భారత హరిత విప్లవ పితామహుడు ఇక లేరు
చైన్నెలోని నివాసంలో తుదిశ్వాస
స్వల్పకాలంలో అధిక దిగుబడినిచ్చే వంగడాల రూపకల్పనలో కీలక పాత్ర
భారత్‌లో కరువు పరిస్థితులను రూపుమాపడంలో స్వామినాథన్ తనదైన కృషి
రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల సంతాపం రేపు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
చెన్నై: భారత హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్(98)వృద్ధాప్య సమస్యలతో గురువారం ఉదయం 11గంటల ప్రాంతంలో తన నివాసంలో కన్నుమూశారు. స్వామినాథన్‌కు ముగ్గురు కుమార్తెలు, వీరిలో ఒకరైన సౌమ్య స్వామినాథన్ ప్ర పంచ ఆరోగ్య సంస్థలో 2019 నుంచి 2022 వ రకు చీఫ్ సైంటిస్ట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. కరోనా సమయంలో ప్రపంచ వ్యాప్తంగా వైరస్ వ్యాపి కట్టడి కోసం ఆమె ఎంతో కృషి చేశారు. మిగతా ఇద్దరు కుమార్తెలు మధురా స్వామినాథన్, నిత్యారావు. ఆయన భార్య మీనా స్వామినాథన్ ఇప్పటికే చనిపోయారు. స్వామినాథన్ అం త్యక్రియలు 30న నిర్వహించనున్నట్లు ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్ అధికార ప్రతినిధి వెల్లడించారు. స్వామినాథన్ అంతిమక్రియలు పోలీసు అధికార లాంఛనాలతో నిర్వహించాలని త మిళనాడు సిఎం స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని గణనీయం గా పెంచడంలో ముఖ్యంగా అధిక దిగుబడినిచ్చే వరి, గోధుమ వంగడాల రూపకల్పనలో స్వామినాథన్ కీలక పాత్ర పోషించారు. ఆయన సేవలకు గుర్తింపుగా అనేక అవార్డులు వరించాయి. 1971లో రామన్ మెగసెసే అవార్డు, 1999లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి, 1987లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డులు లభించాయి. కేంద్ర ప్రభుత్వం 1967లో పద్మశ్రీ , 1972లో పద్మభూషణ్, 1989లో పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. 2007 నుంచి 2013 మధ్య పార్లమెంట్‌కు నామినేట్ ఎంపీగా స్వామినాథన్ సేవలందించారు. 1988లో స్వామినాథన్ లాభాపేక్ష లేని రీసెర్చ్ ఫౌండేషన్‌ను స్థాపించారు.
జీవిత విశేషాలు
స్వామినాథన్ 1925 ఆగస్టు 7న అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ లోని కుంభకోణంలో జన్మించారు. ఆయన తండ్రి ఎంకే సాంబశివన్ సర్జన్. మెట్రిక్యులేషన్ పూర్తయిన తరువాత స్వామినాథన్ కూడా తండ్రి బాటలోనే మెడికల్ స్కూల్లో చేరారు. కానీ 1943 లో బెంగాల్ కరవును కళ్లార చూసిన ఆయన చలించిపోయారు. దేశాన్ని ఆకలి సుంచి సంరక్షించాలన్న లక్షంతో వైద్య రంగం నుంచి తన మనసు మార్చుకుని వ్యవసాయ పరిశోధనల వైపు అడుగు వేశారు. త్రివేండ్రం లోని మహారాజా కాలేజీలో జువాలజీ నుంచి యూజీ డిగ్రీ పట్టా పొందిన ఆయన ఆ తరువాత మద్రాస్ అగ్రికల్చరల్ కాలేజీల్లో చేరారు. అగ్రికల్చరల్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన తరువాత ఢిల్లీ లోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐఎఆర్‌ఐ)లో పీజీ చదివారు. ఆ తరువాత యూపీఎస్సీ పరీక్షరాసి, ఐపీఎస్‌కు అర్హత సాధించారు. కానీ ఆ అవకాశాన్ని విడిచిపెట్టి యునెస్కో ఫెలోషిప్‌తో నెదర్లాండ్స్ లోని అగ్రికల్చరల్ యూనివర్శిటీలో చేరారు. అక్కడ బంగాళా దుంప జన్యు పరిణామాలపై అధ్యయనం చేశారు. అక్కడి నుంచి కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌లో చేరి, పీహెచ్‌డీ పూర్తి చేశారు. కొంతకాలం అక్కడ పనిచేసి 1954లో భారత్‌కు తిరిగి వచ్చి ఐఎఆర్‌ఐలో శాస్త్రవేత్తగా రీసెర్చ్ కొనసాగించారు. 197279 మధ్య ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చి డైరెక్టర్ జనరల్‌గా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, ఎడ్యుకేషన్ సెక్రటరీగా వ్యవహరించారు. 1979 లో కేంద్ర ప్రభుత్వం ఆయనను వ్యవసాయ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది.
భారత్‌లో హరిత విప్లవానికి నాంది పలికి…
భూములకు నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించి, యాంత్రీకరణను ప్రవేశ పెట్టి, రసాయనిక ఎరువులను , క్రిమిసంహారక మందులను వాడి, సంకర జాతి వంగడాలతో స్వల్పకాలంలో అధిక దిగుబడిని సాధించే విధానాలు అనుసరించడం మొదలు పెట్టడాన్ని హరిత విప్లవం (గ్రీన్ రివల్యూషన్) అంటారు. ఇది తొలిసారి మెక్సికోలో 1945 లో ప్రారంభమైంది. పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి మెక్సికో ప్రభుత్వం వివిధ రకాలైన గోధుమ వంగడాలను అభివృద్ధి చేసింది. మెక్సికోలో నార్మన్ బోర్లాగ్ నేతృత్వంలో సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్ ఈ విప్లవాన్ని ఇతర దేశాలకు విస్తరించడానికి నిర్ణయించింది. ఇదే సమయంలో 1960లో భారత్ తీవ్ర కరువు పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు కేంద్ర వ్యవసాయ సలహాదారుగా ఉన్న స్వామినాథన్… మెక్సికో హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్‌ను దేశానికి ఆహ్వానించారు. ప్రభుత్వ పరంగా ఇబ్బందులున్నప్పటికీ, మెక్సికో ప్రయోగశాల నుంచి గోధుమను దిగుమతి చేసుకుని ప్రయోగాత్మకంగా పంజాబ్‌లో పండించారు. అవి మంచి దిగుబడి రావడంతో భారత్‌లో హరిత విప్లవానికి నాంది పలికినట్టయింది. అందువల్లనే స్వామినాథన్‌ను భారత హరిత విప్లవ పితామహుడిగా అభివర్ణిస్తారు.