మనతెలంగాణ/హైదరాబాద్ : అఖిల భారత సెకండరీ ఉపాధ్యాయుల సమాఖ్య(ఎఐఎస్‌టిఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శిగా జి.సదానందం గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కర్నూల్‌లో జరిగిన జాతీయ సమావేశాల్లో ఎస్‌టియుటిఎస్ ప్రధాన కార్యదర్శిగా జి. సదానందం గౌడ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జి.సదానందం గౌడ్ నిరంతర అధ్యయనశీలిగా క్షేత్రస్థాయి సమస్యలను స్వయంగా పరిశీలించడం, ఉపాధ్యాయులతో సత్సంబంధం కలిగి ఉండడం ఎఐఎస్‌టిఎఫ్ పోషించబోయే పాత్రకు తోడ్పాటు అందిస్తుంది.
సుమారు మూడుదశాబ్దాల క్రితం తెలుగు రాష్ట్రాల నుండి శ్యాంసుందర్ రావు మాత్రమే ఈ పదవి చేపట్టగా, తాజాగా జి.సదానందం గౌడ్ ఎన్నికయ్యారు. ఆయన ఎన్నిక పట్ల రాష్ట్రాపాధ్యాయ సంఘం అధ్యక్షులు యం. పర్వత్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ ఇది ఎస్‌టియుకు లభించిన గౌరవమని అభివర్ణించారు. ఎఐఎస్‌టిఎఫ్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విద్యా, ఉపాధ్యాయ రంగ సమస్యలపై విస్తృతంగా చర్చించి, అనేక ఉద్యమాలతో పాటు ప్రభుత్వాలకు సలహా సూచనలు ఇస్తుంది. కాలానుగుణంగా విద్యలో, బోధనలో, తరగతి గదుల మౌళిక సదుపాయాలు తదితర అంశాల మీద విస్తృతంగా పరిశోధన చేసి ఆ పత్రాలను సమాజం, ప్రభుత్వాల ముందు ఉంచుతుంది. ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ అనే అంతర్జాతీయ ఉపాధ్యాయ సంఘంతో అనుబంధంగా ఉంటూ ఉపాధ్యాయుల సమస్యలను చర్చ, పరిశోధన ద్వారా వెల్లడించడమే కాకుండా వివిధ రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య ఉన్న అంతరాయాలను, అవరోధాలను గుర్తిస్తుంది.