Monday, December 23, 2024

సిఎం గెహ్లాట్ కు సోనియా కన్నా వసుంధర రాజే నాయకురాలా : సచిన్ పైలట్ ధ్వజం

- Advertisement -
- Advertisement -

జైపూర్ :రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ఎలాంటి ఆంక్షలూ అడ్డూ లేకుండా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై సచిన్ పైలట్ మళ్లీ విరుచుకుపడ్డారు. ధోల్‌పూర్‌లో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి , బీజేపీ నాయకురాలు వసుంధర రాజేను ముఖ్యమంత్రి గెహ్లాట్ ప్రశంసించడాన్ని సచిన్ పైలట్ తప్పుపట్టారు.

ముఖ్యమంత్రి గెహ్లాట్ ప్రసంగం చూస్తుంటే ఆయనకు కాంగ్రెస్ నాయకురాలు సోనియా కన్నా వసుంధర రాజే నాయకురాలుగా ఉన్నట్టు కనిపిస్తోందని ధ్వజమెత్తారు. పైలట్ ఈ సందర్భంగా తన ఐదు రోజుల కార్యక్రమాన్ని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం లోని అవినీతి, రిక్రూట్ మెంట్ పరీక్షల్లో పేపర్ లీకేజీ తదితర కేసులపై ఈ నెల 11న 125 కిమీ పొడవున జనసంఘర్ష్‌యాత్ర ప్రారంభిస్తున్నానని వెల్లడించారు. ఈ విధంగా ఆందోళనకు సచిన్ పూనుకోవడం ఈ ఏడాది ఆఖరులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడం దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గెహ్లాట్ పైన , కాంగ్రెస్ అధిష్ఠానం పైన ఒత్తిడి పెంచుతున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి.

రాష్ట్రంలో గత బిజేపి ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై తమ స్వంత పార్టీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ గత నెల ఒకరోజు సచిన్ నిరాహార దీక్ష కూడా చేశారు. ఆదివారం ముఖ్యమంత్రి గెహ్లాట్ ధోల్‌పూర్‌లో మాట్లాడుతూ 2020లో కొంతమంది కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎలు తన ప్రభుత్వంపై తిరుగుబాటు చేసినప్పుడు మనీ పవర్‌తో ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నించారని, అయితే బీజేపీ నేతలు వసుంధర రాజే, కైలాష్ మేఘ్వాల్ ఆ కుట్రకు మద్దతు ఇవ్వడానికి నిరాకరించారని నాటి సంఘటన వివరించారు. అయితే పైలట్ ఈ ఆరోపణలను తిరస్కరించారు. తాను నేతృత్వం వహించిన అసమ్మతి ఎమ్‌ఎల్‌ఎలు ఎవరూ బీజేపీ నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోలేదని పేర్కొన్నారు.

వసుంధర రాజే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయాల్సిందిగా గెహ్లాట్‌ను అడిగింది తానేనని గుర్తు చేశారు. ధోల్‌పూర్‌లో సిఎం గెహ్లాట్ ప్రసంగం వింటున్నప్పుడు గెహ్లాట్ నాయకురాలు వసుంధర రాజే తప్ప సోనియా కాదనిపించిందని విలేఖరులతో ఆయన వ్యాఖ్యానించారు స్వంత పార్టీ నాయకులకు వ్యతిరేకంగా ఆరోపణలు చేయడం పొరపాటుగా పైలట్ పేర్కొన్నారు. ఈ నిరాధార, అవాస్తవ ఆరోపణలను తాను ఖండిస్తున్నానని చెప్పారు. వీటికి సాక్షాధారాలుంటే ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవచ్చన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News