Sunday, December 22, 2024

మహిళల టెన్నిస్‌పై సబలెంక ముద్ర

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ క్రీడా విభాగం: ప్రపంచ మహిళల టెన్నిస్‌లో సరికొత్త స్టార్‌గా బెలారస్ సంచలనం అరినా సబలెంక అవతరించింది. ఈ ఏడాది సబలెంక రెండు గ్రాండ్‌స్లామ్ ట్రోఫీలను సొంతం చేసుకుని సత్తా చాటింది. సీజన్ ఆరంభ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో సబలెంక ఛాంపియన్‌గా నిలిచింది. తాజాగా ఇటీవల ముగిసిన సీజన్ ఆఖరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లోనూ టైటిల్ దక్కించుకుంది. ఈ ఏడాది రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచి మహిళల టెన్నిస్‌లో తనకు ఎదురులేదని నిరూపించింది. నంబర్‌వన్ ర్యాంక్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్ (పోలండ్) యూఎస్ ఓపెన్‌లో పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచింది. రెండో సీడ్ సబలెంక మాత్రం అంచనాలకు తగినట్టు రాణిస్తూ ఏకంగా ట్రోఫీని ఎగురేసుకుపోయింది. ఆరంభం నుంచే సబలెంక అత్యంత నిలకడైన ఆటను కనబరిచింది.

ప్రత్యర్థుల నుంచి తీవ్ర పోటీ ఎదురైనా తట్టుకుంటూ లక్షం దిశగా అడుగులు వేసింది. ఇదే క్రమంలో ఈ ఏడాది రెండో గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని గెలిచి పెను ప్రకంపనలు సృష్టించింది. ప్రస్తుతం మహిళల టెన్నిస్‌లో సబలెంక అత్యంత నిలకడైన ఆటను కనబరుస్తుందని చెప్పాలి. గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో సబలెంక అద్భుత ఆటతో అలరిస్తోంది. ఇగా స్వియాటెక్‌తో పోల్చితే గ్రాండ్‌స్లామ్ సింగిల్స్‌లో సబలెంక మెరుగ్గా రాణిస్తోంది. దీనికి ఈ ఏడాది ఆమె సాధించిన రెండు గ్రాండ్ ట్రోఫీలే నిదర్శనంగా చెప్పాలి. ఒకప్పుడూ ప్రపంచ టెన్నిస్‌లో నవోమి ఒసాకా (జపాన్), అజరెంకా, వోజ్నియాకి, హలెప్, షరపోవా తదితరుల ఆధిపత్యం కొనసాగేది. కానీ ప్రస్తుతం జెస్సికా పెగులా, కొకొ గాఫ్, ముచోవా, స్వియాటెక్, సబలెంక తదితరులు జోరు కొనసాగిస్తున్నారు. వీరిలో సబలెంక, ఇగా స్వియాటెక్‌లు అత్యంత నిలకడైన ఆటతో వరుస టైటిల్స్‌ను గెలుచుకుంటున్నారు. రానున్న రోజుల్లో మహిళల టెన్నిస్‌లో సబలెంక ఎదురులేని శక్తిగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

అత్యంత ప్రతిభావంతులైన క్రీడాకారిణిల్లో సబలెంక ఒకరని చెప్పక తప్పదు. గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఆమె ఆధిపత్యం చెలాయించే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఎలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకుని ముందుకు సాగే సత్తా ఈ బెలారస్ క్రీడాకారిణిలో ఉంది. దీంతో భవిష్యత్తులో సబలెంక మరిన్ని గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పెగులా, గాఫ్, ముచోవా, ఇగా తదితరుల మధ్య రానున్న రోజుల్లో గట్టి పోటీ నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. పరిస్థితులను గమనిస్తే వీరిలో సబలెంక ఆధిపత్యం చెలాయిస్తుంనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. తన మార్క్ ఆటతో చెలరేగితే సబలెంకను ఆపడం ప్రత్యర్థులకు చాలా కష్టంతో కూడుకున్న అంశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News