Wednesday, January 22, 2025

నిఖిలేశ్వర్ సాహిత్య సంగమంలో దిగంబరులు

- Advertisement -
- Advertisement -

ప్రముఖ విప్లవ కవి శ్రీ నిఖిలేశ్వర్ రెండు రచనలు నిఖిల లోకం (ఆత్మకథ), సాహితీ సంగమం అనే పుస్తకాల ఆవిష్కరణ 13-/08-/2023 న హైదరాబాదులో జరిగింది. 11 ఆగస్టున 85 సంవత్సరాలు పూర్తి చేసుకుని 86వ పడిలో ప్రవేశించిన ఆ సీనియర్ కవికి జన్మ దిన శుభాకాంక్షలు. అగ్నిశ్వాస లతో కాలాన్ని అధిగమించి, తన రచనలలో యుగ స్వరాన్ని వినిపిస్తున్నందుకు అభినందనలు. దాదాపు ఆరు దశాబ్దాలకు పైగా రచనా రంగం లో క్రియాశీలంగా రాణిస్తూ, స్ఫూర్తిదాయకమైన సాహిత్య సృజన కొనసాగిస్తూ వుండటం చాలా అభినందనీయం, మరీ ముఖ్యంగా తాను ఏర్పరచుకున్న ప్రజానుకూల సాహితీ సాంస్కృతి కోద్యమ లక్ష్యాల కనుగుణం గా సుదీర్ఘకాలం ఆ కలం కవితాయానం కొనసాగిస్తున్నది. ఒకే జాతి, ఒకే సంస్కృతి, ఒకే జీవనవిధానం అంటూ భారత దేశం లోని వైవిధ్యభరిత సంస్కృతీ వికాసాన్ని పాలకులు గుర్తించ నిరాకరిస్తున్న నేటి కాలంలో నిఖిలేశ్వర్ లాంటి ఆలోచనా పరులైన కవుల జీవితం, కృషి, యువతరానికి ఆదర్శప్రాయం గాను, ఆలోచనాత్మకం గాను ప్రేరణ కల్పిస్తుంది. ఆయన జీవిత కథలోని అనేక భాగాలు పరోక్షంగా నేటి సమాజానికి కర్తవ్యాన్ని గుర్తు చేస్తాయి.
నీ స్నేహితుల గురించి చెప్పు, నీవు ఎలాంటి వాడివో నేను తెలుసు కుంటాను అని మనం ఒక నానుడి తరచుగా వింటూ ఉంటాము. 1960ల నుంచి తనకు తారసపడిన రచయితలు, కళాకారులు, సామాజిక ఉద్యమ కా ర్యకర్తలు, ప్రముఖ వ్యక్తులలో కొందరు పరిచయ స్థులుగా మిగిలారు, కొందరు సన్నిహితులయ్యారు. కొందరు స్నేహితులయ్యారు ఆత్మీయులయ్యారు. కొందరు మార్గదర్శకులయ్యారు. అలాంటి 35 మంది వ్యక్తుల గురించి శ్రీ నిఖిల్ వివిధ సందర్భాలలో రాసిన వ్యక్తిత్వ పరిచయాలు, స్నేహపూర్వక పరామర్శలను ఇప్పుడు గుది గుచ్చి ‘సాహితీ సంగమం’ అన్న పుస్తకంగా డాక్టర్. డి. చంద్రశేఖర రెడ్డి గారి సంపాదకత్వంలో ఎమెస్కో ప్రచురణగా వెలువరించారు. ఇది ఒక ప్రణాళికా బద్దమైన రచన కాదు. అనేక వ్యాసాలు ఆయా వ్యక్తులకు నివాళిగా రాసినవి.

కొన్ని ఆ వ్యక్తుల జీవితాలలోని ప్రత్యేక సందర్భాలకు ప్రతిస్పందించి అభినందన పూర్వకంగా రాసినవి. అందువల్ల ఈ వ్యాసాలు సమగ్రమూ కావు, సర్వగుణ దోష విచారణలూ కావు. నిఖిలేశ్వర్‌కు ఆయా వ్యక్తుల పట్ల వున్న స్నేహమూ, గౌరవమూ, అభిమాన మూవ్యక్త పరచుకున్న సందర్భాలు మాత్రమే. ఆ పుస్తకం నుండి దిగంబర కవితోద్యమానికి సంబంధించిన విషయాలు మాత్రమే ఈ వ్యాసంలో ప్రస్తావిస్తున్నాను. తన సహచరుల గురించి నిర్మొహమాటంగా, నిర్మోహంగా, నిష్కల్మషంగా, నిజాయితీగా నిఖిలేశ్వర్ చెప్పిన అంశాలు ఉన్నాయి ఈ వ్యాసాల నిండా. మనం వాటిని నిస్సంశయంగా వాస్తవ చరిత్రగా స్వీకరించవచ్చు. మనకు తెలిసిన చరిత్రలో వ్యక్తుల పాత్ర గురించి తెలియని ఒక తెలివిడి పెరుగుతుంది ఈ పుస్తకం చదివితే. 1965-68 మధ్య దిగంబర కవులు మూడు కవితా సంపుటాలు వెలువరించారు. ఆ కవితలను దిక్కులు అని పిలిచారు.

అంతకుముందు కె. యాదవరెడ్డి గా అనేక రచనలు చేసినప్పటికీ ఆరుగురు దిగంబర కవులలో ఒకరిగా నిఖిలేశ్వర్ ప్రత్యేక ప్రస్థానం మొదలయ్యింది. ఆ అరుగురిలో శ్రీ నిఖిలేశ్వర్, నగ్నముని మాత్రమే నేడు జీవించి వున్నారు. మిగిలిన నలుగురు- చెరబండరాజు, మహా స్వప్న, జ్వాలాముఖి, భైరవయ్య. వారు గతించిన సందర్భాలలో వారి గురించి, వారి కవితల విశేషాల గురించి, దిగంబర కవితోద్యమంలో వారి పాత్ర గురించి నిఖిలేశ్వర్ క్లుప్తంగానే అయినా సాధికారంగా, ఆర్ద్రంగా నమోదు చేశారు. సమిష్టి గాన మైన దిగంబర కవుల్లో ఎవరి కవితా శైలి వారిదే, వ్యక్తీకరణలో ఎవరి బలం, బలహీనతలు వారివే అని నిక్కచ్చిగా చెప్పారు. అగ్నిశిఖలు-మంచు జడులు కవిత్వంగా కురిపించిన కమ్మిశెట్టి వెంకటేశ్వర రావు కాలం వాయులీనం మీద కమానునై, చరిత్ర నిద్రా సముద్రంపై తుఫానునై వస్తున్నాను అని ప్రకటించి మహాస్వప్నగా మారినప్పటికి, జీవన శైలి, నైరాశ్యం, నిర్లిప్తత మూలంగా కవిత పరంగా ఆగిపోయా డు. అవివాహితునిగా మిగిలిపోయి,

వ్యవసాయం చేసుకుం టూ 2019లో మరణించారు. కైవల్య పేరుతో రాత్రి సంపుటిలో కవితలు వెలిగించిన మన్మోహన్ సహాయ్ గుండెల తీరాన్ని కొట్టుకునే సహజమైన భావాన్ని వొడుపుగా పట్ట డం, నిజాన్ని నిజంగా నగ్నం గా చెప్పడం కోసం దిగంబర కవి భైరవయ్యగా మారాడు. ఈ ప్రపంచం అయోమయంలో లయ మవుతుందని, ఈ జీవితమే ఒక మిస్టరీ అని భావించే అతను చివరికి సన్యాసాశ్రమం పుచ్చుకున్నాడు. భైరవానంద స్వామి గా 19-/12-/ 2019 న తనువు చాలించాడు.
మిగిలిన నలుగురు నక్సల్బరి, శ్రీకాకుళ గిరిజన, రైతాంగ సాయుధపోరాటాల స్పూర్తితో విప్లవ కవులుగా రూపాంతరం చెంది 1970లో ఏర్పడిన విరసం లో లయ మయ్యారు. ఈ ఆరుగురిలో ముందుగా మరణించింది శ్రి చెరబండరాజు. విరసం భావధారను అందిపుచ్చు కుని అనేక అజరామర ఉద్యమ గీతాలను రాసి బొట్టు బొట్టుగా నా నెత్తుటిని ఈనేల విముక్తి కోసం విత్తనంగా చల్లుతాను అని తపించిన

ప్రజాకవిగా చిరకాల యశస్సును ఆర్జించాడు ఆయన. ‘మా నెత్తురు కంకరగా ప్రాజెక్టులు కట్టినం’ అనే శ్రామిక వాస్తవాన్ని అమరం చేశాడు. నిఖిలేశ్వర్ కంటే వయసులో చిన్నవాడు, చిన్ననాటినుండి తెలిసిన బద్దం భాస్కర్ రెడ్డి, చెరబండ రాజుగా వందేమాతర గీతం వరస మార్చి, చివరకు మెదడు ట్యూమర్ తో 6 సంవ త్సరాలు బాధపడి 38 ఏళ్లకే మరణించాడు. స్పృహ వున్నంతవరకు విప్లవ చైతన్యంతో జీవించి, ప్రతి పాట తో ఎదిగి నాకు సీనియర్ అయ్యాడు అని తన బాల్య స్నేహితునికి ఎంతో ఆర్తితో వినమ్రంగా నివాళి అర్పించారు నిఖిలేశ్వర్.

ఇక 1991 లో గుండెకు ఆపరేషను జరిగినా, గుండెను గాండీవి గా చేసుకుని ఆవిశ్రాంతం గా, నిరంతర సంచారిగా విప్లవ చైతన్య ప్రసారం గావిస్తూ, 2008 డిసెంబరులో లివర్ వ్యాధి తో మరణించిన జ్వాలాముఖి (ఏ. వి. రాఘవాచారి) తో నిఖిలేశ్వరుకు ప్రత్యేక అనుబంధం సాహిత్యోద్యమం లో జ్వాల-నిఖిల్‌జంట ను విడదీసి చూడలేని పరిస్థితి వుండేది. వ్యక్తిగత జీవితంలోనూ వారి కుటుంబాలు అంతే దగ్గరగా వుండేవి. ఆ కలం యోధుడు, మహావక్త గురించి నిఖిల్ అనేక సందర్భాలలో రాశారు. ఈ సంపుటి లోని రచనలో తమ అర్ధశతాబ్ది స్నేహాన్ని తలచుకుంటూ జ్వాల పలు సంస్థలతో కలిసి, పలుకోణాలలో సాగించిన ఉద్యమ కృషిని వివరించారు. అక్షరం పదునెక్కితేనే కవిత్వం. రాజ్యాన్ని నిలదీస్తే నే రచన పరమా ర్థం అని విశ్వసించిన జ్వాలాముఖి లక్ష నక్షత్రాలు రాలందే ఉజ్వల ఉదయం ప్రవహిం చదు అని ఒక క్రియాశీల కవిగా అలుపెరగని కృషితో ప్రజాఉద్యమాల వెంట నడిచిన వాడు.

ఆయన కొత్త తరాలకు తిరుగు బాటు వేదాంతం కవిగా మిగిలిపోయాడు అని నిఖిల్ తన మిత్రునికి శ్రద్దాంజలి ఘటించారు. తనతో పాటు జనారణ్యంలో జీవిస్తున్న నగ్నముని తో గల సంబంధాన్ని స్నేహ పుస్తకం పుటలు తెరిచి మన ముందు పరిచారు స్వల్ప భేదాభిప్రాయాలతో సహా.విరసం ఆవిర్భావం తరువాత, విరసంలో చేరి కూడా దిగంబర కవుల ఐడెంటిటీ కోల్పోకూడదని నగ్నముని భావించినట్లు నిఖిలేశ్వర్ రాశారు. అలాగే దిగంబర కవుల సంపుటాల ప్రచురణకు కావలసిన సొమ్ము ఆయనే ముందుగా చొరవ చేసి అప్పుచేసి డబ్బు తెచ్చి ప్రెస్ పనులు చూసే వాడని, తాము ప్రూఫులు చూసే వాళ్ళమని తన జ్ఞాపకాలు పంచుకున్నారు నిఖిలేశ్వర్ . దిగంబర కవులకు నాయకుడు లేడు నగ్నముని వారికి రధసారధి అనో ప్రయోక్త అనో చెప్పడం సరైనదికాదు, అది ఒక సమిష్టి కృషి అని నిఖిలేశ్వర్ విస్పష్టంగా చెబుతున్నారు. విరసంలో క్రియా శీలంగా లేకున్నా ఆధునిక తెలుగు కవులలో ఒక ప్రత్యేక స్థానం వుందని భావిస్తున్నారు నిఖిలేశ్వర్.

2016 లో కూడా తెనాలిలో దిగంబర కవులు మూడవ కూర్పు ను ఆవిష్కరించడం ఆసభలో నిఖిలేశ్వర్, నగ్నముని, మహా స్వప్న పాల్గొనటం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు.1968 నాటికి మూడు సంపుటాలు వెలువడగా మహాకవి శ్రీశ్రీ దిగంబర కవులందరికి కలిపి ఒక ఉత్తరం వ్రాస్తూ.. మీరు ప్రత్యేక వ్యక్తిత్వాలను సంహరించుకుని ఒకే ఒక సమిష్టి వ్యక్తిత్వాన్ని సాధించారు. అది.. మీరు.. సాధించిన విజయం. మీ దిక్కు మాలిన ఘోష తో దిక్కుల్ని దద్దరిల్ల జేస్తున్నారు అని రాశారు. ఇక దిగంబరకవుల సంచాలకుడు సుబ్రహ్మణ్యం గారి గురించి నివాళి పలుకుతూ మా ఆరంభం, వికాస పరిణామానికి ఆయన అద్దె ఇల్లు ఒక ఆశ్రయం. దివారాత్రులు కొన్నేళ్ళు మా చర్చలకు ఆయన అబిడ్స్ ఇల్లు- సెంట్రల్ పాయింట్- ఒక చిరునామా. ఆయన లో ప్రొఫైల్ లో వుంటూ ఎక్కడా రాజీ పడకుండా తన అభిప్రాయాలు వినిపించేవాడు అని ఆత్మీయంగా తలచుకున్నారు.

సుబ్రహ్మణ్యంగారు స్వయంగా కవి వుయ్ ఆర్ ద నేషన్ ఆఫ్ కవరడ్స్ అని ఆంగ్ల కవితల సంపుటి వెలువరించారు. రాడికల్ హ్యూమనిజం నుండి మార్క్సిజం వైపు అడుగులు వేసినవాడు. ఆయనతో తమ అను బంధం అక్షరాల అవినాభావమే అని, తరువాత ఆయన వో.పి.డి.అర్ కార్యవర్గ సభ్యునిగా ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకై కృషిచేశారు అని నిఖిలేశ్వర్ స్నేహంతో ఆయనను గుర్తు చేసుకున్నారు . ఇక ఏడవ దిగంబరకవి అని కొందరు భావించేటంత గా వీరితో సన్నిహితత్వం, స్నేహం గల మరో వ్యక్తి శ్రీ కె. కె. రంగనాధాచార్యులు. జ్వాలాముఖి ఆయన ఒకే ఆవరణలో పెరిగిన చిన్ననాటి స్నేహితులు. సదా కలిసి తిరిగినవారు, అందువల్ల నిఖిలేశ్వర్ కు కూడా అతి దగ్గర స్నేహితుడయ్యారు.హేతువాద, మార్క్సిస్టు చింతనతో విమర్శనారంగం లో శిఖరంగా నిలిచినవాడు. భాషాపరంగా మరో చూపునిచ్చినవాడు. తమిళ వైష్ణవ బ్రాహ్మణ కుటుంబం లో పుట్టి పెరిగినప్పటికి, ఆలోచనలో ఆధునికత ను అలవరచుకుని, విద్వత్తుచే పరిశోధ నా రంగంలో విద్యార్ధులకు మార్గ దర్శకునిగా

నిలిచినవాడు.ఆయన నుంచి భాష,సంస్కృతి , ఆధునికతల గురించి ఎంతో నేర్చుకున్నాను. 57 సంవత్సరాల స్నేహం తాత్విక అనుబం ధం తో ఆత్మీయ అనుబంధంగా మారిపోయిందని -అయితే దిగంబర కవులకు ఆంతరంగిక మిత్రునిగా వున్న ఆయన విరసానికి బాహ్య మిత్రుని గా ఉండిపోయారని ఆ ‘సమాంతర సాహిత్య వేదిక’ గురించి నిఖిలేశ్వర్ వివరించారు.
అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, చెరబండరాజు లపై 1971 లో పి.డి. యాక్ట్ కేసుపెట్టి అరెస్టు చేశారు. దిగంబర కవుల ఉద్యమాన్ని ప్రారంభించిన వాళ్ళ లో నీవు ఒకడవు… నువ్వు రాసిన భయం అనే కవిత ద్వారా వర్గపోరాటాన్ని రెచ్చగొట్టావు పోరాటంలో నిర్భయంగా మృత్యువును ఎదుర్కోమని ఉద్బోధించావు వంటి ఆరోపణలు నిఖిలేశ్వర్ పై చేశారు. 20/-09/-71 నాటి కోర్టు విచారణలో ఆరోపణలు ఎదుర్కొన్న ముగ్గు రు కవులు మొదటిసారిగా కోర్టులో తమ కవితలు చదివి వినిపించారు. కిక్కిరిసిన కోర్టు హాలులో కరతాళధ్వనులు మోగాయి.

విశ్వాసాలు నియంత్రణకు లోను కావు, విశ్వాసాల మూలంగా ఎవ్వరినీ నిర్బంధించ రాదు అని తీర్పునిచ్చి భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడి న్యాయమూర్తి జస్టిస్ చిన్నప రెడ్డి ఆ కేసును కొట్టివేశారు. కలాలకు సంకెళ్ళు లేవు అనే ఉత్తేజాన్ని నింపిన ఆ తీర్పు నేడు గుర్తుచేసుకోవడం అవసరం. రచయితలు, కార్యకర్తలు ఉపా చట్టాల కింద జైళ్ళలో మగ్గుతున్న నేపధ్యంలో, ఆలోచించే బుర్రలే ఎక్కువ ప్రమాద కరమని తీర్పులిస్తున్న సందర్భంలో ఆ తీర్పు ఎంతో స్పూర్తిని ఇస్తుంది. విప్లవం అనేది ఒక దేశం, జాతి జీవితంలో అత్యంత సమగ్రమైన, అన్ని రంగాలను ఆకళింపు చేసుకుని నడిపించే జీవ చైతన్యం. రాజకీయ, ఆర్ధిక రంగాలతోపాటు సాహిత్య సాంస్కృతిక దిశలో ఒక శాస్త్రీయ అవగాహన వున్నపుడే విప్లవం సమగ్రమవుతుంది అని నిఖిలేశ్వర్ అంటారు . ఆ అవగాహన పెరగటానికి ఈ చిన్న పుస్తకం తోడ్పడుతుంది. నిఖిలేశ్వర్ ఎవరి సాంగత్యంలో వున్నారు? ఎవరితో కలిసి వివిధ ప్రజాసంఘాలలో పనిచేశారు?

వారి ఆలోచనా క్రమం ఏ పరిణామాలు చెందుతూ వచ్చింది? అనే విషయాలు కూడా పరోక్షంగా ఈ సంగమం తెలియ జేస్తుంది. ఆయన తన అభి ప్రాయాలను నిక్కచ్చిగా చెప్పారు. ఎన్నో ఆసక్తికర విషయాలు సాహిత్య సంగమం లో ఉన్నాయి. అయితే ఒక కాల క్రమం గానీ, విశేష ప్రాతిపదికపై విభజన కానీ లేక పోవటం వల్లనూ, కొందరి విషయంలో రచనా సందర్భం ఏమిటో తెలియకపోవటం వల్లనూ పాఠకునికి కొంత అసౌకర్యం అనిపిస్తుంది అయినప్పటికీ సాహితీ ప్రియు లందరూ చదవ తగ్గ పుస్తకం సాహితీ సంగమం. సామాజిక, సాంస్కృతిక, సాహిత్య అంశాల సంగమం ఇది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News