ఐపిఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ బ్యాట్స్‌మన్ సాయి సుదర్శన్ చరిత్ర సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సుదర్శన్ 53 బంతుల్లో 82 పరుగులతో రాణించాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు కేవలం ఐదు మ్యాచ్‌ల్లోనే తన మూడో అర్ధ సెంచరీని నమోదు చేశాడు. ఈ క్రమంలోనే ఏ ఇండియన్ క్రికెటర్ సాధించని రికార్డును ఇప్పుడు సుదర్శన్ తన పేరుపై లిఖించుకున్నాడు. బుధవారం రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో RRతో జరిగిన మ్యాచ్‌లో సుదర్శన్ అర్ధ శతకం సాధించగా.. ఇది అతనికి వరుసగా ఐదవ యాభై+ స్కోరు.
ఈ సీజన్‌లో ఇది వరుసగా మూడవ యాభై+ స్కోరు. గత సీజన్‌లో రెండుసార్లు యాభై+ స్కోరు చేశాడు. ఐపిఎల్ లో ఒకే స్టేడియంలో వరుసగా ఐదుసార్లు యాభైకి పైగా పరుగులు సాధించిన తొలి ఇండియన్ క్రికెటర్ గా రికార్డు నెలకొల్పాడు. మొత్తం మీద రెండో క్రికెటర్ గా సుదర్శన్ అరుదైన ఘనత సాధించాడు. అహ్మదాబాద్‌లోని ఈ వేదికపై అతను 84 (ఆర్‌సిబిపై), 103 (సిఎస్‌కెపై), 74 (పిబికెఎస్‌పై), 63 (ఎంఐపై), 82 (ఆర్‌ఆర్‌పై) స్కోర్లు చేశాడు. కాగా, సుదర్శన కు ముందు, బెంగళూరులో ఎబి డివిలియర్స్ మాత్రమే ఈ భారీ ఘనతను సాధించాడు. 2018 నుండి 2019 వరకు బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో డివిలియర్స్ వరుసగా ఐదుసార్లు యాభైకి పైగా స్కోర్లు చేశాడు.
కాగా, మ్యాచ్ విషయానికి వస్తే.. రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 19.2 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. దీంతో గుజరాత్ 58 పరుగుల తేడాతో గెలుపొందింది.