100 కోట్ల మనీ లాండరింగ్ కేసు.. హీరో సచిన్ జోషి అరెస్ట్
మన తెలంగాణ/హైదరాబాద్: తెలుగు ప్రేక్షకులకు మౌనమేలనోయి, జాక్‌పాట్, ఓరేయ్‌పండు తదితర చిత్రాలతో సుపరిచితులైన నటుడు, సచిన్ జోషిని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు (ఈడీ) ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు. కాగా సచిన్ పలు సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. అంతేగాక ఆయన ఓ వ్యాపారవేత్త కూడా. గతంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, డిఫాల్టర్ అయిన విజయ్ మాల్యకు చెందిన బంగ్లాను సచిన్ జోషి కొనుగోలు చేశారు. అయితే, ఈ వ్యవహారంలో రియల్ ఎస్టేట్ సంస్థ ఓంకార్ గ్రూప్, సచిన్ జోషి మధ్య ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఏకంగా రూ.100 కోట్లు మేర మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు సచిన్ జోషి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో గతంలోనే విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే, విచారణకు సచిన్ జోషి హాజరు కాకపోవడంతో తాజాగా ఈడీ అధికారులు సచిన్ జోషిని అరెస్ట్ చేశారు. సౌత్ ముంబైలోని ఈడీ కార్యాలయంలో సచిన్ జోషిని ఓంకార్ రియల్టర్స్ కేసులో అధికారులు విచారిస్తున్నారు. ఈడీ అధికారులు ఇప్పటికే ఒంకార్ గ్రూప్ చైర్మన్ కమల్ గుప్తా, ఎండి బాబు లాల్ వర్మను ఈ కేసులో అరెస్ట్ చేశారు. గోవాలోని విజయ్ మాల్యాకు సంబంధించిన బంగ్లాను 2017లో రూ.73 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నాడు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు కూడా సచిన్ జోషికి చెందిన కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు నిర్వహించారు. కాగా సచిన్ జోషికి ముంబైలోని పలు ప్రాంతాల్లో రెస్టారెంట్లు, క్లబ్బులు ఉన్నాయి. మోడల్, నటి ఊర్వశి శర్మను సచిన్ వివాహం చేసుకున్నాడు. తెలుగు, కన్నడ, బాలీవుడ్‌లోనూ సచిన్ సినిమాలు చేశారు. పాన్ మసాలా, బ్రేవరీ, డిస్టిల్లరీస్ పరిశ్రమలు కూడా ఉన్నాయి.
గతంలోనూ గుట్కా అక్రమ రవాణా కేసులో సచిన్ జోషిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాన్ మసాలాల ముసుగులో నిషేధిత గుట్కాలు తయారీ, సరఫరా చేస్తున్న ఆయనను ముంబై విమానాశ్రయంలో అదుపులోనికి తీసుకున్నారు. రీసెంట్‌గా హైదరాబాద్‌లో భారీ ఎత్తున గుట్కా ప్యాకెట్లు దొరకగా, నిందితులను విచారించిన పోలీసులు సచిన్ జోషి ప్రమేయంపై ఆధారాలు సేకరించి, నిఘా పెంచారు. ఆపై సచిన్‌ను అరెస్ట్ చేసేందుకు కొన్ని రోజులుగా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి సచిన్ జోషి ముంబైలో పట్టుబడ్డాడు. కాగా, బాలీవుడ్‌లో సంపన్న కుటుంబాలలో సచిన్ జోషి కుటుంబం కూడా ఉంది. సచిన్ తండ్రికి గుట్కా వ్యాపారం ఉండగా.. దీనిలో ఆయన వందల కోట్లు సంపాదించారు. ప్రస్తుతం సచిన్‌ను అరెస్ట్ చేయడం బాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపింది. ఓ వైపు మహారాష్ట్రలో..మరోవైపు హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణలో వీరు గుట్కా అక్రమ దందాను సాగిస్తున్నారని తెలుస్తోంది.
Sachin Joshi arrested in Money laundering case