Wednesday, January 22, 2025

గాలిలో దీపంగా ఆనకట్టల భద్రత

- Advertisement -
- Advertisement -

దేశంలో ఆనకట్టల భద్రత గాలిలో దీపంలా తయారైంది. దేశం లోని 5334 భారీ ఆనకట్టల్లో 220 వరకు శతాబ్దం నాటివి. మరో వెయ్యికి పైగా ప్రాజెక్టులు నిర్మాణమై 50 నుంచి వందేళ్లు కావస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఆనకట్టలు వరదలకు అల్లాడిపోయాయి. ఎగువ రాష్ట్రాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురియడంతో వరదనీరు ముంచుకొచ్చి ఆనకట్టలపై ఒత్తిడి ఎక్కువైంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజి 69వ గేటు దెబ్బతినగా, తుంగభద్రా డ్యామ్‌లోని 19వ నెంబర్ గేటు గల్లంతుకావడం ఆందోళన కలిగించింది.

విజయవాడ ప్రకాశం బ్యారేజీకి సెప్టెంబర్ 1న నాలుగు బోట్లు ఢీకొనడంతో గేట్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఇక తెలుగు, కర్ణాటక రాష్ట్రాలకు సాగునీరు అందించే తుంగభద్ర డ్యామ్ 19వ నెంబర్ గేటు ఒక్కసారిగా కొట్టుకుపోవడం ఆనకట్టల భద్రత ప్రశ్నార్థకంగా తయారైంది. 1953లో నిర్మాణమైన తుంగభద్ర డ్యామ్ దాదాపు 70 ఏళ్లుగా గేట్ల విషయంలో ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. ఇప్పుడు ఒక్కసారిగా 19వ గేటు గల్లంతుకావడం నిర్వహణ లోపమా, లేదా మరేదైనా కారణం ఉందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రాజెక్టు కర్ణాటకతో పాటు ఆంధ్రలోని రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లోని లక్షలాది ఎకరాలకు సాగునీటిని అందిస్తోంది. అలాగే కొన్ని వందల గ్రామాల దాహార్తిని తీరుస్తోంది. ఈ ప్రాజెక్టుకు ఉన్న సమస్య దీనికి స్టాప్ లాగ్ గేట్లు లేవు. అందువల్ల వేలాది క్యూసెక్కుల నీటిని కిందకు వదలక తప్పడం లేదు.

ఇప్పుడు స్టాప్ లాగ్ గేటును వీలైనంత త్వరగా అమర్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ గేట్లను ఆపరేట్ చేయడానికి చెయిన్ విధానాన్ని అప్పట్లో ఏర్పాటు చేశారు. కొత్త ప్రాజెక్టుల్లో రేడియల్ గేట్లు ఏర్పాటు అవుతున్నాయి. ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద వస్తున్న సమయంలో సెప్టెంబర్ 1న నాలుగు మరబోట్లు గేట్లను ఢీకొనడంతో 69వ గేటు దెబ్బతింది. దీంతో ఆ గేటు మరమ్మతు చేపట్టారు. ఇక శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ఆనకట్టలు ఎంతవరకు భద్రంగా ఉన్నాయని ఆలోచిస్తే రెండేళ్ల క్రితమే ఈ ఆనకట్టల పరిస్థితిపై చర్చ జరిగింది. ఈ మూడు డ్యామ్‌ల భద్రతను నిర్ధారించడానికి తక్షణ చర్యలు అవసరమని కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కెఆర్‌ఎంబి) హెచ్చరించింది. ఈ మూడు ప్రాజెక్టులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. శ్రీశైలం, పులిచింతల డ్యామ్‌లను ఎపి నిర్వహిస్తుండగా, నాగార్జునసాగర్ డ్యామ్‌ను తెలంగాణ నిర్వహిస్తుందని అజెండాలో ఉంది. కానీ పూర్తి బాధ్యతలు అప్పగించకపోవడంతో నిర్వహణ బాధ్యతలు అపారదర్శకంగా మారాయి.

శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు కొన్నిమరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. పులిచింతలలో 2021 వరదల సమయంలో రేడియల్ గేట్లలో ఒకటి దెబ్బతిని స్పిల్‌వే కింద పడిపోయింది. ఇవన్నీ నిర్వహణ లోపం వల్లనే సంభవిస్తున్నాయి. ఆంధ్రలోని కడప జిల్లాలో చెయ్యేరుపై నిర్మించిన అన్నమయ్య ప్రాజెక్టుకు 2021 నవంబరులో వరదలు వచ్చేవరకు మరమ్మతులు లేవంటే నిర్వహణ తీరు ఎలా ఉందో తెలుస్తుంది. 2020 నవంబరులో భారీ వరదకు ఈ ప్రాజెక్టు గేటు దెబ్బతింది. తెలంగాణలో 2019 వరద సమయంలో మూసీ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయింది. గేట్ల మరమ్మతు జరగకపోవడానికి రాజకీయ పరమైన కారణాలు కూడా ఉంటున్నాయి. ప్రాజెక్టుల నిర్మాణం మొదలు నిర్వహణ వరకు నాయకుల మితిమీరిన జోక్యం ఏ పనికానివ్వడం లేదు. చాలా మంది నాయకులకు కాంట్రాక్టులతో సంబంధాలు ఉంటున్నాయి. ఇంజినీర్లు కూడా ఒకవైపు కాంట్రాక్టర్లకు , మరోవైపు రాజకీయ ప్రజాప్రతినిధులకు తలొగ్గి పని చేయవలసి వస్తోంది. ఇంతేకాకుండా చాలా ప్రాజెక్టులకు కావలసిన నిధులు కేటాయింపు జరగడం లేదు.

శ్రీశైలం ప్రాజెక్టుకు 2009 లో వచ్చిన వరదల వల్ల ఆనకట్ట పునాది దెబ్బతింటుందని మరమ్మతులకు రూ.700 కోట్ల వరకు వ్యయమవుతుందని అంచనా వేశారు. అయినా పనులు సజావుగా సాగలేదు. దేశంలో అనేక ఆనకట్టల నిర్మాణం, నిర్వహణ లోపాల వల్ల తీవ్రస్థాయిలో వరదలు దాపురించి ఊళ్లకు ఊళ్లే జలమయమవుతున్నాయి. ఉత్తరాఖండ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో గత కొన్నేళ్లుగా వరదలు ఉధృతంగా ముంచుకు రాడానికి ఆనకట్టలు నిర్వహణ లోపాలు పరోక్షంగా కారణమవుతున్నాయి. ఆనకట్టల భద్రతకు సంబంధించి డ్యామ్ సేఫ్టీ బిల్లును 2019లో పార్లమెంట్ ఆమోదించింది. అయినా ఇంతవరకు సరైన అజమాయిషీ జరగడం లేదు. అయితే 2012 నాటి జాతీయ జల విధానం ప్రతి ఆనకట్టకూ సమానమైన ప్రాధాన్యం ఇస్తూ సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తోంది. ఇందులో కేంద్ర ప్రభుత్వంతోపాటు ఆయా రాష్ట్రాలు కూడా నిర్వహణలో పాలుపంచుకోవడమే కాదు, పకడ్బందీ పర్యవేక్షణ ఎప్పటికప్పుడు ఉంటేనే ఆనకట్టలకు భద్రత లభిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News