మెడికో ప్రీతిని సీనియర్ విద్యార్థి సైఫ్ వేధించడం నిజమేనని ర్యాగింగ్ నిరోధక కమిటీ స్పష్టం చేసింది. కాకతీయ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రీతి.. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రీతి గత ఫిబ్రవరి 22న ఎంజిఎం ఆస్పత్రిలో ఆత్మహత్యకు ప్రయత్నించింది. అదే నెల 26న కన్నుమూసింది.
ఈ కేసులో సైఫ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని ఏడాదిపాటు తరగతులకు రాకుండా ర్యాగింగ్ నిరోధక కమిటీ వేటువేసింది. ఈ నిషేధం మార్చి 3వ తేదీతో ముగియనుంది. అయితే కమిటీ మరో 97 రోజులపాటు నిషేధాన్ని పొడిగించింది. సస్పెన్షన్ పై సైఫ్ హైకోర్టుకు వెళ్ళాడు. కోర్టు అతనిపై సస్పెన్షన్ ను తాత్కాలికంగా తొలగించింది. రెండు నెలల క్రితం హైకోర్టు ఆదేశాల మేరకు జరిగిన ర్యాగింగ్ నిరోధక కమిటీ సమావేశానికి సైఫ్ హాజరై, వివరణ ఇచ్చాడు. దీనిపై ర్యాగింగ్ నిరోధక కమిటీ కోర్టుకు తాజాగా తన వాంగ్మూలం అందజేసింది. ఇందులో సైఫ్ పై వచ్చిన ఆరోపణలు నిజమేనని కమిటీ స్పష్టం చేసింది. దీంతో కమిటీ విధించిన సస్పెన్షన్ ను సమర్థిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.