Monday, December 23, 2024

మిగతా జిల్లాలకు సైనిక్ స్కూళ్ళు ఎప్పుడు?

- Advertisement -
- Advertisement -

భారత దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన పిల్లలను కనుగొనడం, వారి కుటుంబాల సామాజిక -ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా, ఉత్తమ రెసిడెన్షియల్ పాఠశాల వ్యవస్థతో సమానమైన విద్యను అందించడం కోసం నవోదయ పాఠశాలను కేంద్ర ప్రభుత్వం స్థాపించినది. జాతీయ విద్యావిధానం 1986 అమల్లో భాగంగా నవోదయ పాఠశాలలు దేశంలోని అన్ని జిల్లాల్లో ఏర్పడ్డాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన తర్వాత తెలంగాణలో పది జిల్లాలు 33 జిల్లాలుగా ఏర్పడ్డాయి. ప్రస్తుతం రంగారెడ్డి, కామారెడ్డి, ఆసిఫాబాద్, వరంగల్ , నాగర్ కర్నూల్, నల్గొండ, సిద్దిపేట, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ఇంకా 23 జిల్లాలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు పంపినా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేయలేదు.

అలాగే దేశంలోని 661 నవోదయ విద్యాలయాల్లో ప్రస్తుతం 3978 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణలోని 9 నవోదయ విద్యాలయాల పరిధిలో 69 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. అలాగే ఉమ్మడి రాష్ట్రం విభజన తర్వాత రెండు సైనిక పాఠశాలలు కూడా ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించబడ్డాయి. తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదు. తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం 2017 మార్చి 2 న ఆమోదం తెలిపినప్పటికీ ఇంత వరకు నిధులు కేటాయించకపోవడంతో దాని ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారింది. ఈ బడ్జెట్‌లో నైనా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో నవోదయ, సైనిక్ పాఠశాలల ఏర్పాటుకు, ఉపాధ్యాయుల నియామకానికి నిధులు కేటాయించాలి.

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల సమగ్రాభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు మన బడి‘ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రూ. 7289 కోట్ల నిధులతో మూడు దశల్లో పాఠశాలలో పన్నెండు రకాల విభాగాలను పటిష్ట పరిచేందుకు కంకణం కట్టుకుంది. దీని కొరకు ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృద్ధి నిధులు, నియోజకవర్గ అభివృద్ధి నిధులు, సమగ్ర శిక్ష అభియాన్ నిధులు కేటాయించారు. ప్రస్తుతం 1200 ప్రభుత్వ పాఠశాలల్లో పనులు పూర్తయినాయి. మిగతా ప్రభుత్వ బడులలో అదనపు గదుల నిర్మాణం, డిజిటల్ విద్య, మంచి నీరు, ఫర్నిచర్, ప్రహరీ గోడలు, విద్యుదీకరణ మొదలైన పనుల కోసం కేంద్రం నుండి ఆర్ధిక తోడ్పాటు అవసరం.

ప్రభుత్వ బడుల అభివృద్ధికి నడుం బిగించిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించి బడులను బలోపేతం చేయాలి. హైదరాబాదులోని కోఠి మహిళా కళాశాలను మహిళ యూనివర్సిటీగా ఏర్పాటు చేయనున్నారు. ఈ కళాశాలలో మౌలిక వసతుల కల్పన కోసం రూ. 150 కోట్లు అవసరమని ఉస్మానియా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినారు. ఈ మహిళ విశ్వవిద్యాలయ అభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్ లో నిధుల కేటాయింపు జరిగితే మహిళా విద్యకు చేయూత లభిస్తుంది. విభజన చట్టంలోని హామి మేరకు గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం భూపాలపల్లి జిల్లాలో స్థలాన్ని ఎంపిక చేసి కేంద్ర ప్రభుత్వానికి అప్పగించినా ఇంత వరకు గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ఊసేలేదు. ఈ బడ్జెట్‌లో నైనా గిరిజన యూనివర్సిటీ నెలకొల్పడానికి నిధుల కేటాయింపు జరగాలి. అలాగే భారత దేశంలో మొదటి ఫారెస్ట్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అనుగుణంగా ఈ కేంద్ర బడ్జెట్లో ఆ విశ్వవిద్యాలయా ఏర్పాటుకు నిధుల కేటాయింపు జరగాలి. కరీంనగర్ జిల్లాలో ట్రిబుల్ ఐటిని, హైదరాబాదులో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌ను, ఐఐఎంను నెలకొల్పవలసిన అవసరం ఉంది. వీటికి కూడా కేంద్రం బడ్జెట్ కేటాయింపులు చేయాలి.

అంకం నరేష్
6301650324

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News