అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాబోతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టిడిపి-జనసేన పొత్తులో భాగంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి శనివారం 118 అభ్యర్థుల ఉమ్మడి జాబితాను ప్రకటించారు. ఈ క్రమంలో వైసిపి మంత్రులు పవన్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పవన్ దయనీయంగా మారారని.. తనకు బలం లేదని ఆయనే ఒప్పుకుంటున్నారని ప్రభుత్వ సలహాదారు, మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఏద్దేవా చేశారు.చంద్రబాబు.. జనసేనను మింగాలని ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. జనసేన అభ్యర్థులను కూడా చంద్రబాబే డిసైడ్ చేస్తున్నారని.. జనసేన, టిడిపికి అనుబంధ విభాగంగా మారిందన్నారు. టిడిపికి పవన్ ఉపాధ్యక్షుడు అయితే బాగుంటుందని సెటైర్ వేశారు. ఇక, చంద్రబాబు బిజెపితో పొత్తుకు ఆరాటపడుతున్నాడని.. ఎంత మంది వచ్చినా మళ్లీ జగన్ ఓడించలేరని.. మరోసారి వైసిపి సర్కారే రాష్ట్రంలో రాబోతుందని సజ్జల ధీమా వ్యక్తం చేశారు.
మంత్రి ఆర్కె రోజా కూడా పవన్ ను ఎద్దేవా చేస్తూ సెటైర్స్ వేశారు. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేయాలో ఇంకా చంద్రబాబు డిసైడ్ చేయలేదని.. కుక్కకు బిస్కెట్లు వేసినట్లు 24 సీట్లు ఇస్తే తోక ఊపుకుంటూ పవన్ ఎందుకు వెళ్లారని అన్నారు. అయితే బీజేపీ, లేకపోతే కాంగ్రెస్.. ఎవరితో అంటే వాళ్లకు పవన్ జైకొడతారు మంత్రి రోజా విమర్శించారు.