Monday, December 23, 2024

సాహిత్య సామ్రాట్ అన్నా భావ్ సాఠే

- Advertisement -
- Advertisement -

భారతదేశానికి స్వాతంత్య్రం ఏర్పు్డతున్న్ సమయంలో, ఆ తర్వాత కూడా దేశీయులచే కాకుండా విదేశీయులచే కూడా ‘అన్నా’ అని అందరిచే పిలవబడిన ఏకైక భారతీయుడు అన్నా భావ్ సాఠే. తుకారాం భౌరావ్ సాఠే మహారాష్ట్రకు చెందిన ఒక సంఘ సంస్కర్త , జానపద కవి, రచయిత. తమాషా ప్రదర్శనలలో కుల సభ్యులు సాంప్రదాయ జానపద వాయిద్యాలను వాయించేవారు. అన్నాభావ్ సాఠే సాధారణ విద్యార్థులు లాగా పాఠశాలకు వెళ్లి ప్రాథమిక విద్యాభ్యాసం చేయనప్పటికీ జీవితమనే పాఠశాలలో విద్యార్థిగా చేరి జీవితానుభవాల ద్వారా ‘అక్షర జ్ఞానం అనేది అన్ని సమస్యలకు ఒక ముఖ్యమైన విరుగుడు’ అనే ముక్తాబాయి సాల్వే మాటలను ప్రేరణగా తీసుకోని, మహాభారతంలోని ఏకలవ్యుడిలాగా ఇష్టం తో కష్టపడి అక్షరజ్ఞానీ అయ్యి దళిత సాహిత్యానికి తండ్రిగా ప్రసిద్ధి పొందడం జరిగింది (మరాఠీ). 1931లో సతారా నుండి బొంబాయి, ప్రస్తుత ముంబయికి, ఆరు నెలల పాటు కాలినడకన, గ్రామీణ ప్రాంతంలో కరువు కారణంగా వలస వెళ్ళాడు. బొంబాయిలో, సాఠే బేసి ఉద్యోగాల శ్రేణిని చేపట్టాడు.

బహుముఖ ప్రజ్ఞశాలి అయిన అన్నా భావ్ సాఠే అసలుపేరు ’ తుకారాం భావ్‌రావ్ సాఠే’. భారతదేశంలోని అతిప్రాచీన కులాలలో ఒకటి అయిన ’మాంగ్’ కులంలో, వాలుబాయి- భావురావ్ సిద్దోజి సాఠే అనే దంపతులకు వాటేగావ్ అనే గ్రామంలోని మాంగ్ వాడా యందు 01.08.1920 రోజున జన్మించారు. ఇది ప్రస్తుతం మహారాష్ట్రలోని వాల్వా మండలం, సాంగ్లీ జిల్లా కిందికి వస్తుంది. కులవివక్ష వలన అన్నా భావు గారు పాఠశాలలో చేరిన రెండవరోజే పాఠశాలను వదిలివేయడం జరిగింది. అతను తన పాఠశాల విద్యను పూర్తిచేయడానికి ముందే జీవితమనే పాఠశాలలో ప్రవేశం పొందడం జరిగింది. జీవిత అనుభవాలే అతని గురువు. అతను ఏమి నేర్చుకున్నాడో, తిరిగి సమాజానికి ఇవ్వడం జరిగింది. ఒకప్పుడు మాంగ్ కులస్థులు ’ గ్రామ సంగీతకళాకారులు’ గా కీర్తి ఘడించడం జరిగింది. అందువలన వంశపారంపర్యంగా కుల బంధువులు, కుటుంబ సభ్యులు నిర్వహించే ‘ తమాషా’ (నాటకం లాంటి నృత్య సంగీత ప్రదర్శన) ప్రదర్శనలలో చురుకుగా పాల్గొని, సాంప్రదాయ జానపద వాయిద్యాలు వాయించడం, పాటలు పాడటం నేర్చుకుకోవడం జరిగింది. మహారాష్ట్ర వాసుల ఆరాధ్య దైవం ’ విఠోబా ’ ను ప్రశంసిస్తూ గ్రామాలలో ప్రజలు ‘అభంగ్స్’ (భక్తి పాటలు) పాడేవారు. చిన్నప్పుడు అన్నగారు అభంగ్స్ ను లయబద్దంగా మంచి రాగంతో పాడడం నేర్చుకున్నారు. స్వాతంత్య్రమునకి పూర్వం పాటలు మరియు నృత్య ప్రదర్శనకు పేరుగాంచిన తమాషా ప్రజల వినోదానికి ప్రధాన మనోరంజక సాధనంగా ఉండెను. యుద్ధకళలను ప్రదర్శించడానికి ఉపయోగించే కత్తి, ఈటె, బాకు, దాండ్ పట్టా, కర్ర స్వాము మొదలగు ఆయుధాలను ఉపయోగించడంలో ప్రావీణ్యం సాధించి, ఈ యుద్ధ కళను తన తమాషాలకు జోడించి, దానిని బహుళ ప్రాచుర్యంలోకి తీసుకొనిరావడంలో విశేషకృషి చేయడం జరిగింది. స్వాతంత్య్ర పోరాట వీరుడు క్రాంతివీర్ నానా పాటిల్ ప్రభావం వలన 10 సంవత్సరాల వయస్సులో స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనడం జరిగింది.

అంతలోనే మహారాష్ట్రలో తీవ్ర కరువు కాటకం సంభవించింది. బ్రతుకుతెరువు కోసం, 1931 సంవత్సరంలో భావురావు గారు తన కుటుంబాన్ని బొంబాయికి మార్చాలని నిర్ణయించడం జరిగింది. ఆర్థిక కారణాల వలన వాటేగావ్ నుంచి బొంబాయ్ కి మధ్య గల 255 కిలోమీటరు దూరంను నడుస్తూ వెళ్లాలని నిర్ణయించడం జరిగింది. మొత్తం ప్రయాణ కాలం రెండు నెలలు. ప్రతి ఊర్లో ఆగుతూ కడుపు నింపడం కోసం వివిధ పనులు చేస్తూ, వారి ప్రయాణం సాగింది. ఈ ప్రయాణం ఏమి సుఖంగా లేదు. మార్గంలో ఎన్నో అవమానాలు, కష్టాలు, చేదు అనుభవాలు ఉన్నాయి. అందులో ఒకటి, ఒకరోజు అందరు ఆకలితో అలమటిస్తూ ఉండంగా, దారి పక్కన ఉన్న ఒక మామిడి చెట్టు కనిపించింది. పండిన కొన్ని మామిడి పండ్లను ఆ చెట్టు నుంచి తెంపుకున్నారు. అంతలోనే చెట్టు యజమాని అక్కడికి రావడం జరిగింది. అన్నా గారు తెంపిన మామిడి పండ్లను తిరిగి ఇవ్వజూపిన, ఆ యజమాని తీసుకోవడానికి నిరాకరించి, ఎక్కడినుంచి ఆ పండ్లను తీశారో అక్కడ అలానే అతికించి పెట్టాలని బలవంతం చేయసాగారు. ఎంత బ్రతిమాలిన, క్షమించమని అడిగిన అతను వినలేదు. చాలా అవమానాలు భరించాల్సి వచ్చింది. ఎలాగోలా ఆ సమస్య నుంచి బయటపడం జరిగింది. చివరకు వారు బొంబా యి పట్టణానికి చేరుకోనున్నారు.అంటరానివారు అని వారికీ ఎవరు కూడా గ్రామాలలో పని ఇవ్వలేదు. కానీ బొంబాయి పట్టణంలో పనికి కొరత లేదు. కుటుంబ పోషణ కోసం, తల్లిదండ్రులకు సహాయంగా అన్నా కూడా వివిధ రకాల పనులు చేశా రు. బొంబాయిలోని ఒక సినిమా ప్రదర్శన థియేటర్ కు డోర్ కీపర్ గా పని చేయడం అన్నా జీవితమును మార్చేసింది. అతనికి సినిమాలపై ఆసక్తిని పెంచింది. చివరకు అతనికి చదువుపై మళ్ళీ మమకారంను పెంచింది. వివిధ రకాల దుకాణాలు, హోటల్ మరియు సినిమా పోస్టర్లపై ఉన్న అక్షరాలను చదవడానికి ప్రయత్నం చేసి, చదవడం, రాయడం నేర్చుకున్నారు.
అన్నాగారు 1944 సంవత్సరంలో తన ఇద్దరు సహచరులు సహకారంతో ‘లాల్ బావతా కళాపాథక్’ ( రెడ్ ఫ్లాగ్ కల్చరల్ స్క్వాడ్ ) అను కొత్త తమాషా బృందంను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు స్వేచ్ఛ కోసం సిద్ధంగా ఉండాలని, వారి హక్కుల కోసం పోరాడాలని పిలిపు ఇవ్వడం జరిగింది. తన పాటలు, మాటలతో ప్రజలను ఉర్రుతలూగించడం వలన, ప్రజలు అతనిని ’ లోక్ షాహిర్ ’ అని పిలవడం మొదలు పెట్టారు. కొంతకాలం తర్వాత ప్రభుత్వం తమాషాలను నిషేధించింది. అతను తన ఆలోచనలకూ వాహకంగా జానపద పాటలను ఉపయోగించడం ప్రారంభించారు. లాల్ బావతా కోసం రాసిన నాటకాలను ’లావని’ (మహారాష్ట్రాలో ప్రసిద్ధిగాంచిన సంగీత నృత్య ప్రదర్శన) మరియు ’పోవాడా’ (వివిధ సంగీత వాయిద్యాలు వాయిస్తూ జానపద పాటలు పాడడం) రూపంలోకి మార్చడం జరిగింది. రష్యా విప్లవం విజయ గాథను వివరిస్తూ అన్నా ’ స్టాలిన్ గ్రాడ్’ అను నాటకాన్ని రాశారు. ఇది రష్యా భాషలోకి అనువదించబడింది. అన్నా కీర్తి విదేశాలకు కూడా చేరింది. తర్వాత దీనిని కూడా పోవాడా రూపంలోకి మార్చడం జరిగింది.

1947, ఆగస్టు 15 రోజున భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు, గ్రామాలలో పేదరికం, కుల వివక్ష, భూస్వాముల దోపిడీ ఎలా ఉందొ, పట్టణాలలో కూడా పారిశ్రామికీకరణ, యాంత్రీకరణ వలన ధనికుల పేదల మధ్య అంతరం అలానే ఉందని, ఒక భారీ ర్యాలీ నిర్వహించి ’ ఏ ఆజాది ఝూటి హై, దేశ్ కి జనతా భుకి హై ’ అనగా ఇది నిజమైన స్వాతంత్య్రం కాదు, ప్రజలందరూ ఆకలితో అలమటిస్తున్నారు, ప్రజలందరూ ఆకలితో బాధపడని రోజే నిజమైన స్వేచ్ఛ స్వాతంత్య్రం అని చెప్పారు. స్వాతంత్య్రం అనంతరం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావం సమయంలో సంయుక్త మహారాష్ట్ర ఉద్యమం ద్వారా ’బొంబాయి’ రాజధానిగా మహారాష్ట్ర ఏకీకరణలో ప్రముఖ పాత్ర వహించడం జరిగింది. అన్నా భావు తన జీవితకాలంలో నవలలు, చిన్న కథల సంకలనాలు, నాటకాలు, లావని, పోవాడా వంటి దాదాపు 100కుపైన రచనలు చేయడం జరిగింది. అన్నా 1961 సంవత్సరంలో రష్యాను సందర్శించగా, ఆ ప్రయాణ అనుభవాలను ‘ మాజా రష్యా చా ప్రవాస్ ‘ అను పుస్తకం రూపంలో తీసుకోని రావడం జరిగింది. విదేశీ ప్రయాణం, వాటి అనుభవాలు రాసిన మొదటి ఎస్సి వ్యక్తి అన్నా మాత్రమే. అన్నా రచనలు భారతీయ భాషలలోని కాకుండా విదేశీ భాషలలోకి కూడా అనువదించబడ్డాయి. రష్యన్, ఫ్రెంచ్, జర్మన్, చెక్, ఇంగ్లీష్, స్పానిష్ మొదలగు (27 ) భాషలలొకి అన్నా రచనలు అనువదించబడడం వలన వారి కీర్తి విదేశాలకు కూడా ప్రవహించింది.

అన్నాగారు మొదట్లో కమ్యూనిజం భావాల వైపు ఆకర్షితులై, ఆ తరవాత బాబాసాహెబ్ గారి భావజాలం వైపు మ్రొగ్గుచూపి, అణగారిన వర్గాలను, అంటరాని తరగతులను చైతన్యపరిచే రచనలు గావించి, కమ్యూనిస్ట్ నుంచి అంబేద్కరిస్టుగా మారడం జరిగింది. అన్నా రచనలలో శ్రేష్టమైనది ’ఫకీరా’ అను నవల. ఇది మాంగ్ కులానికి చెందిన విప్లవకారుడి శౌర్యంను తెలుపు కథ. అన్నా భావు గారు ఈ నవల ద్వారా మాంగ్, మహార్ కులాల ఐక్యతను నొక్కి చెప్పడం జరిగింది. అంటరాని కులాల కోసం విశేష కృషిచేసిన డాక్టర్ బాబాసాహెబ్ కి ఈ నవలను అంకితం చేయడం జరిగింది. అన్నా భావు రచించిన అనేక నవలలు, కథల ఆధారంగా చలన చిత్రాలు (సినిమాలు) నిర్మించబడ్డాయి మరియు ఇప్పటికీ నిర్మించబడుతూనే ఉన్నాయి. ఇటీవల ’అగ్నిదివ్య ’ నవల ఆధారంగా ’రావ్ రంభ ’ అనే నూతన మరాఠీ చిత్రం మే 26 న (2023 ) విడుదలైంది. మొట్టమొదటిసారిగా ఎస్సి కులాల రచయితల ఆధ్వర్యంలో 1958 సంవత్సరంలో బొంబాయిలో అన్నా భావు సాఠే గారి అధ్యక్షతన ’ మొదటి దళిత సాహిత్య సమ్మేళనం’ ను నిర్వహించడం జరిగింది. ఈ సాహిత్య సమ్మేళనం ప్రారంభ ప్రసంగంలో అన్నా గారు ‘ ఈ భూమి అనేది శేష్ నాగ్ అను పిలవబడే పాము తలపై కాకుండా దళిత, శ్రామిక తరగతి ప్రజల బలం, శక్తి మీద సమతుల్యతతో ఉంది ‘ అని నొక్కి చెప్పడం జరిగింది. బహుముఖ ప్రతిభాశాలి అయిన అన్నా గారి సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం వారి జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంప్స్ జారీ చేయగా, మహారాష్ట్ర ప్రభుత్వం వివిధ కట్టడాలకు, సంస్థలకు వారి పేరు పెట్టడం జరిగింది. ఇటీవల మహాత్మాగాంధీ మెమోరియల్ విశ్వవిద్యాలయం వారికీ ‘డాక్టరేట్’ను ప్రధానం చేయ గా, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ చేతుల మీదుగా రష్యా రాజధాని నగరం ’మాస్కో’లో అన్నా విగ్రహం ఆవిష్కరించారు. పాఠశాల విద్యాభ్యాసం చేయకుండా సాహిత్య సామ్రాట్టుగా కీర్తించబడిన అన్నా భావుని, ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలో తన పార్టీ విస్తరణ సందర్బంగా, ’ మరాఠీ గోర్కీ’గా పిలిచారు. అన్నా గారు 48 సంవత్సరాల వయస్సులో 1969 సంవత్సరంలో జూలై 18 న క్న్నుమూశారు. ఆయ్న భౌతికంగా లేక్పోయినా ఆయ్న్ కీర్తి శాశ్వ్తంగా నిలిచిపోతుంది. మాంగ్ సమాజ్ ప్రజలతో పాటు దేశ విదేశాలలోని అన్నా భావు అభిమానులు, 54 వ వర్ధంతి సందర్బంగా ఏర్పాట్లు చేసి, ఘనంగా నివాళులు ఆర్పిస్తున్నారు.

-గాయక్వాడ్ తులసీదాస్ మాంగ్, 8106549807.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News