తెగిపోయిన బిఎస్‌ఎన్‌ఎల్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్
పంపా, సన్నిధానం మధ్య అందని సెల్ సిగ్నల్స్
ఇంటర్నెట్ అంతరాయంతో వివిధ కార్యకలాపాలపై ప్రభావం
ఒకచోట అడవి, మరోచోట ఆర్టీసి బస్టాండ్ వద్ద
భారీ వర్షాలకు కుంగిపోయిన భూమి
వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాతే కొండ ఎక్కేందుకు భక్తులకు అనుమతి
ఇబ్బందుల్లో భక్తులు
హైదరాబాద్: శబరిమలలో ఇబ్బందుల మధ్యనే అయ్యప్ప భక్తులు స్వామి దర్శనానికి తరలివెళుతున్నారు. ప్రస్తుతం కేరళలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శబరిమలలో కమ్యూనికేషన్‌కు అంతరాయం ఏర్పడింది. వర్షాలు భారీగా కురుస్తున్న నేపథ్యంలో అక్కడ ప్రారంభించిన నూనంగర్ వంతెన దెబ్బతినగా, కొండ నీటి ప్రవాహానికి వంతెన పైభాగంలో ఉన్న మెటల్ కొట్టుకుపోయిందని ట్రావెన్‌కోర్ సభ్యులు పేర్కొన్నారు. పంబలో ఉన్న కెఎస్‌ఆర్‌టిసి సమీపంలో రోడ్డు కుంగిపోగా, ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు మౌలిక వసతుల్లో ఇబ్బందులు తలెత్తాయని ట్రావెన్‌కోర్ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం పంబానదిలో నీటిమట్టం ఒక్కసారిగా పెరగడంతో యాత్రీకులు కాసేపు కొండపైకి వెళ్లడానికి ఆటంకం కలిగిందని, వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాతే కొండ ఎక్కేందుకు భక్తులకు అనుమతిస్తామని ట్రావెన్‌కోర్ సభ్యులు పేర్కొన్నారు.
పంబ డ్యామ్ షట్టర్లు ఎత్తేశారని వదంతులు
దీంతోపాటు ఒకచోట అడవిలో భూమి కుంగి పోయిందని, పంబ డ్యామ్ షట్టర్లు ఎత్తేశారని వదంతులు రావడంతో యాత్రికులు మరింత ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో స్పష్టమైన సమాధానం లేకపోవడంతో అధికారులు సైతం కంగుతిన్నారు. అంతేకాకుండా బిఎస్‌ఎన్‌ఎల్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ పలుచోట్ల తెగిపోవడంతో పంపా, సన్నిధానం మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఇంటర్నెట్ అంతరాయంతో వివిధ కార్యాలయాల పనితీరుపై తీవ్ర ప్రభావం పడింది. సోమవారం మధ్యాహ్న సమయంలో కేబుల్ మరమ్మతులకు గురయ్యాయని ట్రావెన్‌కోర్ అధికారులు తెలిపారు. వర్షాలు బాగా పడితే శబరిమలలో కనీస సౌకర్యాలు మాత్రమే ఉండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సుమారుగా రూ.9 కోట్లు
ఈ సంవత్సరం అయ్యప్ప యాత్ర ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటివరకు భక్తుల ద్వారా తొమ్మిది కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టు ట్రావెన్ కోర్ బోర్డ్ వెల్లడించింది. శబరిమలకు యాత్రీకుల తాకిడి గతం కంటే తక్కువగా ఉందని, అయినప్పటికీ ఆదాయం బాగానే వస్తుందని బోర్డు తెలిపింది. ఇంకా అయ్యప్ప దర్శనానికి సమయం ఉన్నందున ఈ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో రెండేళ్లుగా ఇతర రాష్ట్రాల నుంచి అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. కానీ, ఈసారి స్వామి భక్తులు ఎక్కువగా వస్తున్నారని దేవస్థానం సభ్యులు తెలిపారు.