Wednesday, January 22, 2025

భార్యను వివస్త్రను చేసి..ఎడ్ల బండికి కట్టి ఈడ్చుకెళ్లి

- Advertisement -
- Advertisement -

కాసిపేటః అనుమానం పెనుభూతమై కట్టుకున్న ఆమెను వివస్త్రను చేసి ఎడ్లబండికి కట్టి ఈడ్చుకెళ్లిన శాడిస్టు భర్తను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..మంచిర్యాల జిల్లా, కాసిపేట మండలం, దేవాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రొట్టెపల్లి గ్రామానికి చెందిన రాపల్లి సురేష్‌కు గతంలోనే వివాహం జరిగింది. ఇదే మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన గిరిజన యువతి బద్రుబాయిని కులాంతర వివాహం పేరిట రెండో పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత ఆమెపై అనుమానం పెంచుకొని గత కొంతకాలంగా చిత్రహింసలకు గురిచేసేవాడు. గతంలో కూడా సురేష్ తనను అడవిలోకి కట్టెల కోసమని తీసుకొని వెళ్లి చెట్టుకు ఉరి వేసి చంపే ప్రయత్నం కూడా చేశాడు. శుక్రవారం రాత్రి సురేష్ బద్రుబాయిని వివస్త్రను చేసి తన ఎడ్లబండికి వెనుక కట్టి,

సుమారు మూడు వందల మీటర్లు దూరం ఈడ్చుకొని వెళ్లాడు. రొట్టెపల్లి శివారులో మళ్ల్లీ ఎడ్లబండిలో ఆమెను వేయగా అందులో నుంచి ఆమె దూకి తప్పించుకొని పారిపోయి, సమీపంలోని డంపింగ్ యార్డులో రాత్రి నుండి తలదాచుకుంది. శనివారం మధ్యాహ్నం దారి వెంట పోయే కొందరు వ్యక్తులు చూసి దేవాపూర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని తనను ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం బద్రుబాయి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు సురేష్‌ను అదుపులోకి తీసుకొని ఆదివారం తెల్లవారు జామున ఒంటి గంటకు న్యాయమూర్తి ఆదేశాలు మేరకు ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, కట్టుకున్న భార్య పట్ల అతి క్రూరంగా వ్యవహరించిన సురేష్ పట్ల గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News