శబరిమలలో ఘనంగా మండల పూజ
ముగిసిన తొలిదశ యాత్ర
దేవస్థానానికి రూ.222.98 కోట్ల ఆదాయం
మూడురోజులపాటు ఆలయం మూసివేత
3-0న సాయంత్రం 5గంటలకు రెండోదశలో భాగంగా తెరుచుకోనున్న దేవాలయం
పథనంతిట్ట: ప్రఖ్యాత శబరిమల దేవస్థానంలో మంగళవారం మధ్యాహ్నం మండల పూజ ఘనంగా నిర్వహించారు. స్వామి అయ్యప్ప ఆశీస్సులు కోరుతూ ఈ పూజలో భారీసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వార్షిక యాత్ర సీజన్‌లో భాగంగా 41రోజుల దీక్షను పూర్తిచేసుకున్న అయ్యప్ప భక్తులు అధికసంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈనేపథ్యంలో యాత్ర తొలి దశ పూర్తయిందని అధికారవర్గాలు తెలిపాయి. మంగళవారం నిర్వహించిన మండలపూజను ఆలయ ప్రధాన పూజారి కందరారు రాజీవరు ఆధ్వర్యంలో నిర్వహించారు. సోమవారం సాయంత్రమే సన్నిధానంకు తీసుకువచ్చిన స్వామి ఆభరణాలను ప్రధాన విగ్రహానికి అలంకరించి పూజాకార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కలభాభిషేకం వంటి ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించారు. పూజాసమయంలో పొడవాటి క్యూల్లో అధికసంఖ్యలో బారులుతీరిన భక్తులు స్వామి శరణం అయ్యప్ప నినాదాలతో పుణ్యక్షేత్రం మార్మోగిపోయింది. ట్రావెన్‌కోర్ దేవస్వామ్ బోర్డు అధికారులు కూడా ఉత్సవానికి హాజరయ్యారు. స్వామివారిని భక్తులు సందర్శించిన అనంతరం మంగళవారం రాత్రి ఆలయాన్ని మూసివేసి మూడురోజుల అనంతరం తెరవనున్నారు. రెండో దశ ఆరంభంలో భాగంగా డిసెంబర్ 30వ తేదీ సాయంత్రం 5గంటలకు అయ్యప్ప ఆలయం తిరిగి తెరుచుకోనుంది.
ఈ సందర్భంగా 14జనవరి 2023న మకరవిళక్కు వేడుకలు నిర్వహించనున్నారు. అనంతరం జనవరి 20న ఆలయం మూసివేయనున్నారు. దీంతో శబరిమల వార్షిక యాత్ర ముగియనుంది. కాగా కేరళ దేవాదాయశాఖ మంత్రి రాధాకృష్ణన్ మాట్లాడుతూ భారీసంఖ్యలో హాజరైనా ఆటంకం కలగకుండా పూజ ఘనంగా జరిగిందని తెలిపారు. 41రోజుల తొలి సీజన్‌లో 30లక్షలమందికిపైగా భక్తులు శబరిమల పుణ్యక్షేత్రాన్ని సందర్శించారని తెలిపారు. గత 39రోజుల కాలంలో శబరిమల దేవస్థానానికి రూ.222.98 కోట్ల ఆదాయం దేవాలయ ఉన్నతాధికారులు తెలిపారు.