Friday, November 22, 2024

బల్దియాలో నాలాల భద్రత ఆడిట్

- Advertisement -
- Advertisement -

ప్రమాదాలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ముందస్తు చర్యలు

హైదరాబాద్: నాలాల పరిరక్షణతోపాటు, ప్రమాదాల నివారణపై జిహెచ్‌ఎంసి పూర్తి స్థాయి దృష్టి సారించింది. మరో నెలల్లో వర్షకాలం రానుండడంతో నాలా భద్రత చర్యలను కట్టుదిట్టం చేస్తోంది. ఇందులో భాగంగా గత సంవత్సరం మాదిరిగానే ఈ వర్షాకాలంలో సైతం నాలా భద్రత ఆడిట్ ను చేపట్టేందుకు జిహెచ్‌ఎంసి ముందస్తూ చర్యలను చేపట్టింది. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా నాలాలో కొట్టుకుని పోయి చిన్నారి , విద్యుత్ షాక్ కారణంగా మరో వ్యక్తి మృత్యవాత పడిన విషయం తెలిసిందే.. వర్షకాలంలో మరిన్ని ప్రమాదాలకు ఆస్కారం ఉండడంతో ముందస్తూ చర్యలకు జిహెచ్‌ఎంసి ఉపక్రమించింది.

ఇదే క్రమంలో రానున్న వర్షాకాలంలో నాలా ల కారణంగా చోటు చేసుకుంటున్న ప్రమాదాలను నివారించడంతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టింది. ఇందుకు సర్కిల్ వారీగా నాళాల స్కెచెస్ ను నిర్ధారించి ఒక్కొక్క స్కెచెస్ కు ఒక ఏఈ గానీ డిప్యూటీ ఈఈ లను బాధ్యులుగా నియమించాలన్న కమిషనర్ నిర్ణయం మేరకు సంబంధిత ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ ఇ.ఎన్.సి క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో డిప్యూటీ కమిషనర్ లు, ఇ.ఇ లు ఒక్కొక్క స్కెచెస్ కు ఒక ఇంజనీరింగ్ అధికారిని నియమించడంతో పాటు వారంతా సమర్థవంతంగా చిత్త శుద్ధి తో తమ విధులను నిర్వహించేలా ఆదేశించారు. కేటాయించిన స్కెచెస్ లో పూడికతీత, ఇతరలోపాలనుగుర్తించడం, ఏమైనా నాలాలు అన్యాక్రాంతమైతే వాటి పూర్తి వివరాలతో కూడిన నివేదిక ను ఈ నెల చివరి వరకు అధికారులు అందజేయాల్సి ఉంటుంది.

అంతే కాకుండా ప్రహరీ గోడల పునరుద్ధరణ, చైన్ లింక్, ఫెన్సింగ్, బ్యారికేడ్లు, ఓపెన్ నాలా , డ్రైన్ ల ఫెన్సింగ్, హెచ్చరిక బోర్డు లు, ప్రమాదాలు జరగకుండా సూచించే మార్క్ లు వాటి తో పాటు ఓపెన్ నాలా బాక్స్ డ్రెయిన్, స్టార్మ్ వాటర్ డ్రెయిన్లలో కూడా ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోనున్నారు. వార్డుల వారిగా కేటాయించిన ఇంజనీరింగ్ అధికారులు స్ట్రామ్ వాటర్ డ్రైన్ లకు సంబంధించిన క్యాచ్ పిట్స్,బాక్స్ డ్రైన్, మ్యాన్ హోల్స్ కు దెబ్బ తిన్న, పనికి రాకుండా ఉన్న కవర్స్ వెంటనే మరమ్మతులకు చర్యలు చేపట్టనున్నారు.ఇందుకు సంబంధించి పనులను వెంటనే పూర్తి చేయాలని, అధికారుల అజాగ్రత్త, నిర్లక్ష్యం మూలంగా అవాంఛనీయ సంఘటనలు, ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.

రోజు వారిగా నాలాల పూడిక తీత పనుల వివరాలు, ఫోటో తో సంబంధిత అధికారులు అప్ లోడ్ (నమోదు) చేయాల్సి ఉంటుంది. ప్రమాద హెచ్చరిక బోర్డులతో పాటు నాలాలో ప్రవహించే నీటి ప్రవాహం తెలుసుకునేందుకు వల్బారెబుల్ పాయింట్ ల వద్ద మీటర్ ఏర్పాటు తో పాటు ఫ్లోటింగ్ మెటీరియల్ ను కూడా ఎప్పటి కప్పుడు తొలగించేందుకు చర్యలు తీసుకుంటారు.ఐ.ఆర్.టి వర్కర్ల రోజు వారి అటెండెన్స్ తో పాటు వారు తీసిన డి- సిల్టింగు ను వెంట వెంటనే తరలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News