న్యూఢిల్లీ: దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సంస్థ(సార్క్) సెక్రటరీ జనరల్ ఇఆర్ వీరాకూన్ వారం రోజుల పర్యటన(8నుంచి 14వరకు) కోసం ఆదివారం భారత్ చేరుకున్నారు. భారత విదేశాంగశాఖ సహాయమంత్రి రాజ్‌కుమార్‌రంజన్‌సింగ్, కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా, కార్యదర్శి(తూర్పు విభాగం) రివా గంగూలీదాస్‌తో వీరాకూన్ చర్చిస్తారని అధికారవర్గాలు తెలిపాయి. సార్క్ దేశాల మధ్య సహకారం, కరోనా మహమ్మారి వల్ల ఈ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై వీరి మధ్య చర్చలు సాగనున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. సార్క్‌కు 14వ సెక్రటరీ జనరల్ అయిన వీరాకూన్ శ్రీలంకకు చెందిన దౌత్యవేత్త. సార్క్‌లో భారత్,పాకిస్థాన్,బంగ్లాదేశ్,నేపాల్,శ్రీలంక,అఫ్గానిస్థాన్, మాల్దీవులు,భూటాన్ సభ్యదేశాలు. సార్క్ దేశాలు రెండేళ్లకోసారి సమావేశం కావడం ఆనవాయితీ. కాగా, 2014లో చివరిసారి సార్క్ సమావేశాలు కాఠ్మండ్‌లో జరిగాయి. 2016లో పాకిస్థాన్‌లో జరగాల్సి ఉండగా, భారత్ హాజరు కానని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్,భూటాన్,అఫ్గానిస్థాన్‌లు భారత్‌ను అనుసరించాయి. దాంతో, ఆ సమావేశాలు జరగలేదు. 2016 సెప్టెంబర్ 18న ఉరీ సెక్టార్‌లోని భారత ఆర్మీక్యాంప్‌పై జరిగిన ఉగ్రదాడికి నిరసనగా భారత్ ఆ నిర్ణయం తీసుకున్నది.