ఆర్థిక ఇబ్బందులతోనే మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్మెన్ ఫజల్ అలీ ఆత్మహత్యకు పాల్పడ్డాడని పశ్చిమ మండల డిసిపి జోయల్ డేవిస్ తెలిపారు. ఆదివారం ఉదయం అమీర్ పేట్ శ్రీనగర్ కాలనీ మణికంఠ హోటల్ లో సబితా గన్మెన్ ఫజల్ అలీ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు, మంత్రి సబితా వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై డిసిపి జోయల్ డేవిస్ మాట్లాడుతూ.. “ఈ రోజు ఉదయం 7 గంటల సమయంలో ఫజల్ అలీ ఆత్మహత్య చేసుకున్నారు. ఫజల్ అలీ.. సబితా ఇంద్రారెడ్డి ఎస్కార్ట్ ఇన్ ఛార్జిగా ఉన్నారు. ఉదయం కూతురుతో కలిసి ఫజల్ అలీ విధులకు వచ్చారు. తర్వాత వ్యక్తిగత విషయాల గురించి ఫజల్ కూతురితో చర్చించారు. ప్రైవేట్ బ్యాంకులో ఫజల్ అలీ రుణం తీసుకున్నట్లు కుమార్తె తెలిపింది. రుణం చెల్లించినా అదనంగా డబ్బులు కోరుతున్నారని ఆయన కూతురు చెప్పింది. ఆర్థిక ఇబ్బందులు కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది” అని పేర్కొన్నారు.