బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ పై అతడి ఇంట్లోనే దుండగుడు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సైఫ్ ముంబై లోని లీలావతి ఆస్పత్రిలో కొన్ని రోజుల పాటు చికిత్స తీసుకున్నారు. అతడి ఆరోగ్యం కుదుటపడడంతో మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. ఆ సమయం లోనే తనను కాపాడిన ఆటోడ్రైవర్ భజన్‌సింగ్‌ను సైఫ్ కలిశారు. ఐదు నిమిషాల పాటు ఆయనతో మాట్లాడారు. అతడిని కౌగిలించుకుని ధన్యవాదాలు తెలియజేశారు. సకాలంలో స్పందించిన భజన్‌సింగ్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ సంస్థ భజన్‌సింగ్‌కు శాలువా కప్పి రూ.11 వేల నగదు బహుకరించి సత్కరించింది.
ఆరోజు దుండగుడు చేసిన దాడికి తీవ్రంగా గాయపడిన సైఫ్‌ను కుటుంబ సభ్యులు లీలావతి ఆస్పత్రికి తరలించారు. ఇంట్లో కారు సిద్ధంగా లేకపోవడంతో సైఫ్ పెద్ద కొడుకు ఇబ్రహీం ఓ ఆటోలో సైఫ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానాకు తన ఆటోలో ఎక్కింది బాలీవుడ్ నటుడు సైఫ్ అని తెలీదు. ఆస్పత్రిలో దిగిన తర్వాతే సైఫ్ సంగతి అతనికి తెలిసింది. దాంతో ఆటో ఛార్జి కూడా తీసుకోకుండా భజన్‌సింగ్ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో తనను కాపాడిన ఆటోడ్రైవర్‌ను సైఫ్ అలీఖాన్ స్వయంగా కలుసుకుని అభినందించడం పలువురి ప్రశంసలు చూరగొంది.