Wednesday, October 16, 2024

సామూహిక నిస్సహాయత

- Advertisement -
- Advertisement -

క్షమించు బాబా!
కడుపు నిండా దుఃఖం
గుండెల్నిండా ఆవేశం వున్నదే కానీ
నిస్సహాయులుగా వున్నాం

తీర్పులకీ న్యాయానికీ సంబంధం లేని దేశంలో
ఏ దిక్కు వెళ్ళాలో తెలిసినా బలహీనంగా వున్నాం
సాంస్కృతిక పక్షవాతంతో మెదళ్ళు
చచ్చుబడిపోయి వున్నాం
పెద్దగా కదల్లేకపోతున్నాం
మెదల్లేకపోతున్నాం
గొంతు విప్పలేకపోతున్నాం

ప్రజాస్వామ్యమంటే వేయి భావాలు సంఘర్షించి
వంద పూలని వికసింప చేసే
తోట కదా మరిదేంటి?
ఇనుపముళ్ళు వెదజల్లిన ఈ రక్కసి బాటలేంటి?
ధర్మగంటలకి చిలుం పట్టిందెందుకు?
న్యాయమంటే పేదవాడికి భరోసాగా కాకుండా
ఉన్నవాడి డైనింగ్ టబుల్ మీద
మెనూ కార్డ్‌గా మారిందేమిటి?

ఏమిటీ ఘోరం? ఈ శిక్షలేమిటి?
ఎన్ని ఉరితీతలకి సమానం అండా సెల్‌లో
చక్రాల కుర్చీతో ఏకాంతవాసం!
ప్రాణాల్ని పీల్చే శీతల వాయువుల దాడిలో
కాళ్ళు పట్టని కురచ దుప్పట్ల కింద
కదల్లేని బస్తా లాంటి దేహాన్ని
ఒంటి చేత్తో మోయాల్సి రావటం అదేం నరకం?

సముద్రమంత దుఃఖాన్ని
రెండంటే రెండు కళ్ళు ఎంతని చూపించగలవు?
అగ్నిపర్వతాల ఘోషని
ఒక్క కలం ఎంతని చెప్పగలదు?
పగలో రాత్రో తెలియనివ్వని ఇనుపగోడల మధ్యన
గడియారాలు చెప్పని కాలగమనాన్ని
మోయటం ఎంత దుర్భరం?

ఇది గజదొంగలు పడ్డ దేశం
వాళ్ళందరి నుండి నిన్నెలా రక్షించుకోవాలో
నిన్నెలా మిగిలించుకోవాలో
తెలియడం లేదు బాబా!

ఈ నిస్సహాయుల ఆత్మఘోష
నిన్ను రక్షించగల ఆయుధంగా మారితే బాగుండు

(జి.ఎన్. సాయిబాబా జైలులో
వున్నప్పుడు రాసిన కవిత)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News