హైదరాబాద్: ఉద్యోగ సంఘాలు చేస్తున్న 3 డిమాండ్లకు కాలం చెల్లిందని మంత్రి సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఉద్యోగుల అకౌంట్లలో వేతనాలు పడ్డాయని, రెండు డిమాండ్లు నెరవేర్చడం సాధ్యపడదన్నారు. పట్టుబట్టే బదులు ప్రధాన సమస్యలపై చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. డిమాండ్లు తీర్చడానికి అవకాశం లేని పరిస్థితి ఇప్పుడు ఉందన్నారు. ఉద్యోగ సంఘాల కార్యాచరణ వాయిదా వేసుకోవాలని కోరామన్నారు. ఇప్పటి వరకు నేతల నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. రేపు ఉద్యోగులు చేసేది బల ప్రదర్శన అని, వైషమ్యం పెంచుకోవడం కోసం చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ఆందోళనలో సంఘ విద్రోహ శక్తులు చొరబడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటుందని, ప్రజల ఇబ్బంది తొలగించడం ప్రభుత్వం బాధ్యత కాదా? అని ప్రశ్నించారు. ఉద్యోగులపై చర్యలు తీసుకునే పరిస్థితి తెచ్చుకొవద్దని హెచ్చరించారు. కొత్త పిఆర్‌సితో ఉద్యోగులకు జీతం తగ్గలేదని, పెరిగిందన్నారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదని చెప్పడం లేదని, మార్పులకు అవకాశం ఎప్పుడూ ఉంటుందని, చర్చలకు వచ్చి పరిష్కరించుకోవాలని ఉద్యోగులను కోరుతున్నామన్నారు.