Tuesday, November 5, 2024

స్వాతంత్య్రోద్యమంలో ముస్లింల త్యాగాలు

- Advertisement -
- Advertisement -

Sacrifice of Muslims in Independence Movement

‘కుఛ్ ఆర్జూనహీ.., హయ్ తొ బస్ ఇత్ ని.., రఖ్ దె కోయీ ఖాకె వతన్ మేరె కఫన్ మే..’ (ఒకే ఒక్క కోరిక. అదితప్ప నాకు మరెలాంటి కోరికా లేదు. నాకఫన్‌లో నా జన్మభూమి మట్టిని కాస్త ఉంచండి. అంతే చాలు)దేశ స్వాతంత్య్రం కోసం ఉరితాడును ముద్దాడుతూ భారతదేశ ముద్దుబిడ్డ అమరజీవి అష్ఫాఖుల్లాఖాన్ పలికిన మాటలివి. ఈ దేశాన్ని, ఈ మట్టిని ముస్లింలు ఎంతగా ప్రేమిస్తారో తెలుసుకోడానికి ఇదొక చిన్న ఉదాహరణ.

నిజానికి ముస్లింలు దేశ స్వాతంత్య్రం కోసం అనుపమానమైన, అసాధారణమైన పాత్రను పోషించారు. శతాబ్దాలుగా దేశం కోసం పోరాడారు. ఇళ్ళూ వాకిళ్ళు వదిలిపెట్టారు. దేశ బహిష్కరణ గావించబడ్డారు. చెరసాలల పాలయ్యారు. చీకటి గుయ్యారాల్లో నిర్బంధించబడ్డారు. ఉరికంబాలపైకి ఎక్కించబడ్డారు. రకరకాలుగా హింసించబడ్డారు. కుటుంబాలను, బంధు మిత్రులను త్యాగం చేశారు. తమ సర్వస్వాన్నీ తృణప్రాయంగా ధారపోసిన ఫలితంగా ఎట్టకేలకు స్వాతంత్య్రం లభించింది.దేశం ఆంగ్లేయుల బానిసత్వం నుండి విముక్తి పొందింది. అమరవీరుల త్యాగాలు ఫలించి, వారి కలలు సాకారమయ్యాయి. భారతావని ఈనాడు సర్వ స్వతంత్రదేశం. ప్రతి యేటా గుండెల నిండా సంతోషంతో, కన్నుల పండువగా స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం. కాని స్వాతంత్య్ర సాధన కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన అనేక మంది త్యాగధనులను మనం తరచుగా మరచిపోతూ ఉంటాం. లేక కావాలనే వారి త్యాగాలను మరిపించే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి.

స్వాతంత్య్రోద్యమంలో ముస్లింల పాత్రను తొలగించడానికి, మరీ తప్పని సరి పరిస్థితులు ఏర్పడితే బాగా తగ్గించి చూపడానికి, కావలసినన్ని ప్రయత్నాలు గతంలోనూ జరిగాయి. ఇప్పుడూ జరుగుతున్నాయి. ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్షను రగిలించి, సమరశీల పోరాటాలకు నాందిపలికి, స్వాతంత్య్ర పోరాటంలో తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన ముస్లిం త్యాగధనుల పాత్రను నామమాత్రం చేసే ఈ చిల్లర ప్రయత్నాలు అత్యంత దుర్మార్గం. కళ్ళకు కట్టుకున్న అసూయ అద్దాలను తొలగించి, సమ దృష్టితో చూసినట్లయితే, భారతావని స్వాతంత్య్రం కోసం ముస్లింలు చేసిన ధన, ప్రాణ త్యాగాలు స్వాతంత్య్ర చరిత్రలో మరే జాతీ చేయలేదని రుజువైపోతుంది. కాని ఉద్యమానికి వ్యతిరేకంగా పని చేసి, బ్రిటిషర్ల బూట్లు నాకినవాళ్లు ఈరోజు దేశభక్తి డబ్బా కొట్టుకోవడం ఆశ్చర్యంగా ఉంది. దేశ స్వాతంత్య్రోద్యమంలో ఈ మతోన్మాద శక్తుల పాత్ర శూన్యం. బ్రిటిష్ వారి శిక్షలకు బెంబేలెత్తి, ఉద్యమంలో పాల్గొనబోమని, భారత్‌కు వ్యతిరేకంగా ఆంగ్లేయులకు అనుకూలంగా పని చేస్తామని మాఫీ పత్రాలు రాసిచ్చిన నీచ, నికృష్ట చరిత్ర వీరిది.

నిజానికి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా మొట్టమొదట గళం విప్పిందీ, గన్ను పట్టిందీ ముస్లింలే. 1750 ల్లోనే షాహ్ వలియుల్లా ముహద్దిస్ దహెల్వీ రహిమహుల్లా, అలీ వర్దీఖాన్‌లు స్వాతంత్రోద్యమానికి బీజం వేశారు. 1757లో బెంగాల్ పాలకుడైన నవాబ్ సిరాజుద్దౌలా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా స్వాతంత్య్రోద్యమాన్ని ఉధృతం చేశాడు. వర్తకం పేరుతో వచ్చి, పెత్తనం చెయ్యాలని కుట్ర పన్నిన ఆంగ్లేయులను ధీటుగా ఎదిరించి, సింహ స్వప్నంగా నిలిచాడు. దీంతో బెంబేలెత్తిన బ్రిటిషర్లు ఈ స్వతంత్ర పాలకుని అడ్డు తొలగించుకోవడం కోసం మీర్ జాఫర్ ద్వారా ద్రోహపూరిత కుట్రకు తెర లేపారు. ఫలితంగా సిరాజుద్దౌలా అమరగతి పొందాడు.తరువాత ఆంగ్లమూక మైసూరుపై దృష్టిపెట్టింది. మైసూరును వశం చేసుకోవాలని మాయోపాయాలు పన్నింది. అప్పటి మైసూ రు పాలకుడు సయ్యద్ హైదర్ అలీ అత్యంత ధైర్యస్థయిర్యాలు ప్రదర్శిస్తూ ఆంగ్ల బలగాలను అడ్డుకున్నాడు. ఈయన మరణం తరువాత, అతని కుమారుడు, వీరశూర పరాక్రమవంతుడైన టిప్పుసుల్తాన్ (1799 ) ఆంగ్ల మూకలకు సింహ స్వప్నమై నిలిచాడు. కాని మీర్ జాఫర్ ఆత్మ మీర్ సాదిఖ్ లో ప్రవేశించిన ఫలితంగా ‘టిప్పు’ కూడా అమరుడయ్యాడు. బ్రిటిష్ బలగాలతో వీరోచితంగా పోరాడుతూ, రణరంగంలోనే దేశం కోసం ప్రాణాలర్పించిన మొట్ట మొదటి దేశభక్తుడిగా టిప్పూ చరిత్ర అజరామరంగా నిలిచిపోయింది.

1817 లో సయ్యద్ అహ్మద్ షహీద్ (రహ్మ), అల్లామా ఇస్మాయీల్ షహీద్ (ర) గార్లు దేశాన్ని బానిస సంకెళ్ళ నుండి విముక్తి కల్పించడానికి కంకణ బద్ధులయ్యారు. ఈ యోధులిద్దరూ దేశ స్వాతంత్య్రం కోసం, ఆంగ్లమూకల బానిసత్వం నుండి దేశానికి విముక్తి కల్పించడం కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతూ 1831లో బాలాకోట్ అనే ప్రాంతంలో అమరగతిని పొందారు. ఈ ఘటన తరువాత ముస్లిం సమరయోధులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. అయినప్పటికీ వారు స్వాతంత్య్ర కాంక్షలో తమ ధైర్యస్థయిర్యాలను ఏమాత్రం సడలనివ్వ లేదు. స్వాతంత్య్ర సాధన సంగ్రామంలోనే తాము అమరగతి పొందాలన్న కోరికతో వారుతమ చివరి శ్వాస వరకూ పోరాడారు. ఇస్లామ్ బోధనల స్ఫూర్తితో 1857లో తిరుగుబాటు ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. స్వాతంత్య్ర కాంక్షతో రగిలిపోతూ స్వేచ్ఛా పతాకాన్ని చేబూని అగ్ర భాగంలో నిలిచినవారిలో మౌలానా ఇనాయతుల్లాహ్ సాదిక్ పురి, మౌలానా ఖాసిం నానోత్ వీలు అగ్రగణ్యులు.

ఈ త్యాగధనులు రగిలించిన స్ఫూర్తితో సాదిక్ పూర్ వీధులు దేశ ప్రేమికులైన అమరవీరుల రుధిరంతో ఎరుపెక్కాయి. చివరికి 1857 లోనే ఈ స్వాతంత్య్ర సమర పితామహులు అమరగతులయ్యారు. తరువాత ఈ మహత్తర ఉద్యమ బాధ్యతను మౌలానా అబ్దుల్లాహ్ కసూరి భుజాలకెత్తుకొని, నలభయ్యేళ్ళ పాటు అనుపమానమైన రీతిలో బలోపేతం చేస్తూ ముందుకు నడిపించారు. ఈ విధంగా భారతీయ ముస్లింలు తమ దేశ స్వాతంత్య్రం కోసం ఆంగ్లేయులతో నిరంతరం పోరాడుతూ, దేశమాత బానిస సంకెళ్ళను తునాతునకలు చేసే క్రమంలో తమ సర్వస్వాన్నీ త్యాగం చేయడానికి పరమ సంతోషంగా సిద్ధపడి, అసామాన్యమైన ఆదర్శాలను నెలకొల్పారు. బెంగాల్ మొదలు, కశ్మీరు వరకు విస్తరించిన భూభాగమంతా ముస్లిం సమరయోధుల రుధిరంతో ఎరుపెక్కి పోయింది. కాని ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, దేశ స్వాతంత్య్రం కోసం తమ సర్వస్వాన్నీ ధారపోసి, ఇన్ని త్యాగాలు చేసినా ముస్లింలు ఈనాడు అనుమానపు దృక్కులతో చూడబడుతున్నారు.

సొంతగడ్డపైన్నే పరాయివారుగా పరిగణించబడుతున్నారు. దేశద్రోహ ముద్ర వారి తలపై కత్తిలా వేలాడుతోంది. స్వతంత్ర భారతావనిలో వారి హక్కులు అతి దారుణంగా హరించబడుతున్నాయి. వారిని విదేశీయులని, విదేశీ ఏజెంట్లనీ నిందించడం జరుగుతోంది. వారిని దేశం విడిచి వెళ్ళమని కూడా బెదిరించడం జరుగుతోంది. ప్రాణాలను ధారపోసి సాధించుకున్న స్వతంత్ర స్వేచ్ఛా భారతంలో, స్వాతంత్రోద్యమంతో నామ మాత్రపు సంబంధం కూడా లేని పరివార్ శక్తులు ముస్లింల దేశభక్తిని శంకించడం అతి పెద్ద విషాదం. దయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదే కాబోలు. ముస్లింలు, న్యాయదృష్టి, భావసారూప్యత కలిగిన ఇతర మేధావి వర్గంతో కలసి నిజమైన చరిత్రను ప్రచారం చెయ్యాలి. కనీసం ముందు తరాలకైనా వాస్తవ చరిత్రను పరిచయం చేయడం ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం. –

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News