Monday, January 20, 2025

50వ వసంతంలోకి సచిన్.. మాస్టర్ బ్లాస్టర్‌కు వెల్లువెత్తిన శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

ముంబై: సచిన్ రమేశ్ టెండూల్కర్.. ఈ పేరు ప్రపంచ క్రికెట్‌కే తలమానికం. భారత్‌తో పాటు ప్రపంచంలోని పలు దేశాల అభిమానులకు సచిన్ ఆరాధ్య క్రికెటర్. మాస్టర్ బ్లాస్టర్‌గా పేరును సార్ధకం చేసుకున్న సచిన్ టెండూల్కర్ 50వ వసంతంలోకి అడుగిడాడు. సోమవారం సచిన్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత అరుదైన క్రికెటర్‌గా సచిన్ పేరు తెచ్చుకున్నాడు. భారత్‌లోనే కాకుండా క్రికెట్ ఆడే అన్ని దేశాల్లోనూ సచిన్‌కు అభిమానులు ఉన్నారు. రెండు దశాబ్దాలకు పైగా అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ ఎదురులేని శక్తిగా కొనసాగాడు. ఈ క్రమంలో క్రికెట్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కానీ అసాధారణ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అత్యధిక మ్యాచ్‌లు, అత్యధిక పరుగులు, అత్యధిక శతకాలు, సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్ ఇలా ఎన్నో రికార్డులను సచిన్ సాధించాడు. టెస్టుల్లో రెండు వందల మ్యాచ్‌లు ఆడిన ఏకైక క్రికెటర్ కూడా సచినే. అంతేగాక వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ బ్యాటర్ కూడా మన మాస్టర్ బ్లాస్టరే.

దీంతోపాటు అంతర్జాతీయ కెరీర్‌లో వంద శతకాలు నమోదు చేసిన ఏకైక క్రికెటర్ కూడా సచినే. ఇలా ఏ రికార్డు చూసినా సచిన్ పేరిటే కనిపిస్తాయి. ఇక సోమవారం సచిన్ జీవితంలో చాలా ప్రత్యేకమైందని చెప్పాలి. తన కొడుకు అర్జున్ టెండూల్కర్ ఈ ఏడాదే ఐపిఎల్‌లో ఆరంగేట్రం చేశాడు. ఐపిఎల్‌లో అర్జున్ ముంబై ఇండియన్స్ తరఫున తన తొలి మ్యాచ్ ఆడేశాడు. ముంబై ఇండియన్స్‌కు తొలి కెప్టెన్‌గా సచిన్ వ్యవహరించాడు. ప్రస్తుతం అతను ముంబై టీమ్‌కు మెంటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. తాజాగా అతని కొడుకు అర్జున్ ముంబై తరఫున ఐపిఎల్‌కు శ్రీకారం చుట్టడంతో సచిన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరోవైపు 50వ జన్మదినాన్ని జరుపుకుంటున్న సచిన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. భారత క్రికెట్ బోర్డుతో సహా ఆయా దేశాలకు చెందిన క్రికెట్ సంఘాలు, ఐసిసి, ఆయా ఐపిఎల్ ఫ్రాంచైజీలు సచిన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాయి. అంతేగాక భారత మాజీ, ప్రస్తుత క్రికెటర్లు సయితం సచిన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రోహిత్, కోహ్లి, గంగూలీ, ద్రవిడ్, రవిశాస్త్రి, ధోనీ, సెహ్వాగ్, లక్ష్మణ్, హర్భజన్, పాంటింగ్, బ్రెట్‌లీ, వసీం అక్రం, వకార్ యూనిస్, మలింగ తదితరులు సచిన్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఇక సచిన్ తన 50వ జన్మదినాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News