Sunday, December 22, 2024

పేదల ఇళ్లను కూల్చి…. రేవంత్ రాక్షసానందం పొందుతున్నారు: సబితా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పేదల ఇళ్లు కూల్చి మూసీ నదిపై పెద్ద భవనాలకు ఎలా అనుమతి ఇస్తారని బిఆర్ఎస్ ఎంఎల్ఎ సబితా ఇంద్రారెడ్డి అడిగారు. తెలంగాణ భవన్ లో హైడ్రా బాధితులతో బిఆర్ఎస్ ఎంఎల్ఎలు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సబితా మీడియాతో మాట్లాడారు.  మూసీపై అఖిలపక్షం సమావేశం నిర్వహించిన తరువాత ముందుకెళ్లాలని సూచించారు. బాధితులకు రక్షణ కవచంలాగా అండగా ఉంటామని, బాధితులకు అండగా ఉండాలని కెసిఆర్ తమకు సూచించారన్నారు. బిఆర్ఎస్ లీగల్ బృందం బాధితులకు అండగా ఉంటుందన్నారు.

తొమ్మిది నెలల్లో రేవంత్ రెడ్డి రాక్షసానందం పొందుతున్నారని ఆమె దుయ్యబట్టారు. హైదరాబాద్ ఇమేజ్ ను డ్యామేజీ చేయాలని రేవంత్ కంకణం కట్టుకొని భాగ్యనగరంలో విధ్వంసం సృష్టిస్తున్నారని, దీంతో హైదరాబాద్ వాసులు పక్కరాష్ట్రాలకు వెళ్లిపోతారన్నారు.  కెసిఆర్ పాలనలో ప్రజలను ఇబ్బంది పెట్టలేదని, ప్రజలు రోగాల బారిన పడుతున్నప్పుడు వాటిపై దృష్టి పెట్టే ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదని సబితా మండిపడ్డారు. సిఎం రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో పాలన చేస్తున్నారని, బుచ్చమ్మ ఆత్మహత్య ప్రభుత్వం చేసిన హత్యే నని ద్వజమెత్తారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న అంశంపై దృష్టి పెట్టాలని రేవంత్ కు సూచించారు.

గత 20 సంవత్సరాల నుంచి అన్ని అనుమతులతో మూసీ పరివాహక ప్రాంతంలో ఉంటున్నామని, ఎఫ్ టిఎల్, బఫర్ జోన్ లో ఉంటే ఉమ్మడి ఎపిలో అనుమతులు ఎలా ఇచ్చారని బాధితులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాము ఎవరికి చెప్పుకోవాలో తెలియడంలేదని, తాము కొనేటప్పుడు, ఇళ్లు కట్టేటప్పుడు బఫర్ జోన్ అని ఎవరూ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఇప్పుడొచ్చి బఫర్ జోన్ అంటే ఎట్లా అని బాధితులు కన్నీంటిపర్యంతమవుతున్నారు. టివి ఆన్ చేస్తే చాలు ప్రభుత్వం ఏం చెబుతుందో అని  భయంతో వణికిపోతున్నామని, రాత్రి పడుకుంటే ఉదయం లేస్తామో గుండెపోటుతో పోతామో తెలియడం లేదని వాపోతున్నారు. టివిల్లో మమ్మల్ని ఆక్రమణదారులు అంటున్నారని, తమకు అన్ని అనుమతులు ప్రభుత్వం ఎందుకు ఇచ్చిందని బాధితులు నిలదీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News