Sunday, January 12, 2025

తెలంగాణ తల్లి గురించి చెబుతూ మహిళలపై దాడులా..?:సబితా ఇంద్రారెడ్డి

- Advertisement -
- Advertisement -

పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో కేవలం ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా కెసిఆర్ అమలు చేసి చూపించారని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సిఎం అసెంబ్లీలో తెలంగాణ తల్లి గురించి మాట్లాడారని, బయట ఆడబిడ్డలైన ఆశావర్కర్ల మీద దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో సోమవారం ఎంఎల్‌ఎ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బిఆర్‌ఎస్ నేతలతో కలిసి సబితా ఇంద్రారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణ తల్లి గురించి చెబుతూ మహిళలపై దాడులా..? అని ప్రశ్నించారు. ఆశావర్కర్ల మీద మగ పోలీసులు దాడి చేసిన తీరును అందరూ చూశారని…అసలు రాష్ట్రం ఎటు పోతోందని ప్రశ్నించారు.

ఆశా వర్కర్లపై జరిగిన దాడిని సబితా ఇంద్రారెడ్డి ఖండించారు. ప్రభుత్వం ఆశావర్కర్ల పట్ల అమానవీయంగా వ్యవహరించిందని మండిపడ్డారు. పైన ఒకటి చెబుతున్నారు క్షేత్ర స్థాయిలో ఒకటి జరుగుతోందని విమర్శించారు. ఆశా వర్కర్లపై దాడి జరిగిన తీరుతో ప్రభుత్వం సిగ్గుతో తలవంచుకోవాలని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఆశావర్కర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆశావర్కర్ల నాయకురాలు సంతోషి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఆమెకు ఉత్తమ వైద్యం అందించాలని కోరారు. వెంటనే ప్రభుత్వం ఆశావర్కర్లకు న్యాయం చేయాలని, ఈ అసెంబ్లీ సెషన్‌లోనే వారికి న్యాయం చేయాలని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు.

మహిళలే ఈ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెడతారు : పల్లా రాజేశ్వర్‌రెడ్డి
పోలీసులు ఆశావర్కర్లపై రాక్షస మూకలా వ్యవహరించి దాడి చేశారని ఎంఎల్‌ఎ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎసిపి శంకర్ మహిళలపై దాడి చేశాడని మండిపడ్డారు. ఆశావర్కర్ల పై పోలీసుల దమన కాండను ఆయన ఖండించారు. తెలంగాణ తల్లి గురించి చెబుతూ ఆడబిడ్డలకు న్యాయం చేయరా..? అని నిలదీశారు. హైదరాబాద్‌లోని ప్రతీ పోలీస్ స్టేషన్ ఆందోళన కారులతో నిండి పోయిందని అన్నారు.ప్రతి మహిళా ఆవేదనతో ఉన్నదని, మహిళలే ఈ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెడతారని హెచ్చరించారు.

ఎన్నికల మేనిఫెస్టోలో ఆశావర్కర్లకు కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. కెసిఆర్ ఆశా వర్కర్ల గౌరవ వేతనాన్ని పది వేల రూపాయలకు పెంచారని చెప్పారు. ఈ ప్రభుత్వం చేవ లేని దద్దమ్మ ప్రభుత్వం అని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. వంద రోజుల్లో చేస్తామన్నవి చేయరా..? అని నిలదీశారు. మాజీ సర్పంచ్‌లు తమ బిల్లుల కోసం ఉద్యమిస్తుంటే వాళ్ళను జైల్లోకి పంపుతున్నారని ఆరోపించారు. పెద్ద కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లిస్తూ మాజీ సర్పంచ్‌ల బిల్లులు ఆపుతున్నారని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News