న్యూఢిల్లీ : సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడు , గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ మేనల్లుడు సచిన్ బిష్ణోయ్‌ను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. అతన్ని అజర్‌బైజాన్ వద్ద పట్టుకున్నట్టు సమాచారం. లారెన్స్ గ్యాంగ్‌కు సచిన్ బయటి నుంచి సూచనలు ఇచ్చేవాడని ఆరోపణలున్నాయి. ఇదిలా ఉండగా, మూసేవాలా హత్య కేసులో మాన్సా పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. 1850 పేజీల ఛార్జిషీట్‌లో 24 మంది నిందితుల పేర్లు ఉన్నాయి. ఇందులో ఇప్పటికే 20 మందిని అరెస్టు చేయగా, మరో నలుగురు నిందితులు విదేశాల్లో తలదాచుకున్నట్టుగా పేర్కొన్నారు. ప్రస్తుతం పంజాబ్ పోలీసుల అదుపులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ మూసేవాలా హత్యకు సూత్రధారి అని తేలింది. విదేశాల్లో తలదాచుకున్న నిందితుల్లో ప్రధాన నిందితులు గోల్డీబ్రార్, సచిన బిష్ణోయ్, అన్మోల్ బిష్ణోయ్, లిజిన్ నెహ్రా ఉన్నారు. ఈ కేసులో 34 మంది నిందితులపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఎస్పీ గౌరవ్ తోరా తెలిపారు.