Sunday, December 22, 2024

చర్చ..రచ్చ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : అసెంబ్లీలో చర్చ రచ్చగా మారింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వెల్ లోకి దూసుకువెళ్లడంతో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభను గురువారానికి వాయిదా వేశారు. పార్టీ ఫిరాయింపులపై చర్చ సందర్బంగా సబితా ఇంద్రారెడ్డి తనను మోసం చేశారని, పార్టీలో చేరాలని కాంగ్రెస్ లోకి ఆహ్వానించి ఆమె బీఆర్‌ఎస్ లో చేరి మంత్రిపదవి పొందారని అన్నారు. సబితను అక్కగా భావించే తాను కాంగ్రెస్ లో చేరినట్టు చెప్పారు. తనను మోసం చేశారు కాబట్టే సబితను నమ్మొద్దని కేటీఆర్‌కు చెబుతున్నానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సీఎం చేసిన కామెంట్లు సభలో దుమారం రేపాయి. సీఎం వ్యాఖ్యలపై సబిత మాట్లాడుతూ సీఎం ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి వచ్చారనేది తెలుసుకోవాలన్నారు. కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి, తన ఇంటి మీద వాలితే కాల్చి చంపేస్తామని చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

తననే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని సబిత ప్రశ్నించారు. దీంతో సీఎం తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, సబితా ఇంద్రారెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు భట్టి విక్రమార్క మాట్లాడుతూ తమ శాసన సభా పక్షాన్నే బీఆర్‌ఎస్ లో విలీనం చేసుకున్నారని గుర్తు చేశారు. ఒక దళితుడు ఎల్పీ నేతగా ఉండడాన్నీ జీర్ణించుకోలేక పోయారని అన్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. భోజన విరామం కోసం సభను వాయిదా వేశారు. అనంతరం మళ్లీ సభ ప్రారంభం కాగానే సబితా ఇంద్రారెడ్డికి క్షమాపణలు చెప్పాలని బీఆర్‌ఎస్ సభ్యులు పట్టుబట్టారు. వెల్ లోకి దూసుకెళ్లి సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతుండగా అడ్డుతగిలారు. చప్పట్లు కొడుతూ నిరసన తెలిపారు. ఇదే తరుణంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లును ప్రతిపాదించగా స్పీకర్ సభలో ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది.

తమ్ముడిని అలా మోసం చేసింది కాబట్టే…జాగ్రత్త అంటూ కేటీఆర్‌ని హెచ్చరించా: సిఎం రేవంత్ రెడ్డి
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తమను నమ్మవద్దని కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి చెప్పడంపై సబిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్పందిస్తూ తనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్లుగా చెప్పారని, అది వాస్తవమేనని, కానీ మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేస్తే అండగా నిలబడతానని తనకు హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. అందుకే కేటీఆర్‌ను హెచ్చరించానని అభిప్రాయపడ్డారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు వ్యక్తిగత సంభాషణ ఉంటుంది. ప్రజా జీవితంలో చర్చ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని నేను చెప్పాను..పెద్ద లీడర్‌వు అవుతావు..పార్టీకి, నీకు భవిష్యత్తు ఉంటుందని నాతో చెప్పానని సబితక్క అంటున్నారు. అది వాస్తవం. అయితే ఇది మా ఇద్దరి మధ్య జరిగిన వ్యక్తిగత సంభాషణ. వ్యక్తిగతంగా జరిగిన చర్చను సబితక్క సభలో పెట్టింది. కాబట్టి దీనికి కొనసాగింపుగా జరిగిన చర్చను కూడా నేను సభలోనే పెట్టాలి.

వారి మాటను విశ్వసించి సొంత అక్కగా భావించి కుటుంబ సంబంధాల నేపథ్యంలో ఇతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తాను కొడంగల్ నుంచి ఓడిపోయిన తర్వాత 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తనను పార్లమెంట్‌కు పోటీ చేయమని చెప్పారని పేర్కొన్నారు. మల్కాజ్‌గిరి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయమని చెప్పి అండగా ఉంటానని సబితక్క తనకు మాట ఇచ్చారని, కానీ పార్టీ తనకు టిక్కెట్ ఇచ్చాక ఆమె బీఆర్‌ఎస్ పార్టీలో చేరారని ఆరోపించారు. తమ్ముడిగా తనను పిలిచి మల్కాజ్‌గిరిలో అండగా ఉంటానని ప్రోత్సహించి పార్టీ అభ్యర్థిగా తనను ప్రకటించాక కేసీఆర్ మాయమాటలకు, అధికారం కోసం కాంగ్రెస్‌ను వదిలి బీఆర్‌ఎస్‌లో చేరి మంత్రి పదవి దక్కించుకుని తమ్ముడిని మోసం చేసింది కాబట్టే ఈరోజు ఆమెను నమ్మవద్దని కేటీఆర్‌కు చెప్పాను.

ఇది నిజమా? కాదా? అని సబితక్కను అడగండి’ అని సీఎం ఆవేశంగా అన్నారు. ఆరోజు తనను ప్రోత్సహించి మోసం చేశారని, ఇప్పుడు తమకు నీతులు చెబుతారా? అని మండిపడ్డారు. అయినా తాను కేటీఆర్‌కు చెప్పిన సమయంలో ఎవరి పేరూ తీసుకోలేదన్నారు. అయినా సబితక్క స్పందించడం విడ్డూరమన్నారు. కొత్త గవర్నర్ గారు వస్తున్నారని, ఆయనను ఆహ్వానించడానికి వెళ్తున్నానని, ఇంకా ఏమైనా ఉంటే ఆ తర్వాత వచ్చి సమాధానం చెబుతానని ముఖ్యమంత్రి అన్నారు. తాను తిరిగి వచ్చాక అందరికి కలిపి సమాధానం చెబుతానన్నారు.

పార్టీ మారి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
పార్టీలో పదవులు అనుభవించి స్వలాభం కోసం బీఆర్‌ఎస్ వెళ్లారని, ఏం మోహం పెట్టుకుని సీఎం గురించి మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం చేసిన వ్యాఖ్యలపై సబితా ఇంద్రారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై భట్టి విక్రమార్క మాట్లాడుతూ సబితా ఇంద్రారెడ్డి గారు చాలా బావోధ్వేగంతో మాట్లాడారని అన్నారు. 2004కు ముందు ఆమె వేరే పార్టీలో ఉంటే కాంగ్రెస్ పార్టీ పిలిచి టికెట్ ఇచ్చి, మంత్రిని కూడా చేసిందని, అలాగే 2009 లో కూడా మంత్రిని చేసిందని, పదేళ్ల పాటు ముఖ్యమైన పోర్ట్ ఫోలియోలు ఇచ్చి గౌరవం ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దళిత వర్గాలకు చెందిన నన్ను ప్రతిపక్ష నాయకుడిగా నిర్ణయించిందని తెలిపారు.

ఆ సమయంలో నాకు సపోర్టుగా ఉండకుండా వారి స్వలాభం కోసం పార్టీ మారి కాంగ్రెస్ పార్టీని మోసం చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను స్వయంగా నాయకులతో కలిసి వారి ఇంటికి వెళ్లి మీరు పార్టీ మారితే ఎల్‌ఓపీ స్టేటస్ పోతుంది. కాంగ్రెస్ పార్టీ మీకు ఏం తక్కువ చేయలేదు. ఇకపై కూడా తక్కువ చేయదు అని బ్రతిమలాడినా ఒక్క సారైనా ఆలోచన చేశారా అని మండిపడ్డారు. మీ అధికారం కోసం, మీ స్వార్దం కోసం వెళ్లి టీఆర్‌ఎస్ పార్టీలో చేరి ఇప్పుడు భాదపడుతున్నారని.. ఆవేధన చెందాల్సింది నేనా, కాంగ్రెస్ పార్టీయా, ఈ రాష్ట్రంలోని ప్రజాస్వామ్యమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకక ఇంకా ఏం మొహం పెట్టుకుని సీఎంని అంటున్నారని, పార్టీలు మారి పరువు తీసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు.

ఆడబిడ్డల ఉసురు తగుల్తది : కెటిఆర్
అసెంబ్లీ వాయిదా తర్వాత బయటికి వచ్చిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ సమీపంలో ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ మహిళలని నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అంటూ రేవంత్ మహిళలని అవమానించారని ఆరోపించారు. మహిళల్ని అవమానించిన రేవంత్ రెడ్డికి సీఎం కుర్చీలో కూర్చునే అర్హత లేదన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, తామ హయాంలో ఏ ఒక్కరినీ అవమానించలేదని చెప్పారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సీఎంకు తగదని, సబితా ఇంద్రారెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డికి నాపై ఇంత కక్ష ఎందుకు? : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తనపై కక్ష ఎందుకని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు సరికాదన్నారు. నీ వెనుక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు. మోసం చేస్తారని కేటీఆర్‌ను ఉద్దేశించి ముఖ్యమంత్రి అనడం సరికాదన్నారు. తాము ఏం మోసం చేశాం..ఎవరిని ముంచామో చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మంచి మనసుతో ఆయనను ఆహ్వానించానన్నారు. పార్టీలోకి రా తమ్ముడు..వస్తే ఈ పార్టీకి (కాంగ్రెస్) భవిష్యత్తులో ఆశాకిరణం అవుతావని రేవంత్ రెడ్డికి చెప్పింది తానే అన్నారు.

ముఖ్యమంత్రివి అవుతావని కూడా రేవంత్ రెడ్డికి ఆనాడే చెప్పానన్నారు. అలా చెప్పలేదని గుండెమీద చేయి వేసుకుని చెప్పాలన్నారు. ఎన్నికల సమయంలో కూడా తనపై విమర్శలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రతిసారి తనను టార్గెట్ చేస్తున్నారని, తనపై ఇంత కక్ష ఎందుకని ప్రశ్నించారు. ఓ ఆడబిడ్డపై ఇలాంటి మాటలు ఏమిటన్నారు. తమపై సీఎం చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి వచ్చారు? ఏ పార్టీ నుంచి వచ్చారు? ఏ పార్టీలో నుంచి ఏ పార్టీలో చేరారు? అక్కడున్న వారు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి వెళ్లారో చర్చ పెట్టుకుందాం. కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి నా ఇంటిమీద వాలితే కాల్చేస్తానని రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక చెప్పారు. మరి ఇప్పుడు తమ పార్టీ నుంచి చేర్చుకున్న వారు ఎంతమంది ఉన్నారని నిలదీశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News