Tuesday, April 8, 2025

పెడదారిన బంగ్లాదేశ్

- Advertisement -
- Advertisement -

కోరి కొరివితో తల గోక్కోవాలనుకుంటే ఎవరేం చేయగలరు? పొరుగున ఉన్న బంగ్లాదేశ్ చేస్తున్నది అదే. షేక్ హసీనా ప్రభుత్వం పతనమయ్యాక నోబెల్ బహుమతి విజేత మహ్మద్ యూనుస్ నాయకత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం వింత పోకడలను గమనిస్తే ఆ దేశం అంతకంతకు పతనావస్థకు చేరువవుతోందని అనిపించకమానదు. హసీనాకు రాజకీయ ఆశ్రయమిచ్చిందనే అక్కసుతో ఇండియాతోనూ, యుఎస్ ఎయిడ్ నిధులను నిలిపివేసిందనే దుగ్ధతో ఆమెరికాతోనూ వైరం పెంచుకుంటున్న యూనుస్ ప్రభుత్వం శత్రువుకి శత్రువు మనకు మిత్రుడనే చందంగా చైనా, పాకిస్తాన్‌లతో స్నేహ సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది.

ఇందులో భాగమే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు యూనుస్ చైనా పర్యటన. ఇరుగు పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలను కాంక్షించడం ఏమాత్రం తప్పుకాదు. ఆ మాటకొస్తే, తన ప్రభుత్వం పతనం కావడానికి ముందు షేక్ హసీనా కూడా చైనాలో పర్యటించి వచ్చారు. కానీ, యూనుస్ తాజా పర్యటన వెనుక అంతరార్థం వేరు. ఇండియాకు వ్యతిరేకంగా చైనాతో చేతులు కలపాలనేది ఆయన వ్యూహంగా కనబడుతోంది. పెట్టుబడులు ఆశించడంతో సరిపెట్టుకోకుండా ఇండియాపై అక్కసు వెళ్లగక్కడం ద్వారా చైనాకు మరింత దగ్గర కావాలనే ఉబలాటం ఆయన మాటల్లో ప్రస్ఫుటంగా కనిపించింది. ‘ఇండియాలోని ఈశాన్య రాష్ట్రాలకు సముద్రమార్గం లేదు.

ఈ రాష్ట్రాలకు ఒక రకంగా మేమే సాగర రక్షకులం కాబట్టి చైనా తన ఆర్థిక బేస్‌ను విస్తరించుకోవడానికి ఈ ప్రాంతం అన్ని విధాలా అనుకూలం’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇండియా పట్ల ఆయనకున్న ద్వేషాన్ని చెప్పకనే చెబుతున్నాయి. యూనుస్‌తో సహా ఆయన మంత్రివర్గంలోని 24 మందికి ఎలాంటి పాలనానుభవం లేకపోవడమే ఇప్పుడు బంగ్లాదేశ్ భవిష్యత్తుకు పెనుముప్పుగా గోచరిస్తోంది. ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందన్నట్లు దేశంలో అంతర్గతంగా చెలరేగుతున్న అల్లర్లను, హింసాకాండను అణచివేయడంలో విఫలమైన యూనుస్.. చైనా, పాకిస్తాన్ వంటి దేశాలకు దగ్గరయ్యేందుకు అర్రులు చాస్తున్నారు. బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటివరకూ భారత ప్రధాని మోడీని కలుసుకునేందుకు యూనుస్ చేసిన ప్రయత్నాలేమీ లేకపోగా ఇండియాను కాదని చైనాలో పర్యటించడాన్ని బట్టి ఆయన తెంపరితనం ఏమిటో అర్థమవుతున్నది.

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో యూనుస్ ప్రభుత్వం విఫలమైందని మోడీ ప్రభుత్వం ఆగ్రహంతో ఉంది.ఇదే విషయంలో అమెరికా సైతం పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో చైనాకు దగ్గర కావాలనుకోవడం ఆత్మహత్యసదృశం అవుతుందనే వాస్తవాన్ని యూనుస్ ప్రభుత్వం పాకిస్తాన్‌ను చూసైనా గ్రహించాలి. ఆర్థిక కారిడార్ నిర్మాణం పేరిట పాకిస్తాన్‌కు ఇబ్బడిముబ్బడిగా రుణాలిచ్చి ఆ దేశాన్ని తన చేతిలో పెట్టుకున్న చైనాకు ఇప్పుడు యూనుస్ పుణ్యమాని బంగ్లాదేశ్‌లోనూ పాగా వేసే అవకాశం చిక్కింది. చైనా రుణపాశానికి చిక్కితే దాసోహమనడం తప్ప మరో మార్గం ఉండదన్నమాటే. పాకిస్తాన్ నుంచి విడివడి, బంగ్లాదేశ్‌గా ఆవిర్భవించడం వెనుక ఇండియా పోషించిన పాత్ర ఏమిటో ఎవరిని అడిగినా చెబుతారు.

ఇరు దేశాల మధ్య గత ఐదున్నర దశాబ్దాలుగా స్వేచ్ఛా వాణిజ్యం, ద్వైపాక్షిక బంధం దృఢంగా పెనవేసుకున్నాయి. విద్యుత్, ఇంధన రంగాల్లో బంగ్లాదేశ్‌కు ఇండియా సహకారం అత్యంత ఆవశ్యకం. అలాగే బంగ్లాదేశ్‌లో రాజకీయ సుస్థిరత ఇండియాకు ఎంతో కీలకం. బంగ్లాదేశ్‌లో మతపరమైన ఉద్రిక్తతలు, అల్లర్లు చెలరేగితే ఈశాన్య రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్‌లోనూ ఉగ్రవాదం భగ్గుమనే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇండియా తన రాజకీయ విజ్ఞతను ప్రదర్శించడం వాంఛనీయం. యూనుస్ తాత్కాలిక ప్రభుత్వం మరో పది నెలలు అధికారంలో ఉండవచ్చు.

ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పడం కష్టం. కాబట్టి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, కొత్తగా ఏర్పడిన నేషనల్ సిటిజన్ పార్టీలతో సంప్రదింపులు ప్రారంభించాలి. అదే సమయంలో ఈశాన్య ప్రాంతంలో ఉగ్రవాదం తలెత్తకుండా సరిహద్దులను పటిష్టం చేయాలి. మరోవైపు ఇంట గెలవకుండా రచ్చ గెలవాలనుకుంటున్న యూనుస్ ప్రభుత్వం ఇకనైనా వాస్తవాలను గ్రహించడం మంచిది. మైనారిటీలపై జరుగుతున్న దాడులను, విద్యార్థులలో పెరుగుతున్న అసమ్మతిని అరికట్టి, వీలైనంత త్వరగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం చేయడం యూనుస్ ప్రభుత్వం ప్రధాన కర్తవ్యం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News