మనతెలంగాణ/జవహర్‌నగర్ : విధుల నుంచి తొలగించబడిన సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్(సిఐఎస్‌ఎఫ్)మాజీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హకీంపేటలో చోటు చేసుకుంది. జవహర్‌నగర్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాదు జిల్లాకు చెందిన కె.రవీందర్(30) 2017లో సీఐఎస్‌ఎఫ్‌లో పోలీస్ కానిస్టేబుల్‌గా చేరి ఒరిస్సా రాష్ట్ర పరిధిలోని రూర్కెలాలో విధులు నిర్వహించాడు.రవీందర్ 2019లో శిరిష అనే యువతిని వివాహం చేసుకోగా వారికి మూడు సంవత్సరాల బాబు ఉన్నాడు.కాగా ఒరిస్సాలో ఉద్యోగం చేస్తున్న సమయంలో క్రమశిక్షణ చర్యలలో భాగంగా అధికారులు 2020 సంవత్సరంలో రవీందర్‌ను విధుల నుంచి తొలగించారు.
ఈ విషయం అతను ఇంట్లో ఎవరికి చెప్పకుండా హకీంపేటకు వచ్చి కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు.ప్రతి రోజు డ్యూటీకి వెళ్లుతున్నట్లు ఇంట్లో చెప్పి యూనిఫామ్ ధరించి వెళ్లుతున్నట్లు గుర్తించారు.మంగళవారం ఇంట్లో నుండి బయటకు వచ్చిన రవీందర్ కౌకూర్ సమీపంలోని ఫారెస్ట్ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకోని ఆత్మహత్య చేసుకున్నాడు.స్థానికులు గమనించి జవహర్‌నగర్ పోలీసులకు సమాచారం అందించగా,ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ సంఘటన స్థలానికి చేరుకోని సీఐఎస్‌ఎఫ్ అధికారులతో చర్చించగా రవీందర్‌ను రెండు సంవత్సరాల క్రితం విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు.విధుల నుండి తొలగించడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు చేసుకున్నాడా లేక మరేదైన జరిగిందా అనేది విచారణ అనంతరం తెలుస్తుందన్నారు.కేసు నమోదు చేసుకోని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి ధర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.