కొత్త మార్గాలను అన్వేషిస్తున్న ట్రావెన్‌కోర్ దేవస్థానం
ఫిబ్రవరిలో ప్రత్యేక పథకం ప్రారంభానికి సిద్ధం
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో శబరిమల అయ్యప్ప ఆలయం ఆదాయం 92 శాతం పడిపోయినట్లు ట్రావన్‌కోర్ బోర్డు తెలిపింది. గడిచిన ఏడాది కేవలం రూ. 21.17 లక్షల ఆదాయం మాత్రమే సమకూరడంతో పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ఆలయ బోర్డు సిద్ధమవుతోంది. కరోనా ఎఫెక్ట్ దాదాపు అందరిపై పడిన నేపథ్యంలో శబరిమల అయ్యప్ప ఆలయ ఆదాయం 92 శాతం పడిపోయినట్లుగా తేలింది. 2019,-20 సంవత్సరానికి గాను ఆలయానికి రూ. 269.37 లక్షల ఆదాయం సమకూరిందని, కరోనా నేపథ్యంలో ఈ ఏడాది అనేక నెలల పాటు ఆలయాన్ని మూసేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయాన్ని నిర్వహించే ట్రావెన్‌కోర్ దేవస్థానం ట్రస్ట్ బోర్డు (TDB) ఆధ్వర్యంలో 1,248 ఆలయాలు ఉంటాయి. వీటి నిర్వహణ, ఉద్యోగుల వేతనాలకు బోర్డుకు నెలకు రూ. 40 కోట్లు అవసరపడుతోంది. అయితే ఆదాయం పెంచుకోవడం కోసం బోర్డు కొత్త మార్గాలను అన్వేషిస్తోంది.
ప్రభుత్వం ఇప్పటికే రూ.70 కోట్ల సహాయం అందించిందని, మరింత సాయం కోసం ప్రభుత్వాన్ని అడగనున్నట్లు ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఎన్.వాసు తెలిపారు. ధనికులైన భక్తులను, ప్రభుత్వాన్ని సాయం కోసం ఆశ్రయించడంతో పాటు ఖర్చులను తగ్గించుకోవడం కోసం దాదాపు 200 మంది తాత్కాలిక సిబ్బందిని ఉపసంహరించుకోనున్నట్లు ఆయన తెలిపారు. భక్తులు అందించిన వివిధ కానుకలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తనఖా పెట్టే అంశాన్ని కూడా బోర్డు పరిశీలిస్తున్నాయన్నారు. ఈ మేరకు బంగారం, వెండి నిల్వలను అంచనా వేసే ప్రక్రియ సైతం కొనసాగుతోన్నట్లు బోర్డు చైర్మన్ తెలిపారు. ఖర్చులు తగ్గించి, పూజాయేతర ఆదాయాన్ని పెంచే ప్రణాళికను కూడా త్వరలో ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో పాటు భక్తుల నుంచి సాయం పొందడానికి ఫిబ్రవరిలో ప్రత్యేక పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.