర్మాణం మూలంగా అందుబాటులోకి వచ్చిన సాగునీటితో సాగు పెరిగి అత్యధిక వరిధాన్యం ఉత్పత్తి సాధ్యమయిందని తెలిపారు. బియ్యం సరఫరాపై కేంద్రం చేతులు ఎత్తేస్తే పొరుగు రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని తెలిపారు. తెలంగాణ వ్యవసాయ విధానాలు దేశాన్ని ఆకర్షిస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదం దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోందన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పథకాలను కొనసాగిస్తున్నారని తెలిపారు. ఖర్చు ఎంతయినా సరే రైతు నష్టపోకూడదన్నది ముఖ్యమంత్రి ఆలోచన అని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News