Thursday, January 23, 2025

మొదట్లో అతన్ని చూసినప్పుడు

- Advertisement -
- Advertisement -

చెరువులో అలలు లానో, నదిలోని ప్రవాహంలానో, సముద్రంలోని కెరటాలవలెనో కనిపించలేదు. అనిపించలేదు. సాదాసీదాగా సైదా మంచినీళ్లలా కనిపించాడు. మరోసారి కలుసుకున్నప్పుడు రూపం దాల్చిన దాహంలా కనిపించాడు. దాహం తీర్చే, ప్రాణం నిలబెట్టే మంచినీళ్లలా కనిపించాడు.మరో సందర్భంలో అతను మాట్లాడినప్పుడు కొన్ని నిశ్శబాలు-శబ్దమై మాట్లాడినట్లు మాట్లాడేవాడు. దానితోబాటు ఆ శబ్దానికి ఒక అపురూపమైన పుష్పం చిరునవ్వులా అతని పెదవులపై విచ్చుకునేది. మరో సమయంలో తటస్థపడినప్పుడు అతను అతనుగా పైకి ఏమీ అనిపించడు. దిగుడు బావిలోకి దిగినట్టు, అతని ఉనికి లోపలికి వెళ్లి చూస్తే, లోపలి వాతావరణం ఒక్కసారిగా దిగ్భ్రాంతి కలిగి స్తుంది. అతనొక అద్భుతమని తెలుస్తుంది. అద్భుతమంటే- మనకు అరుదుగా ప్రకృతిలో సంభవంచే అద్భుతాల కోవకు చెందినది కాదిది.

సైదా ఆ స్త్రీని చూసి, తన్మయుడైనాడు. ఈ లోకాన్నీ మరచాడు. పిచ్చివాడయ్యాడు. ఆమెను చూసే చూపుకే భరించలేనట్లుగా అయిపోయాడు. అప్పటి నుండి ఆ స్త్రీయే అతనికి సర్వస్వం…/ ఆ స్త్రీని, ఆమెలోని స్త్రీత్వాన్ని అతను ప్రేమించాడా? ఆరాధించాడా? అర్పించుకున్నాడా?/ అతని దృష్టిలో ఆమె దేవతా? అధిదేవతా? అధిష్టాన దేవతా?

నేలనీ, నేలకిందినీ, ఆకాశాన్నీ, ఆకాశం పైనీ, విత్తునీ, విత్తులోని రెండు బద్దల పప్పునీ, చెట్టునీ, చెట్టుకింద విస్తరించిన వేళ్లనీ, ప్రకృతినీ, ప్రకృతిలోని సమస్తాన్నీ దాని మూలాన్ని, దృశ్యాదృశ్యాల్ని, చీకటి వెలుగుల పుట్టుకనీ క్షుణ్ణంగా, సమీపంగా దర్శించగల నగ్ననేత్రం కలిగినవాడు. అదే, ఆ మహాద్భుతం. ఆ మూలాన్ని తాను చూడడమేగాక, మనకూ దానిని దర్శన సాధ్యంచేయ్యడానికికొన్ని కవిత్వాలు యిచ్చాడు సైదా. ఒక్కొక్క కవిత తెరుచుకోడానికి, ప్రవేశానికి వీలుగా కొన్ని తాళం చెవులుకూడా యిచ్చాడు. / నిజానికి, యివన్నీ అతని ఆలాపనలోని భాగాలే. అతని ఆలాపన వయసు రెండు కవిత్వాల సంపుటాలు./ మొదటిది, ఓ ప్రకటన / ‘ఆమె నా బొమ్మ’. దీనిలో, నెమ్మదిగా నేలమీద విచ్చుకున్న రెక్కలతో, అంతరిక్షం వైపు టేకాఫ్ ప్రారంభమవుతుంది./ రెండోది- మనం వెళ్లే మరో లోకం గురించి వివరించేది- ‘నీలంమాయ’. ఆ మార్మికలోకం మూలాల గురించి చెప్పేది./ తమాషా- యివన్నీ మన మనసులోనిమరో వైపున వున్నాయి.

చంద్రుడికి మనకు తెలని రెండో వైపులాగా. ఇంతవరకూ ఎవరూ అటువైపు వెళ్లినట్లు లేదు. సైదా అటువైపు మనల్ని తీసికెడతాడు./ కొత్తలో అతని కవిత్వాలను ఆవరించి వుండే నిగూఢ వాతావరణం అర్ధంకావడం కష్టం./ అదీగాక, విమర్శకులుగా, విశ్లేషకులుగా చలామణీ అయ్యేవారిలో ఎక్కువమంది- కవితాత్వకత, కళాత్మకత, సృజనాత్మకత తెలిసినవారిని, వారి కులంతోనో, వర్గంతోనో, మతంతోనో, ప్రాంతంతోనో, అప్పటికే అరిగిపోయిన పదజాలంతోనో, తుప్పు పట్టినసిద్ధాంతాలతోనో, బూజుపట్టిన భావాలతోనో కొలవడానికి ప్రయత్నిస్తారు. దాదాపుగా అనేకమంది కవులు, రచయితలు వీరి చట్రంలో యిమిడిపోతారు. కొందరు యిమడరు. భజనకారులతో నిండిన యీ లోకంలో వీళ్ళు యిమడరు./ నిజమైన సజీవమైన సృజనకారులను అర్ధం చేసుకోవడానికి కొత్త ప్రమాణాలు నెలకొల్పాలి. సైదా సజీవ సృజనకారుడు./ సైదా నూత్న మనోనేత్రంతో మన మనసులోని మరోవైపున వున్న మార్మికలోకం తలపుల తలుపులు తెరుస్తాడు. ఆ లోకం చూడడానికి భౌతికనేత్రాలుచాలవు. మరో కాస్మిక్‌నేత్రం అవసరం. ఆ నేత్రాన్నికూడా అతనే యిస్తాడు. వీక్షకుడికి ఆ నేత్రాన్ని గురించి తెలిసి వుండాలి. ఎలా ఉపయోగించాలోకూడా తెలిసివుండాలి. లేకపోతే, అంతా కటిక చీకటి. ఆలోకమే గుడ్డిలోక మవుతుంది.

నా దృష్టిలో తల్లిగర్భంలో ప్రాణంపోసుకునే వాయువు యీ లోకానిది కాదు. భూకక్ష్యలోనిది కాదు. అంతరిక్ష ప్రాంతానికిచెందినది. సైంటిస్టులు ప్రాణవాయువు ఎక్కడ నుండి వస్తున్నదో తెలుసుకోవడానికి తీవ్రంగా యింకా ప్రయత్నిస్తూనే వున్నారు./ అంతరిక్షంనుండి ప్రసారమయ్యే ప్రాణవాయువు యీ లోకంలోని ప్రతీజీవిలోకి గర్భస్థదశలో ప్రవేశించి, జీవిని ఉ నికి లోకి తీసుకువస్తుంది./అంతరిక్షం కూడా దాటి, వేలకోట్ల యోజనాల దూరాన వుండే పాలపుంతల్లో దేనితోనో నివాసముంటూ మొత్తం సృష్టికార్య మూలాలను దర్శిస్తూ మనకు తెలియజేస్తున్నాడు. అందుకనే అతను నాకు సుదూర పాలపుంతల నివాసిగా కనిపిస్తున్నాడు. అతని కవిత్వంలో సంకేతాలుచాలా వున్నాయి. ముఖ్యంగా యోని సంకేతం ఒకటి. యోని పూర్తిగా భౌతికమైనది మాత్రమే కాదు, అధిభౌతికం కూడా. రోదసి అతని ప్రేయసి.

సైదా కవన యానానికై రెక్కలు విదిల్చి, నేలను విడిచి, రివ్వున లేవడానికి ముందు తనను తాను పరిచయం కోసం స్వీయ రేఖా చిత్రం చిత్రసంగీతంలా గీతలు గీస్తాడు. వ్యోమగానం అతని గానం./ ఆ చిత్రవిచిత్ర పదచిత్రాల్లో -/మెరుపులు, పిడుగులు, కుంభవృష్టి / స్త్రీ ఉరుష సంగమం, ఆమె తానై, ఆమే తానై / శరీర సరిహద్దులు దాటి, అర్థ నారై, అర్ధ పురుషై / రెండు లోకాలూ లీనమై, లయమై, విస్ఫోటనమై/ పురుషను ఆక్రమించుకున్న ఆమె./ అందుకనే, అతనికి- ‘ఆమె నా బొమ్మ’. / నారూపం, నా స్వరూపం, నా నిలయం, నా లయం, నా దర్శం, ఆదర్శం, నా దేహం, నా దాహం, అంతా లోని అణువణువూ ఆమే./ ఎక్కడ నుంచో శిశురోదన వినబడుతోంది./ “పుట్టినట్టు స్పృహలేదు/ పేగు తెలిన గాయం లేదు/ వొళ్లు ముడుచుకొని, కళ్లుమూసుకొని/ నా లోకపు గర్భకుహూరంలో నేను/ నన్ను పలకరించని మీ భాషలకూ/ స్పర్శించని మీ జ్ఞానానికి ఆవల -/ కదిలితే ఉమ్మనీటి అలికిడి/ అంతటా కమ్ముకునే అమ్మవాసన /శూన్యంలో పుట్టినట్టింకా కలగనలేను / ఎవరూ కోయని బొడ్డును గుండె కింద దాచలేను/“ధగద్ధగాయమానమైన ఒక స్త్రీమూర్తి కావాలి నాకు/ మందుబెట్టి మలుపుకుండా అన్నంత/ మోహంలో చుట్టెయాలి/ బొడ్డుపేగు పట్టున/ వడిసెల రాయిలా తురుగుతున్న నన్ను/ అమాంతం అందుకొని అదుముకోవాలి”/ “ఎదురుపడ్డ దేహాల్లోకి నేను/ అసంకల్పితంగా ప్రవేశిస్తాను/ టన్నెల్ ో్లకి దూసుకుపోయే రైలు యింజన్ లాగా/ చొచ్చుకుపోతాను, మాయమవుతాను/ చెరువులో ఈదుతూ/ అడుగున ఇసుక కోసం మునిగినట్లు/ దేహాల్లో మునుగుతాను”/ “ఇప్పుడు నా దేహమంతా/ ఒకే లైంగికావయవపు విశ్వరూపం/ నా విముక్త ప్రపంచపు/దారుల్లోకి ద్వారం తెరిచే/ యోని కోసం తచ్చాడుతున్నా/ తడుముకుంటున్నా-”/ -ఏది పాల బాల్యమో, ఏది బుసబుసపొంగే యవ్వనమో, ఏది మధనమో, ఏది మైధునమో-/ “పాలు మరచినట్టే లేదు/చన్ను వొదిలి చన్నుబట్టేదాకా నీ కోసమే తపించాను/ ఉంగా ఉంగా అని గుక్క పెడుతున్నాను./

ఉగ్గుపాలుబట్టు, పాలబువ్వ పెట్టు/ నువ్వు తల్లివో, ప్రియురాలివో, కూతురువో/ పొట్ట చేతబట్టుకొని దేశాలు తిరిగినట్టు/ శక్తులన్నీ ఒక అంగం కొసన నిలిపి నడుస్తున్నాను/ కల, బతుకంతా ఒకే కల/ గుళ్లు గోపురాలు శిల్ప మైధునాల మైధునశిలలు/ యోనిపూజలు చిత్రరేఖలు తాంత్రిక ముగ్గులు/ చీకటిచెట్ల కొమ్మల్నుండి వేలాడే నరాలు/ లోకల్లో ఇరుక్కున్న కాళ్లలోంచి పాకే నులి వెచ్చని చలి” -/ “ప్రేమించడ మొక ఆది కళ”/ “మహానగరానికొచ్చాను/ భూమికీ ఆకాశానికీ మధ్య గాలి ఏడల్లో జీవిస్తున్నాను”/ “నగరాల్లో భూమీ వుండదూ ఆకాశమూ వుండదు”/ “కన్వేయర్‌బెల్ట్ మీద నడక”/ “ఎడారి ప్రయాణంలో పాదముద్రల్ని చెరిపేసే తుఫాన్లు/ ప్రవహించే అలల కింద పడవను కదలనీయని లంగర్లు”/ “మీ యిద్ద మధ్య/ రెండు సమాధుల మధ్య పెరిగిన రెల్లుగడ్డి పువ్వును/ రెండు స్మశానాల మధ్య తవ్విన సరిహద్దు బొందను”/ “దు:ఖం రహస్యం రహస్యంగానే వుండనీ/ అన్నీ ఎంగిలిగానీ- ఒక్క దు:ఖం తప్ప”/ “నిప్పు బువ్వ తినిపించు”/ “ఆత్మకు లింగం వుందా?”/ “ఇంకేమీ లేదు – నేనూ నా కట్టె/ మృత్యుపెదాల ముద్దులు కౌగిలింతలు సరసాలు/సత్యాల శకలాలు అబద్ధాల ప్రవాహాలు-/ అంతా ఇక నిశ్శబ్దం/ పాడెమీద శవం కట్ల వత్తిడి/ కూచున్న శవాల శావల కింద దూరిపోతున్న జీవులు/ ఏడుపులు/ పేగుల్తో వాయించిన రుద్రవీణలు/ నాలుక మీది విభూతి బొట్టుల్లో గుచుకున్న నార్సం తీగలు/ బళ్లేలు/ తెగిపడ్డ తలలు/ తలల్ని చేతుల్లో పట్టుకుని నడిచే మొండేలు/ చేతుల్ని నరికిన తరాల రంపపు పళ్లు” -/ “ఎప్పుడో బొందలో కూచున్న నా శవం పెదవుల రహస్య కదలిక/ -మట్టి-మృత్యువు- కవి /ఒకటే రూపం.

అనేక ప్రతిబింబాలు”/ – చివర్లో కొన్ని కాకులు కొట్లాడుకుంటాయ్-” / గర్భస్థం, శిశురోదనం, పాలచన్ను, చన్నుల యవ్వనం, యోనియానం, రతిరుతువు, ఆకలి, మహాకలి, బతుకుపొట్ట మీద గునపాలు, తలమీద రోహిణీఎండలు, వానలు, తుఫానులు, వొణికించే శీతాకాలాలు, గరభస్థలి నుండి స్మశానస్థలి వరకూ, ముగింపులోకొన్ని తీతువులు కూస్తాయి, కొన్ని నక్కలు ఊళలు వినిపిస్తాయి, భయంకర శ్శరభశ్శరభాలు ఊరేగుతాయి. యవ్వనవెన్నెల వెలుగులూ, చీకటి ఆకట్ల కష్టాలు కాష్టాలూ వాటి మూలాలూ అతని కవిత్వంలో చూస్తే కనబడతాయి, వింటే వినబడతాయి. సైదా మన చేతిని గట్టిగా పట్టుకుని గాలిలో తేలుతూ భూకక్ష్యని దాటి, సూర్యగోళంవలె భగభగ మండే మరో అగ్నిగోళం ‘స్త్రీ గోళం’లోకి మనల్ని తీసికెళతాడు. అక్కడి ‘నీలంమాయ’లోకి ప్రవేశిస్తాం./ మొదట్లోనే- “స్త్రీలు’8 శీర్షికతో, కావ్యలక్షణాలు పుష్కలంగా వున్న దీర్ఘకవిత మనల్ని ఆహ్వానిస్తుంది.

బహువచనం, ఏకవచనమై ప్రతి పదమూ మంటల సెగలై చుట్టుముడతాయ్./ “అనేక ముఖాలు/ అనేక వక్షోజాలు /అనేక గర్భాలు/ అగ్ని పర్వతంలాంటి స్త్రీలు / మంచు ముత్యంలాంటి స్త్రీలు/ శుభ్రదేహంతో ప్రవేశించాలి స్త్రీ గర్భగుడిలోకి / అగ్నిస్నానంతో కాలుమోపాలి స్త్రీ మర్మమందిరంలోకి/ స్త్రీ ఒక ప్రతీక / ఎంతకూ చేరలేని ఒక నిర్మానుష్య ద్వీపం/ నిరంతరమూ సమాధానం లేని ఓ ప్రశ్న/ తనకు తనే తెలీని/ ఒక నిర్లజ్జాపూరిత ఉనికి/ ఒంటికి సూర్యవస్త్రాన్ని చుట్టుకున్న చీకటి తేజం/ చీకటి మెరుపుల్ని ఆపాదించుకున్న/ భయాన్విత అగ్ని శూన్యం”-/ “కవిత్వోపాసనా, సౌందర్యశోధనా జీవితం/ కవిత్వీకరించటం, స్థవించటం రెండూ మృత్యువే”/ “జననం మరణం/ ఒక గర్భం నుంచి మరో గర్భానికి ప్రయాణం/ కవాటాలు తెరుచుకుంటూ/ కవాటాలు మూసుకుంటూ బతుకంతా”/ “ఎక్కడున్నావు నువ్వు/ ప్రజ్వరిల్లే శతవర్ణాల వెనుక/ ఇంద్రధనస్సుల్ని వెదజల్లే వివర్ణంవలా/ ఆదివర్ణంలా/ ఆదిమ శబ్దంలా/ ఎక్కడున్నావు?”/ అతని కవిత్వాల్లో -/ చుట్టుముట్టే శారీరక వాంఛలు/ జన్మత్త నాలుకల పెదవుల మెలికలు,/ బుసలు కొడుతూ ఎదుర్కొనే వక్షోజాలు,/ సరసరసర్రున పాకే సరీసృపాల బంధనాల కౌగిలింతలు,/ ఉష్ణమండలంలో నిచ్చుకున్న యోనులు/ వీర్యవర్షాలు, మొదలైన కామకేళీ భంగిమలు/ ఎదురైనప్పుడు -/ సైదాని రూపమెత్తినకాకలెత్తినకాముకుడిగా ముద్రవేసే ప్రమాదముంది.
సరే. ఒకవైపున కామంతో కాగిపోతున్న వాడే. యిది శారీరకమే. భౌతికమే. మరి, విశాలమైన, గంభీరమైన సృజనకారుడి జీవితాన్నికూడా అర్దం చేసుకోవడానికి ప్రయత్నించాలిగదా./ అతనిది దేశదిమ్మరి కుటుంబం. మెతుకులు ఎక్కడ దొరుకుతాయో వెతుక్కుంటూ తిరిగే సంచార కుటుంబం. కొనవూపిరితో కాలం గడిపే కుటుంబం. పని దొరికితే బతికినట్టు, లేకపోతే, ‘రేపు’ లేనట్టు. / అతను, అలాగే ప్రాణం అంచులో బతుకుతున్నాడు.

అలాగే, పెరుగుతున్నాడు. బాల్యమేదో, యవ్వనమేదో తెలీని రుతువుల్లో స్పృహ, నిస్పృహగా పెరుగుతున్నాడు. కష్టాలే నిజం, సుఖాలు అబద్ధంగా బతుకుతున్నాడు. పడ్డ కష్టాలు మనసును స్శశానంగామార్చాయి. తన శవాన్ని తానే మోస్తున్నట్టు, తన పాడె తానే కట్టుకుంటున్నట్టు, తన చితికి తానే మంట పెట్టుకున్నట్టు భగభగమంటల్లో తన జీవితం కాలిపోతున్నట్టు వూహలు.
అలాగే, మనసూ కాలిపోతున్నది. ఎవరైనా మంటలు చల్లార్చఆనికి వస్తారేమో, చితినుంచి బయటికి తీసుకువస్తారేమో, హత్తుకుని బతుకుపై భరోసా యిస్తారేమో!/ ఆ ఎదురుచూపులే కవ్వం చేసి, మధనం ప్రారంభించాడు. మధునంలోంచి, మొదట-కష్టాల విషం చిమ్ముకుంటూ పైకొచ్చింది. గొంతులో దాచుకున్నాడు./ తరువాత, కవిత్వం వచ్చింది. తనివితీరా తాగాడు. దాని బలంతో తిరిగి మధనం చెయ్యగా చెయ్యగా- ఎప్పటికో-ధగద్ధాయమానంగా వెయ్యి కాంతులతో ఓ స్త్రీ నవ్వుతూ, దీవిస్తూ వచ్చింది.

అతని దృష్టిలో ఆమె సర్వసృష్టిని తిరిగి తిరిగి పరం పరను సృష్టించే అధిష్టాన దేవత. అంతేకాదు, విశ్వంలోని అన్ని గోళాలలను నియంత్రించే దేవదేవత. ఆమే ఒక మహాగోళం, అన్ని గోళాలను మించిన గోళం./ సూర్యుడు ఆమె ముక్కుపుడక, చంద్రుడు జడబిళ్ల./ మొత్తం విశ్వాన్ని తనలో యిముడ్చుకున్న మహోన్నత గోళంలా స్త్రీని భావించాడు, సైదా. / తన అవయవాల వాంఛల్నీ, రతిక్రీడల్నీ, సంకేతమయమైన స్త్రీ అవయవాల్లో లీనమై తీవ్రంగా, గాఢంగా ప్రేమించి, కామించి, అర్పించి, పలవరించాడు. కవిత్వంలో యింతగా సాధించడం అనితరసాధ్యం. / ఇప్పటివరకూ ఎవరూ స్త్రీని, స్త్రీత్వాన్ని, అఖండ స్త్రీని, బ్రహ్మాండ స్త్రీని, సర్వసృష్టిని తన గర్భంలోంచి పరంపరగా ప్రసవించే స్త్రీని ఎవరూ వూహించలేదు. దర్శించలేదు. సాహిత్యంలో ప్రతిష్టించలేదు./ స్త్రీని ఒక మహాగోళంలా చూడగలగడానికి, సైదా పాలపుంతల్లో నివాసిగా వుండడం వల్లనే యిది సాధ్యమైంది./ సైదారససిద్ధుడు. / కవనాన్నీ, స్త్రీనీ ఆవాహన చెయ్యగలవాడు!/ అర్ధనారీ కవనేశ్వరుడు.

నగ్నముని

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News