డర్బన్: బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య సౌతాఫ్రికా 220 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 53 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయం చవిచూసింది. సఫారీ స్పిర్నర్ కేశవ్ మహారాజ్ అసాధారణ బౌలింగ్‌తో చెలరేగి పోయాడు. అతని ధాటికి బంగ్లాదేశ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. 11/3 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ ఏ దశలోనూ కోలుకోలేక పోయింది. ఇటు కేశవ్ అటు సిమోన్ హార్మర్ చెలరేగడంతో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 53 పరుగులకే పరిమితమైంది. జట్టులో ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. నజ్ముల్ హుస్సేన్(26) టాప్ స్కోరర్‌గా నిలువగా, తస్కిన్ అహ్మద్(14) పరుగులు చేశాడు. మిగతావారు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. బంగ్లాదేశ్ జట్టులో నలుగురు డకౌట్ కావడం విశేషం. ఇక అద్భుత బౌలింగ్‌ను కనబరిచిన కేశవ్ మహారాజ్ 32 పరుగులు మాత్రమే ఇచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు. హార్మర్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఇక సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 367, రెండో ఇన్నింగ్స్‌లో 204 పరుగులు చేసింది. మరోవైపు బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో 298 పరుగులకు ఆలౌటైంది.
SA Win by 220 runs against BAN in 1st Test