కోల్‌కతా : పశ్చిమబెంగాల్ పురులియా జిల్లాలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు సాధువులపై కొందరు దాడికి పాల్పడడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గురువారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. మకర సంక్రాంతిని పురస్కరించుకుని యూపీకి చెందిన ముగ్గురు సాధువులు పశ్చిమబెంగాల్ లోని గంగాసాగర్ మేళాకు బయలుదేరారు. పురులియాజిల్లాలో వాహనం ఆపి ఇద్దరు అమ్మాయిలను దారి అడగ్గా వారు కిడ్నాపర్లనే భయంతో అమ్మాయిలు అక్కడ నుంచి పారిపోయారు.
స్ధానికులు ఇది గమనించి వారు కిడ్నాపర్లు అనుకుని దాడి చేశారు. ఈ సంఘటనపై పోలీస్‌లకు సమాచారం అందడంతో వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా వారు కిడ్నాపర్లు కాదని నిర్ధారణ అయింది. దాడికి పాల్పడిన 12 మందిని పోలీస్‌లు అరెస్టు చేశారు. ఈ సంఘటన రాజకీయంగా కలకలం రేపింది. టిఎంసీ పార్టీ మద్దతుతో కొందరు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని, దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మౌనంగా ఉండటం సిగ్గు చేటని బీజేపీ ధ్వజమెత్తింది.